పీత‌ల‌కు లైన్ క్లీయ‌ర్ చేస్తారా ?

మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీ అవుతున్నారా ? గ‌త ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆమెకు సీటు రాకుండా [more]

Update: 2021-03-18 09:30 GMT

మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీ అవుతున్నారా ? గ‌త ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆమెకు సీటు రాకుండా ఆమె వ్యతిరేక వ‌ర్గీయులు స‌క్సెస్ అయ్యారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు త‌ల‌పండిన మ‌హామ‌హులు, సీనియ‌ర్ నేత‌లే కాడి కింద ప‌డేశారు. దీంతో ఇప్పుడు పీత‌ల సుజాత లాంటి నేత‌లే పార్టీకి చాలా చోట్ల దిక్కవుతున్నారు. ఈ క్రమంలోనే పీత‌ల సుజాత చింత‌ల‌పూడి పార్టీ ప‌గ్గాలు మ‌ళ్లీ త‌న‌కు అప్పగించ‌క‌పోతారా ? అన్న ఆశ‌తోనే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడిలో టీడీపీ నుంచి పోటీ చేసిన క‌ర్రా రాజారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న మృతి చెంద‌డంతో చింత‌ల‌పూడి టీడీపీ బాధ్యత‌ల కోసం మ‌రో నేత‌ను చూడాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ప‌డింది.

సీటు ఇవ్వకపోగా…..

2009లో పోటీ చేసి ఓడిన క‌ర్రా రాజారావు పార్టీ మారి ఎన్నిక‌ల‌కు ముందు రావడంతో 2014లో పీత‌ల సుజాతకు సీటు ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో పీత‌ల సుజాత వర్గం ఒత్తిళ్లకు త‌లొగ్గిన బాబు మ‌ళ్లీ క‌ర్రాకు సీటు ఇవ్వగా ఆయ‌న ఓడిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇక్కడ యాక్టివ్‌గా ఉండి నానా హంగామా చేసిన పీత‌ల సుజాత వ‌ర్గం ఇప్పుడు స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నా పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. పీత‌ల సుజాతను వ్యతిరేకించిన నేత‌లు చాలా మంది ఇళ్లలో నుంచే బ‌య‌ట‌కు రావ‌ట్లేదు. ఒక‌రిద్దరు నేత‌లు మాత్రం మొక్కుబ‌డిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక సుజాత‌కు సీటు రాక‌పోవ‌డంతో ఆమె అనుకూల వ‌ర్గం కూడా మౌనంగా ఉండ‌డంతో పాటు పార్టీ మ‌ళ్లీ త‌మ నాయ‌కురాలికి ఎప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇస్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు.

ముందుండి నామినేషన్లు వేయించి….

క‌రోనా స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కార్యక్రమాలు చేప‌ట్టడంతో పాటు త‌న అనుచ‌రుల‌ను ఆదుకోవ‌డంతో పాటు కార్యక‌ర్తల ఇళ్లలో పరామ‌ర్శల‌కు, ఇత‌ర కార్యక్రమాల‌కు హాజ‌ర‌య్యారు. ఇక క‌ర్రా సైలెంట్ అయిపోవ‌డంతో మ‌ళ్లీ పీత‌ల సుజాత వ‌ర్గం పుల్ యాక్టివ్‌గా ఉంటోంది. పంచాయ‌తీ, మునిసిప‌ల్ ఎన్నికల బాధ్యత‌ను ఈ వ‌ర్గమే భుజాన వేసుకుని నియోజ‌క‌వ‌ర్గంలో పోరాటం చేస్తోంది. నియోజ‌క‌వర్గంలో గుండెకాయ అయిన జంగారెడ్డిగూడెం మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను అంద‌రూ వ‌దిలేసినా పీత‌ల సుజాత వ‌ర్గం ముందుండి… పార్టీ నాయ‌కుల‌తో నామినేష‌న్లు వేయించి పార్టీ గెలుపుకోసం పని చేసింది.

సానుకూల వాతావ‌ర‌ణ‌మే…?

పీత‌ల సుజాతకు మ‌ళ్లీ చింత‌ల‌పూడి ప‌గ్గాలు అప్పగించే విష‌యంలో ఒక‌రిద్దరు నేత‌లు వ్యతిరేకించినా ఈ సారి అధిష్టానం వారి మాట ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. గ‌త ఎక‌న్నిక‌ల‌కు ముందు పీత‌ల సుజాత విష‌యంలో మాజీ ఎంపీ మాగంటి బాబు లాబీయింగ్ చంద్రబాబు ద‌గ్గర ఎక్కువుగా ప‌నిచేసేది. ఇప్పుడు మాగంటి దాదాపు రాజ‌కీయాల నుంచి నిష్క్రమించ‌డంతో పాటు పార్టీ కార్యక్ర‌మాల‌ను కూడా వ‌దిలేశారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న గ‌న్ని వీరాంజ‌నేయుల‌తో పాటు జిల్లా టీడీపీలో చాలా మంది పార్టీని న‌మ్ముకుని ఉన్న పీత‌ల సుజాత అయితేనే చింత‌లపూడికి క‌రెక్ట్ అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక టీడీపీకి ఎప్పుడు ప్లస్‌.. ఎప్పుడూ మైన‌స్‌గా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఒక‌రిద్దరు నేత‌లు ఆమెను వ్యతిరేకించినా… ఆమెకు ఎస్సీల్లో బ‌లంగా స‌పోర్ట్ ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు బ‌ల‌మైన వ‌ర్గం ఉండ‌డం… గ‌న్నితో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు ఆమె వైపే మొగ్గు చూపుతుండ‌డం… ఇటు క‌ర్రా లేక‌పోవ‌డంతో చింత‌ల‌పూడి పార్టీ ప‌గ్గాలు మ‌ళ్లీ పీత‌ల సుజాతకే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. స‌రైన టైం చూసుకుని పార్టీ అధిష్టానం దీనిపై ప్రక‌ట‌న చేయ‌నుంది.

Tags:    

Similar News