పోలవరంపై ఇంతకీ తప్పు ఎవరిది బాబూ?

పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కచ్చితంగా కట్టాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలకు ఉంది. అలాగే విభజన హామీలను తుచ తప్పకుండా అమలు చేయాలి. అసలు పార్లమెంట్ అత్యున్నత వేదిక. [more]

Update: 2020-11-12 09:30 GMT

పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కచ్చితంగా కట్టాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలకు ఉంది. అలాగే విభజన హామీలను తుచ తప్పకుండా అమలు చేయాలి. అసలు పార్లమెంట్ అత్యున్నత వేదిక. అక్కడ చట్టాలు చేసేవారు తామే వాటిని గౌరవించకపోతే ఎంతటి నగుబాటో కాషాయం పార్టీ పెద్దలకు ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ఏదైనా తమకు అనుకూలంగా చేసుకోవడమే బీజేపీ నేతలకు అలవాటు అయిన వేళ ఏపీకి నోటి మాటగా గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని ప్రత్యేక హోదాను తొక్కిపడేయడంలో ఆశ్చర్యం కూడా ఏమీలేదు.

అవినీతి జరిగిందట …

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు పెద్ద గొంతుక వేసుకుని మరీ తాపీగా ఇపుడు నిజాలు చెబుతున్నారు. అవును మరి ఆయన ఇపుడే నిద్ర లేచినట్లుగా మాట్లాడుతున్నారు. ఏపీలో ఆరున్నరేళ్ళుగా రెండు ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. కేంద్రంలో అయితే ఒకే ప్రభుత్వం ఉంది. పైగా చంద్రబాబుని పదేళ్ల తరువాత మద్దతు ఇచ్చి మరీ ముద్దుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన మోడీ అక్కడ ప్రధాని. ఆయనే స్వయంగా ఏపీకి వచ్చి పోలవరాన్ని ఏటీఎం గా బాబు వాడుకుంటున్నారు అని ఘాటుగానే ఆరోపించారు. మరి అంతటి ప్రధాని కూడా ఎందుకు తన చేతిలోని సీబీఐని అదేశించి విచారణ జరిపించలేకపోయారన్నదే ఇక్కడ ప్రశ్న.

రివర్స్ గేర్ లోనేనా…?

పోలవరానికి నిధులు తగ్గించేసిన విషయంలో బీజేపీ కచ్చితంగా డిఫెన్స్ లో పడింది. ఇది వాస్తవం. ఏపీలో జనాల మనోభావాలతో ముడిపడిన ఈ ప్రాజెక్ట్ అడుగు ముందుకు కదలకపోయినా బీజేపీనే ఏపీ జనాలు ఆడిపోసుకుంటారు. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి. జగన్ చంద్రబాబు పేరు చెప్పి జనాలను రెచ్చగొట్టినా వారు అసలు శాంతించరు అని కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. అయినా సరే ఇక చేసేది లేక అవినీతి ఆయుధాన్ని నమ్ముకున్నారు. దానికి కారణం కూడా ఉంది. గతంలో జగన్ చంద్రబాబుని ఇవే ఆరోపణలు చేశారు కాబట్టి. తాము ఆ అవినీతి చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, జగన్ కూడా ఇరుకున పడుతారు అని సోము వీర్రాజు తెలివిగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. కానీ అది బూమరాంగ్ అవుతోంది మరి.

కట్టి చూపించాలిగా…?

నిజంగా బీజేపీకి చిత్తశుధ్ధి ఉంటే ఇలాంటి ఆరోపణల మీద విచారణ జరిపించాలి. ఎవరు పోలవరానికి ఇచ్చిన నిధులను దోచుకున్నారో జనాల ముందే పెట్టి నిరూపించాలి. అదే సమయంలో ప్రజల జీవినాడి అయిన పోలవరాన్ని కట్టి చూపించాలి. అంతే తప్ప అవినీతి జరిగింది కాబట్టి ఇంతే నిధులు ఇస్తామనడం మాత్రం క్షంతవ్యం కానే కాదు. మరి ఏపీ రాజకీయాల మీద బీజేపీకి నిజంగా ఆసక్తి ఉంటే ఆడాల్సింది తొండి ఆట కాదు, డైరెక్ట్ గా జనం మనసు గెలుచుకునే ఆట. అదే పోలవరం నిర్మాణం చేయడం. సోము వీర్రాజు కూడా బాబుని, జగన్ని తిట్టి ఉపయోగం లేదు, కేంద్రంతో చెప్పి పోలవరాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటేనే ఏపీలో బీజేపీ బతికి బట్టకట్టేది, అదే సమయంలో ఆ పార్టీకి రాజకీయ పరపతి కూడా పెరిగేది.

Tags:    

Similar News