వైవీ వల్లనే వైసీపీ నాశనం....!

Update: 2018-10-09 09:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు పితాని బాల‌కృష్ణ‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఈయ‌న అనూహ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు, పార్టీలోకి చేరీ చేర‌డంతోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున తొలి టికెట్‌ను సైతం పొంది సంచ‌ల‌నం సృష్టించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌క‌టించిన తొలి అభ్య‌ర్థి బాల‌కృష్ణే కావ‌డం విశేషం. నియోజ‌క‌వ‌ర్గంలోని 40 వేలు శెట్టిబ‌లిజ‌. 44 వేలు కాపులు, 40 వేలు మ‌త్స్య‌కారుల అభిమానాన్ని పూర్తిగా చూర‌గొన్న ఆయ‌న‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంపై చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

కానిస్టేబుల్ గా.........

వాస్త‌వానికి కానిస్టేబుల్ అయిన బాల‌కృష్ణ అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సామాన్య స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం వెన‌క తాను ప‌డి క‌ష్టం ఎంతో ఉంద‌ని ఆయ‌న చెపుతారు. అయితే రాజ‌కీయాల్లోకి మాత్రం కావాల‌ని రాలేద‌ని కూడా ఆయ‌న అంటారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చీ రావ‌డంతోనే జ‌గ‌న్ ఆయ‌న‌ను ముమ్మిడి వ‌రం నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈయ‌న‌ను త‌ప్పించి వేరేవారికి ఇక్క‌డ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, రెండేళ్లు క‌ష్ట‌ప‌డి పార్టీని బ‌లోపేతం చేసిన బాల‌కృష్ణ‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో శెట్టిబ‌లిజ వ‌ర్గీయులు ఒత్తిడి చేసి మ‌రీ ప‌వ‌న్ ను సంప్ర‌దించి బాల‌కృష్ణ పార్టీమారేలా ఒత్తిడి చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ప‌వ‌న్ టికెట్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ క్రమంలో ఆయ‌నతో తెలుగుపోస్ట్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ...

తెలుగుపోస్ట్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ తొలి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంపై మీ అభిప్రాయం ?

బాల‌కృష్ణ‌: బీసీల్లో బలమైన శెట్టిబలిజ కమ్యూనిటీకి చెందిన న‌న్ను ప‌వ‌న్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన తొలి అభ్య‌ర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. శెట్టిబలిజ కమ్యూనిటీ అంతా పవన్‌ కళ్యాణ్‌గారికి ఎప్పుడూ రుణపడి ఉంటుంది.

తెలుగుపోస్ట్ : టీడీపీ సిట్టింగ్ దాట్ల బుచ్చిరాజును ఎలా ఎదుర్కొంటారు ?

బాల‌కృష్ణ‌: నా వ్య‌క్తిత్వం, ప్ర‌జ‌ల్లో నాకున్న గుర్తింపే నా ప్ల‌స్‌. అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో 36,000 కాపు ఓటర్లు, 45,000 శెట్టిబలిజ ఓటర్లు... రెండూ క‌లిపి 83,000 ఓటర్లు ఉన్నారు. మ‌త్స్య‌కార‌ సామాజికవర్గం నుంచి కూడా 41,000 ఓటర్లు ఉన్నారు. 20000 ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కూడా ఉన్నారు. అలాగే క్షత్రియ సామాజిక ఓటర్లు 10,000 ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్‌ చెయ్యడంతో బీసీలు, కాపు సామాజికవర్గాల ఓట్లు గంప‌గుత్త‌గా బుచ్చిరాజుకి ఓటు వెయ్యడంతో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. నాలుగు ఏళ్లగా నియోజకవర్గంలో ఆయన చేసింది ఏమిలేదు. ఈ రోజు టీడీపీలోనే ఓ సామాన్య కార్యకర్త వెళ్తే సైతం ఆయ‌న పని చెయ్యలేని పరిస్థితి. నియోజకవర్గంలో నాలుగు మండలాలు నాలుగురు నాయకులకు అప్పగించేసిన ఆయన సొంత పార్టీ వాళ్లకు సైతం ఏం చెయ్యలేకపోవడం ఆయనపై ఆ పార్టీలోనే వ్యతిరేకతకు కారణం అవుతుంది.వైసీపీ సమన్వయకర్తగా నియమితుడైన పొన్నాడ సతీష్‌ గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు నియోజకవర్గానికి చేసింది ఏమీలేదు. ఇప్పుడు తిరిగి ఆయన మరో సారి పోటీ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక వైసీపీ సమన్వయకర్తగా మూడేళ్ల పాటు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నాను, ప్రతీ ఒక్కరి ఇబ్బందుల్లో నేను తోడు ఉన్నాను. ఈ క్రమంలోనే నియోజకవర్గం మొత్తం ఈ సారి బాలకృష్ణ పడిన కష్టాన్ని గుర్తించి ఆయనకు జరిగిన అన్యాయం నేపథ్యంలో ఆయనను గెలిపించుకోవాలని ఇప్పటికే డిసైడ్‌ అయ్యి ఉన్నారు.

తెలుగుపోస్ట్ : కానిస్టేబుల్‌గా ఉన్న‌మీరు రాజ‌కీయాల వైపు ఎలా వ‌చ్చారు ?

బాల‌కృష్ణ‌: రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు. కాకతాళియంగా జరిగింది. చిన్నప్ప‌టి నుంచి సామాజికసేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. ఏవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించి ఆదుకోవడం నా నైజం. నేను పేద కుటుంబం నుంచి రావడంతో ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉండాలి. వారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలన్న లక్ష్యం చిన్నప్పుటి నుంచి ఉంది. ఇక మా కుటుంబం అంతా వ్యాపారాల్లో ఉంది. ఈ క్రమంలోనే దైవానుగ్రహంతోనే రాజకీయాల్లోకి వచ్చానేమో. నేను ప్రజలకు చెయ్యాలన్న భాగ్యం నాకు కలిగింది, దీన్ని తప్పనిసరిగా నెరవేర్చుతానని భావిస్తున్నాను. రాజ‌కీయాల్లో కొత్త ఒర‌వ‌డిని క్రియేట్ చేయాల‌న్న సంక‌ల్పంతోనే ముందుకు వెళ‌తాను. నా ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే 10 రూపాయిలు ఉంటే అందులో నాలుగు రూపాయిలు పేదవాడికి దానం చెయ్యాలన్న సంకల్పమే తప్ప నా దగ్గర కోట్లకు కోట్లు ఏమిలేవు, ఉన్నంతలో హ్యాపీ.

తెలుగుపోస్ట్ : జ‌గ‌న్ మీకు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఏంటి ?

బాల‌కృష్ణ‌: జగన్‌ నన్ను ఎందుకు పక్కన పెట్టాడో ఆయనకే తెలియదు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉన్న టైమ్‌లో... ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి కో ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. ఎప్పుడైతే జగన్‌ బాబాయ్‌ వైవి. సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లోకి ఎంటర్‌ అయ్యాడో అప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభం అయ్యింది. వైవి. సుబ్బారెడ్డి ఎంట్రీతో ధర్మాన ప్రసాదరావుని పూర్తిగా డమ్మీని చేసేసి ఆడించడం మొదలుపెట్టారు. పక్కన పెట్టినప్పుడు బాలకృష్ణకు అన్యాయం జరిగిందని నియోజకవర్గం వైసీపీ క్యాడర్‌ మొత్తం ధర్మాన ప్రసాద్‌రావు వద్ద మొర పెట్టుకోగా ఆయన సైతం నీకు అన్యాయం జరిగింది, అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఏమి చెయ్యలేనని చేతులు ఎత్తేశారు.వైవి. సుబ్బారెడ్డి తన ఇష్టం వచ్చినట్టు సీట్ల కేటాయింపు చేసి పార్టీని సర్వనాశనం చేసేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లో కాపులు, శెట్టిబలిజల ప్రాబ‌ల్యం ఎక్కువ. ఈ జిల్లాలో కూడా తమ సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కోసం ఏకంగా కాకినాడ సిటీ, అనపర్తి, కొత్తపేట మూడు సీట్లు రెడ్ల‌కు కేటాయించడం ఎంత వరకూ సమజ‌సం. జిల్లాల్లో బీసీలు లేరా, బీసీల్లో ఎన్ని కులాలు లేవు ? బీసీలపై జగన్‌కు ఉన్న ప్రేమ ఇదేనా ? సుబ్బారెడ్డి ఆడిన ఆటలో వైసీపీలో ఉన్న బీసీల రాజకీయ జీవితం బలి అయిపోయింది. మాట మాట్లాడితే గత ఎన్నికల్లో శెట్టిబలిజలకు మూడు సీట్లు ఇచ్చాం మూడు చోట్లా ఓడిపోయారు మీకు సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదని అంటున్నారు. మరి జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి గారికి విశాఖపట్నంలో ఎంపీ సీటు ఇస్తే ఆమె చిత్తుగా ఓడిపోలేదా ? దీనికి వాళ్లు ఏం సమాధానం చెబుతారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా పట్టుకునే నాథుడే లేనప్పుడు నేను వైసీపీ జెండా పట్టుకుని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సముద్రతీరం వరకు తిరుగుతూ పార్టీని పటిష్ఠం చేశాను. నాకు పార్టీలోదక్కిన గౌరవం ఏంటి? జిల్లాలో నేనొక్కడినే కాదు గిరజాల బాబు, ముత్యాల శ్రీనివాస్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కీలక నాయకులను నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వనప్పుడు మా లాంటి వాళ్లకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం ఎందుకు? మాతో ఖ‌ర్చు పెట్టించడం ఎందుకు ? పార్టీ ఎవరికి అయితే టిక్కెట్లు ఇవ్వాలనుకుంటుందో వాళ్లకే ముందుగా నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తే సరిపోతుందిగా. పార్టీ కోసం కష్టపడి బలోపేతం చెయ్యడానికి ఒకరు, టిక్కెట్లు ఇవ్వడానికి మరొకరు ఇలా చేసుకుంటూ పోతూ నాయకుల రాజకీయ జీవితాలతో జగన్‌ ఎందుకు ఆట‌లు ఆడాలి ? పార్టీ దశాదిశా లేని ఆలోచనలు సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల వల్ల ఈ రోజు ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ సర్వనాశనం అయ్యిపోయింది. ఇందుకు సుబ్బారెడ్డి లాంటి వాళ్ల తప్పున్నా అందుకు ప్రధాన భాధ్యత మాత్రం జగన్‌ మోహన్‌ రెడ్డిదే. జిల్లాలో వైసీపీ నాశనం అవ్వడానికి వైవి. సుబ్బారెడ్డితో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఇద్దరే ప్రధాన కారణం.

తెలుగుపోస్ట్ : మ‌రి టీడీపీ కూడా క‌మ్మ‌ సామాజిక వర్గానికి మూడు సీట్లు ఇచ్చిందిగా...?

బాల‌కృష్ణ‌: తెలుగుదేశం కూడా ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే కమ్మ సామాజికవర్గానికి మూడు సీట్లు ఉచ్చి ఉండవచ్చు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఆ సామాజకవర్గం ప్రభావం చూపే అవకాశం ఉండడంతోనే టీడీపీ కమ్మలకు మూడు సీట్లు ఇచ్చింది. అయితే వైసీపీ జిల్లాలో ఏ మాత్రం ప్రభావం లేని రెడ్లకు మూడు సీట్లు ఇవ్వడం మాత్రం చాలా దారుణం.

తెలుగుపోస్ట్ : గ‌త రెండేలళ్లుగా వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్నారు. గ‌మ‌నించిన స‌మ‌స్య‌లు ఏంటి ?

బాల‌కృష్ణ‌: నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నప్పుడు పార్టీని ప్రతీ గ్రామగ్రామాన తిరిగి బలోపితం చేశాను ఈ విషయం మీరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఆ ఫౌండేషన్‌ ఈ రోజు జనసేనలో నా గెలుపుకు ఉపయోగపడుతుందని ఘంటాపథంగా చెబుతాను. నాయకులు తప్పు చెయ్యవచ్చుగాని ప్రజలు తప్పు చెయ్యరు. నాయకులు కన్నా ప్రజలు విజ్ఞులు, తెలివైనవారు... బాలకృష్ణ మూడేళ్లగా నియోజకవర్గంలో గడపగడప తొక్కి ఎలా కష్టపడ్డాడో అన్నది ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఈ రోజు జగన్‌ మోహన్‌ రెడ్డి బాలకృష్ణకు చేసిన అన్యాయాన్ని వాళ్లు సహించలేకపోతున్నారు. వైసీపీలో బాలకృష్ణ కష్టపడితే జగన్‌ ఎలా మోసం చేసాడో ? అన్న విషయం ఈ రోజు నియోజకవర్గం మొత్తం తెలిసింది. ఈ సింపతీ కూడా రేపు నాకు ఎన్నికల్లో వర్క‌వుట్‌ కానుంది.

తెలుగుపోస్ట్ : రాజ‌కీయాల విష‌యంలో ప‌వ‌న్‌కు జ‌గ‌న్‌కు ఉన్న తేడా ఏంటి ?

బాల‌కృష్ణ‌: పవన్‌ కళ్యాణ్‌గారి దగ్గర కమిట్‌మెంట్‌ ఉంది. ఆయన నోటి నుంచి మాట జారితే దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కట్టుబడి ఉంటాడు. జగన్‌ మోహన్‌ రెడ్డిది పచ్చిగా మోసం చేసే నైజం. మడమ తిప్పకపోవడం, మాట తప్పకపోవడం, విశ్వసనీయత అనేవి పవన్‌ కళ్యాణ్‌గారు చేసి చూపించారు. ఈ మూడింటి మీద ఏ మాత్రం నమ్మకం లేని వ్యక్తి జగన్‌ మోహన్‌ రిడ్డి.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను సీఎంను చేయాల‌ని ప‌వ‌న్ కూడా కోరుతున్నారు.. సాధ్య‌మేనా ?

బాల‌కృష్ణ‌: 38 సీట్లు గెలుచుకున్న కుమారస్వామి కర్ణాటక సీఎం కాలేదా.. ? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహంచలేం. రేపు జనసేన ఏపీలో 175 సీట్లలో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే 70 సీట్లు పైగా గెలిచే స్కోప్‌లో ఉంది. ఎన్నికల నాటికి ఇది 80, 90 సీట్లకు కూడా చేరుకోవచ్చు. నాడు ఎన్టీఆర్‌ 1983లో టీడీపీ పెట్టినప్పుడు జన ప్రభంజనం ఎలా ఆయన వెంట నడిచిందో ? నేడు పవన్‌ కళ్యాణ్‌ వెంట కూడా మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతీ ఒక్కరూ ఆయన పాలన కోసం ఎదురుచూస్తున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు రావడం గ్యారెంటీ అని నేను చెబుతున్నాను.

తెలుగుపోస్ట్ : నియోజ‌క‌వ‌ర్గంలో శెట్టిబ‌లిజ‌లు మీవెంటే ఉన్నారు. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి ?

బాల‌కృష్ణ : అన్ని వ‌ర్గాలు నా వెంటే ఉన్నారు. ఈ రోజు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త సతీష్‌కు ఆయన సొంత కమ్యూనిటీ అయిన మత్స్య‌కార సామాజికవర్గంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంతో మంది మత్స‌కారులపై లేనిపోని అక్రమ కేసుల బ‌నాయించి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వారిని నిర్ధాక్షణ్యంగా చితక కొట్టించిన చరిత్ర సైతం ఆయనకు ఉంది. ఎస్సీలంటే వైసీపీకి కాస్త ఫేవర్‌గా ఉంటారన్న అభిప్రాయం ఉంది. ముమ్మడివరం నియోజకవర్గంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా చేసిన సతీష్‌ వారిని ఏ మాత్రం పట్టింకోలేదు. ఈ రోజు నియోజకవర్గంలో ప్రతీ ఎస్సీ కాల‌నీలకు వెళ్లి రహదారులను చూస్తేనే ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తోంది. ఇక్కడ ఎస్సీలు సతీష్‌ పట్ల ఏ మాత్రం సుముఖంగా లేరు. ఇవన్నీ కూడా నాకు కలిసిరానున్నాయి.

తెలుగుపోస్ట్ : చంద్ర‌బాబు పాల‌న‌పై మీ అభిప్రాయం ఏంటి ?

బాల‌కృష్ణ‌: చంద్రబాబును జిమ్మిక్కుల బాబు అంటారని అందరికీ తెలిసిందే. ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. తాజాగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ భృతి అంటూ కొత్త రాగం అందుకున్నాడు. మరో ఆరు నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తాడు. చంద్రబాబు నాలుగు ఏళ్ల పాలన చూసి చూసి విసిగిపోయిన ప్రజలు ఆయనను ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే టైమ్‌లో జగన్‌ మోహన్‌ రెడ్డిని సైతం జనాలు మఖ్యమంత్రిని చెయ్యడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. జగన్‌ సభలకు గతంలో జనాలు ఇంతకన్నా ఎక్కువ వచ్చారు ఏమయ్యింది... 2014లో జగన్‌ ఓడిపోలేదా..!

తెలుగుపోస్ట్ : ప‌వ‌న్ విష‌యం ప‌క్క‌న పెడితే... ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే బాగుంటుంది ?

బాల‌కృష్ణ‌: ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్ట‌డం కాదు... జనసేన అధికారంలోకి వస్తే బాగుంటుంది. జనసేనతోనే బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది.

తెలుగుపోస్ట్ : మీకు ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల‌లో ఎవ‌రు స‌మ‌ర్థులు ?

బాల‌కృష్ణ‌: ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే సమర్థవంతమైన నాయకుడని నేను భావిస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజా సమస్యలపై పోరాట‌ చెయ్యాలని వైసీపీ ఎమ్మెల్యేలను జనాలు ఎన్నుకున్నారు. అలాంటిది నేడు ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డికి అసలు ప్రజల సమస్యల మీద ఏ మాత్రం అవగాహన లేదని స్పష్టం అవుతుంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చెయ్యని వ్యక్తికి ప్రతిపక్షనేతగా ఉండే అర్హత కూడా లేదు.

తెలుగుపోస్ట్ : పవన్ హామీలు సాధ్యమేనా?

బాల‌కృష్ణ‌: వైసీపీ హామీల‌కు లెక్కుందా.. ? ఐదో తరగతిలోపు పిల్లలకు 500, ఏడో తరగతిలోపు పిల్లలకు 750రూపాయిలు అంటున్నారు. ఇంటర్‌ చదువుకునే పిల్లలకు 1000 రూపాయిలు అంటున్నారు. ఈ హామీలు అన్ని నిజంగా నెరవేరతాయా? నాడు చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. వాటిలో ఏ ఒక్కటి అయినా నెరవేరాయా ? హామీలు నమ్మి జనాలు మరో సారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. పవన్‌ చెప్పిన‌వి ఖ‌చ్చితంగా ఇవ్వచ్చు. దేశంలో మనకు కావాల్సినంత గ్యాస్‌ ఉంది. అ క్రమంలోనే గ్యాస్‌ అనేది ఉచితంగా ఇవ్వడం ఖ‌చ్చితంగా సాధ్యపడుతుంది. చంద్రబాబు, జగన్‌లా పవన్‌గారు వందలకు వందలు హామీలు అయితే ఇవ్వరు. మత్స‌కారులు, రైతులు, మహిళలు ఇలా ప్రతీ ఒక్కరికీ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రెడీ అవుతుంది. ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చెయ్యడానికి చిత్తశుద్ధితో పని చేస్తారు.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని అంటున్నారు. అయినా మీదే గెలుపా?

బాల‌కృష్ణ‌: వచ్చే ఎన్నికల్లో నేను ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలవబోతున్నాను. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే రాజకీయం జనసేన చేయ‌దు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల్లోనూ జనసేనకు తిరుగులేని ఆద‌రణ లభిస్తోంది.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన ఎన్ని సీట్లు గెలుస్తుంది ?

బాల‌కృష్ణ‌: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 13 నుంచి 14 సీట్లలో విజయం సాధిస్తుంది. మరో రెండు నెలల్లో జిల్లాల్లో మరింత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అవి మీరే చూస్తారు

Similar News