పితాని చేజేతులా చేసుకున్నట్లేనా?

సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ వ్యవ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెనుగొండ / ఆచంట నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మూడుమార్లు వ‌రుస‌గా [more]

Update: 2020-07-17 06:30 GMT

సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ వ్యవ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెనుగొండ / ఆచంట నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మూడుమార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన పితానికి మంచి హిస్టరీ ఉంది. వివాద ర‌హితుడిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గంలో ఆయ‌న కీల‌క నేత‌గా ఎదిగారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజ‌కీయాలు సాగించిన పితాని స‌త్యనారాయ‌ణ వైఎస్‌కు కూడా ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆరోప‌ణ‌ల‌కు దూరంగా అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మ‌ర‌ణాంత‌రం కూడా పితాని రోశ‌య్య, కిర‌ణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పారు.

వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా….

అయితే, రాష్ట్ర విభ‌‌జ‌న త‌ర్వాత పితాని స‌త్యనారాయ‌ణకు వైసీపీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు దూరంగా ఉండ‌డంతో తమ పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ నుంచి క‌బురు అందింది. అయితే, ఆయ‌న అనూహ్యంగా కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరి కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఆ పార్టీలో చేరిన వారం రోజుల‌కే టీడీపీ బాట ప‌ట్టారు. చంద్రబాబుకు చేరువ అయ్యారు. ఈ క్రమంలోనే 2014లో ఆచంట నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి విజ‌యం సాధించారు. అనంత‌ర కాలంలో 2017లో పితాని స‌త్యనారాయ‌ణకు కార్మిక శాఖ మంత్రిగా ప్రమోష‌న్ కూడా ఇచ్చారు చంద్రబాబు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. నుంచి పితాని స‌త్యనారాయ‌ణ టీడీపీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. పార్టీలో చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు.

ఎంపీ సీటు ఇస్తామనడంతో…

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా పితాని స‌త్యనారాయ‌ణకి వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇస్తామ‌న్న ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే పితాని చివ‌రి వ‌ర‌కు ఊగిస‌లాడి చివ‌ర్లో టీడీపీ నుంచే పోటీ చేశారు. ఇక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత టీడీపీలో యాక్టివ్‌గా లేని ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇవి ఫ‌లించ‌డం లేదు. ఈలోగా ఇప్పుడు ఈఎస్ ఐ కుంభ కోణానికి సంబంధించి పితాని త‌న‌యుడు పితాని సురేష్ పేరు వినిపించింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా వెంకట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా సురేష్ ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది.

అందుకేనా సైలెంట్ గా….

ఆ మాట‌కు వ‌స్తే పితాని స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచే సురేష్ చేయి త‌డ‌ప‌నిదే ఫైల్స్ క‌దిలేవి కావ‌న్న టాక్ ఉంది. అయితే, దీనిపై ముంద‌స్తు బెయిల్ కోసం పితాని కుటుంబం కోర్టుకు వెళ్లింది. అయితే, ఇంత జ‌రుగుతున్నా.. పితాని విష‌యాన్ని టీడీపీ ప‌ట్టించుకోక పోవ‌డ‌మే ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. నిన్న మొన్నటి వ‌ర‌కు పితాని స‌త్యనారాయ‌ణని త‌మ వాడుగానే చెప్పుకొన్న టీడీపీ ఇప్పుడు ఆయ‌న కుటుంబంపై ఆరోప‌ణ‌లు రావడంతో సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే బీసీ వ‌ర్గానికే చెందిన మాజీ మంత్రులు అచ్చెన్న, కొల్లు ర‌వీంద్ర విష‌యంలో టీడీపీ చేసిన హ‌డావిడి ఇప్పుడు పితాని స‌త్యనారాయ‌ణ విష‌యంలో చేయ‌క‌పోవ‌డం ప‌లు సందేహాలకు తావిస్తోంది. పితాని స‌త్యనారాయ‌ణ వైసీపీలో చేరేందుకు ప్రయ‌త్నించ‌డ‌మే కార‌ణ‌మా? లేక‌.. మ‌రేదైనా ఉందా? అనే విష యంపై రాజ‌కీయ స‌ర్కిళ్లలో హాట్ చ‌ర్చే సాగుతోంది. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News