పోలవరం సెంచరీ కొడుతుందా… ?

పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు మరో ఇరవై ఏళ్ళలో నూరేళ్ళు పూర్తి అవుతాయి. సరిగ్గా 1942లో పోలవరం ప్రతిపాదన వచ్చింది. మరి ఎనభైయేళ్ళుగా ఒక ప్రాజెక్ట్ కల సాకారం [more]

Update: 2021-08-10 09:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు మరో ఇరవై ఏళ్ళలో నూరేళ్ళు పూర్తి అవుతాయి. సరిగ్గా 1942లో పోలవరం ప్రతిపాదన వచ్చింది. మరి ఎనభైయేళ్ళుగా ఒక ప్రాజెక్ట్ కల సాకారం కాలేదు అంటే ఇది ప్రపంచ రికార్డుగానే చూడాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించింది. దానికి ఏపీ చెల్లించిన మూల్యం అడ్డగోలు విభజన. ఇంత జరిగాక కూడా గత ఏడేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి కేంద్రం ఆపసోపాలు పడుతోంది. నానా అవస్థలు పెడుతోంది.

జస్ట్ ట్వంటీ పెర్సెంట్….

పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన అంచనాలు 55 వేల కోట్లు అన్నది రెండేళ్ల క్రితం నిర్ణయించినది. ఈ రోజు రేటుకు చూస్తే మరికొంత ఎక్కువ అవుతుంది. టెక్నికల్ కమిటీ ఆమోదించినా కూడా నిధులు ఇవ్వడానికి కేంద్రం మీనమేషాలు లెక్కవేస్తోంది అంటే ఇది అక్షరాలా అరవై వేల కోట్లకు ఎగబాకినా ఆశ్చర్యం లేదు. ఇక పోలవరానికి మొత్తం నిధులు కేంద్రం ఇస్తోంది అని ఏపీ బీజేపీ నేతలు గొప్పగా చెబుతూ ఉంటారు. మరి 55 వేల కోట్లలో ఇంతవరకూ ఇచ్చింది ఎంత అంటే 11 వేల కోట్లు. అంటే కచ్చితంగా 20 శాతం మాత్రమే అన్న మాట.

వందేళ్ళ పండుగేనా…?

దీని బట్టి లెక్క వేసుకుంటే పోలవరం నిజంగా పూర్తి అయ్యేటప్పటికి 2250 వచ్చేస్తుంది అంటున్నారు. ఏడేళ్ళకు 20 శాతం, మిగిలిన ఎనభై శాతానికి మరో 28 ఏళ్ళు అంటే 2050 వస్తుంది అంటున్నారు. ఈలోగా సవరించిన లెక్కలు అంచనాలు మారి లక్ష కోట్లకు చేరితే ఇక పోలవరాన్ని పూర్తి చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అంటున్నారు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీ కాదా అన్నదే ప్రజల ప్రశ్న. తాము కోరుకోని విభజనను చేసి ఏపీకి తీరని నష్టం కలిగించారు. మరి దానికి ఎంతో కొంత ఊరటగా పోలవరాన్ని ఇచ్చారు. కనీసం అయిదారేళ్ల లోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇచ్చినా జనాలు సంతోషిస్తారు. కానీ ఇక్కడ లేనిది చిత్తశుద్ధి, ఉన్నది నిర్లక్ష్యం. అందులే పోలవరం ఏపీకి శాపంగా మారుతోంది.

ఝలక్కేనా…?

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆర్ ఆర్ ప్యాకేజితో తమకు సంబంధం లేదు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. అంటే ఏకంగా 35 వేల కోట్లకు ఝలక్ ఇచ్చినట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కేవలం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి 20 వేల కోట్లను మాత్రమే తాము ఇస్తామని చెప్పకనే చెబుతున్నారు. అది కూడా వాయిదాల మీద వాయిదాలతో. అంటే రేపటి రోజున పోలవరం స్ట్రక్చర్ తో సహా పూర్తి అయినా కూడా పునరావాసం కల్పించి జనాలను తరలించకపోతే నీటిని ఎక్కడ స్టోరేజ్ చేస్తారు. పోలవరం కట్టి ఉపయోగం ఏంటి. దాని పరమార్ధం ఎలా దక్కుతుంది. ఇవన్నీ ప్రశ్నలు. కానీ కేంద్రానికి ఇవి అనవసరం. తాము కట్టామా లేదా అన్నదే చూడమంటున్నట్లుగా సీన్ ఉంది. అందుకే 55 వేల కోట్లకు ఆమోదముద్ర పడడంలేదు అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బీజేపీ ఇలా చేస్తే మాత్రం ఏపీకి ఇంతలా గొంతు కోసిన రికార్డు మరో సర్కార్ కి ఉండదనే చెప్పాలి. విభజన కంటే ఇది అతి పెద్ద పాపంగా కూడా చూడాలి.

Tags:    

Similar News