పోల‌వ‌రం స్టోరీలో అన్నీ ట్విస్టులే.. ఏం జ‌రుగుతోందంటే?

ఏపీ ప్రజ‌ల‌కు ఎంతో కీల‌క‌మైన‌, రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుగా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న పోల‌వ‌రం బ‌హుళార్థ సాథ‌క ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఇది [more]

Update: 2021-04-25 05:00 GMT

ఏపీ ప్రజ‌ల‌కు ఎంతో కీల‌క‌మైన‌, రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుగా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న పోల‌వ‌రం బ‌హుళార్థ సాథ‌క ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఇది ఎప్పటికి పూర్తవుతుంది? గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది నిజ‌మా? లేక‌.. జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌లు వాస్తవ‌మా? ఇవ‌న్నీ కాకుండా.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్రచారానికి వ‌చ్చిన ప్రధాని మోడీ చేసిన 'ఏటీఎం' అనే ఆరోప‌ణ‌లు అక్షర‌స‌త్యమా? అనే విష‌యాలు మాత్రం ఇప్పటికీ తేల‌లేదు. చంద్రబాబు హ‌యాంలో ప్రతి సోమ‌వారాన్ని.. పోల‌వారంగా మార్చుకుని స‌మీక్షలు చేశారు. దాదాపు 40 సార్లు ఆయ‌న పోల‌వ‌రం ప్రాంతంలో ప‌ర్యటించారు. నిత్యం దీనిని హైలెట్ అయ్యేలా మీడియాలోనూ మేనేజ్ చేసుకున్నారు.

ఎవరు చెప్పింది నిజం?

దీంతో ఇంకేముంది.. పోల‌వ‌రం 2018 చివ‌రినాటికి గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామ‌ని.. అప్పట్లో జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా ఉన్న దేవినేని ఉమా సైతం ప్రక‌టించారు. అదేస‌మ‌యంలో టీడీపీ అనుకూల మీడియా కూడా 80 శాతం పూర్తయిపోయింద‌ని పేర్కొంటూ.. పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసుకొచ్చింది. అయితే.. ప్రభుత్వం దిగిపోయి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస‌రికి .. ప్రాజెక్టు ఇంకా పునాదులు పూర్తి కాలేద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లే గేట్లు బిగించారు. దీంతో అస‌లు ఎవ‌రు చెప్పింది నిజం అనేది ఎవ‌రికీ స్పష్టత లేదు. మ‌రీ ముఖ్యంగా పోల‌వ‌రంలో అక్రమాలు జ‌రిగాయ‌ని.. కాంట్రాక్టర్లను మార్చడం ద్వారా బాబు కోట్లు పోగేసుకున్నార‌ని ఎన్నిక‌ల‌కు ముందు ఆరోపించిన వైసీపీ నేత‌లు.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విచార‌ణ పేరుతో కొన్నాళ్లు హ‌డావుడి చేసినా.. త‌ర్వాత ఏమీ క‌నిపించ‌లేదు.

నిర్వాసితుల కోసం…..

ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం కోసం వ‌చ్చిన అప్పటి ప్ర‌ధాని మోడీ కూడా చంద్రబాబుకు పోల‌వరం ఒక ఏటీఎం మాదిరిగా మారింద‌న్నారు. పోనీ.. ఆయ‌నైనా.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారా? ఆ ఏటీఎం సంగ‌తులు ఏమిటో ప్రపంచానికి చెప్పారా? అంటే.. అది కూడా లేదు. మ‌రోవైపు నిర్వాసితుల‌కు ఇవ్వాల్సిన పున‌రావాస ప్యాకేజీ విష‌యంలోనూ గ‌తంలో చంద్రబాబు ఒక‌టి చెబితే.. ఇప్పుడు జ‌గ‌న్ మ‌రొక‌టి చెబుతున్నారు. వారికే 33 వేల కోట్లు ఇవ్వాల‌ని అంటున్నారు. కానీ, అక్కడ అంత ఖ‌ర్చు ఉందా? అనేది కూడా సందేహ‌మే. ఇక‌, కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంది క‌నుక‌.. 22 వేల కోట్లు మాత్రమే ఇస్తామ‌ని కేంద్రం చెబుతోంది. అయితే.. మారిన అంచ‌నాల నేప‌థ్యంలో 55 వేల కోట్లు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హ‌యాంలోనే కేంద్రానికి అభ్యర్థన పంపించింది.

జగన్ హయాంలోనూ….

కానీ, అప్పట్లో విప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ దీనిని వ్యతిరేకించినా.. తాను అధికారంలోకి వ‌చ్చాక‌.. దీనినే ఆమోదించాల‌ని కాళ్లా వేళ్లా ప‌డుతున్నారు. ఇలా .. పోల‌వ‌రం విష‌యంలో గ‌తంలో పూర్తయిపోయింద‌ని కొన్నాళ్లు.. లేదు కాలేదని ఇప్పుడు.. ఆర్ అండ్ ఆర్ ఖ‌ర్చు ఉంద‌ని పెరిగింద‌ని.. ఇలా అస‌లు పొంతన‌లేని వాద‌న‌లు.. విమ‌ర్శల‌తో ప‌త్రిక‌లు.. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వకుండా.. ఓ త్రిశంకు స్వర్గంలో ఉంచ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పోల‌వ‌రం క‌థ‌లో రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తాయో చూడాలి.

Tags:    

Similar News