కమిట్ మెంట్ ఉన్నా పీతలను కాదంటుంది ఎందుకు?

రాజ‌కీయాల్లో ఎంత డ‌బ్బుంది? ఎన్ని కార్లున్నాయి? అనే విష‌యం క‌న్నా కూడా క‌మిట్‌మెంట్‌, అంకిత భావం చాలా ప్రధానం. పార్టీ ఏదైనా నాయ‌కుల‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణం [more]

Update: 2020-03-10 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎంత డ‌బ్బుంది? ఎన్ని కార్లున్నాయి? అనే విష‌యం క‌న్నా కూడా క‌మిట్‌మెంట్‌, అంకిత భావం చాలా ప్రధానం. పార్టీ ఏదైనా నాయ‌కుల‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే. అయితే, ఈ క‌మిట్ మెంట్‌కు తాను ఎప్పుడు ఫిదా అవుతాన‌ని చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు అవ‌కాశవాదంగా వ్యవహరిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త‌న‌కు అనుకూలంగా ఉంటే క‌మిట్‌మెంట్ అనే ప‌దాన్ని వాడుతున్నార‌ని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విష‌యంలోనే మాజీ మంత్రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కురాలు పీత‌ల సుజాత గురించి పెద్ద ఎత్తున చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

బాబు నుంచి గుర్తింపు….

టీడీపీలో అంకిత భావంతో ప‌నిచేసే నాయ‌కులు ఎవ‌రైనా ఉంటే వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు సుజాత‌. ఎలాంటి భేషజాలు, ఇగోల‌కు ఛాన్స్ లేకుండా ఆమె పార్టీ కార్యక్రమాల‌కు ముందుంటారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు సొంత సామాజిక వ‌ర్గం నేత‌ల చెప్పుడు మాట‌లు చంద్రబాబు ఆమెను ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అయినా కూడా సుజాత ఏమాత్రం ఫీల‌వ‌లేదు. అధినేత మాటే శిరోధార్యంగా భావించారు. కానీ, ఆమెకు చంద్రబాబు నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌, గుర్తింపు మాత్రం అంతంత మాత్రమే. 2004లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించింది సుజాత‌కు.. త‌ర్వాత‌ 2009 ఎన్నిక‌ల‌లో టికెట్ ఇవ్వలేదు. అయినా ఆమె పార్టీ కోసం ఐదేళ్ల పాటు ఎంతో క‌ష్టప‌డ్డారు.

గెలిచి పార్టీ మారిన వాళ్లను….

మ‌ధ్యలో 2009 ఎన్నిక‌ల్లో పీతల సుజాత‌ను కాద‌ని సీటు ఇచ్చిన తానేటి వ‌నిత లాంటి వాళ్లు అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచి మ‌రీ వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు అదే వనిత మంత్రిగా ఉన్నారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం క‌ష్టప‌డ్డ సుజాత 2014లో టికెట్ ద‌క్కించుకున్నారు. ఆ వెంట‌నే మంత్రి కూడా అయ్యారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌లో చంద్రబాబు మ‌ళ్లీ టికెట్‌ ఇవ్వలేదు. అప్పటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ప్రెజ‌ర్‌తో ఇవ్వలేదు. ఈ క్రమంలోనే 2014లో అప్పటికే అవుట్ డేటెడ్ నాయ‌కుడు క‌ర్రా రాజారావుకు ఇచ్చారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఇక్కడ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో రాజారావుపై వైసీపీ అభ్యర్థి ఎలీజా ఏకంగా 36 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఈయన కూడా అంతే…..

ట్విస్ట్ ఏంటంటే 2009లో పోటీ చేసిన రాజారావు ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వెంట‌నే ఆయ‌న వైసీపీలోకి వెళ్లి తిరిగి 2014 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఇక 2019లో ఓడిన రాజారావు ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీని ప‌ట్టించుకోక పోగా గ్రూపు రాజ‌కీయాలు న‌డ‌ప‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. పీతల సుజాతపై ఓవ‌ర్ యాక్షన్ చేసిన నాయ‌కులు ఇప్పుడు పార్టీని ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. పైగా ఇప్పుడు రాజారావు వ‌యోవృద్ధుడు అయ్యారు. దీంతో ఆయన యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. పైగా ఆయన మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అయితే, ఈ విష‌యాల‌ను చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం లేదు.

పీతలకు అప్పగిస్తే…?

చంద్రబాబు ఇప్పుడే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చింత‌ల‌పూడి బాధ్యత‌లు సుజాత‌కే ఇవ్వాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ అధికారంలో పార్టీని ప‌ట్టించుకునే వాళ్లే లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఎంజాయ్ చేసిన వాళ్లంతా ఇప్పుడు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. అయితే ఇక్కడ పార్టీలో కీల‌క నాయ‌కులు మ‌ళ్లీ పీతల సుజాత నాయక‌త్వాన్ని కోరుతున్నారు ఆమె యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌డంతోపాటు వివాద ర‌హితంగా వ్యవ‌హ‌రించారు. దీంతో ఆమెకు ఇక్కడి బాధ్యత‌లు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News