నా వ్యూహం..టార్గెట్ అదే....!

Update: 2018-10-03 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎంత‌మేర‌కు ఉండాలో ? ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలిస్తే చాలు.. విజ‌యం సొంతం అవ‌డంతోపాటు ప్ర‌జ‌లతోనూ మ‌మేకం కావొచ్చ‌ని నిరూపించారు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి పీత‌ల సుజాత‌. 2009లో టీచ‌ర్ వృత్తిని వ‌దులుకుని చంద్ర‌బాబు పిలుపు మేర‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు పీత‌ల‌. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఆచంట నియోజ‌కవ‌ర్గం నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత పార్టీలో ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేశారు. 2014లో చంద్ర‌బాబు ఆమెను చింత‌ల‌పూడి సీటు ఇచ్చారు. ఆమెకు ఆ ప్రాంతంతో సంబంధం లేక‌పోయినా కూడా ఆమె అడ్జెస్ట్ అయిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో సుజాత అనూహ్య‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. వెనువెంట‌నే ఆమెకు చంద్రబాబు త‌న కేబినెట్‌లో అవ‌కాశం క‌ల్పించారు.

నేతలను కట్టడి చేయడంలో......

అత్యంత కీల‌క‌మైన గ‌నుల శాఖ‌ను ఆమె చేతిలో పెట్టారు. అయితే, పార్టీ నేత‌ల దూకుడును క‌ట్ట‌డిచేయ‌డంలో సుజాత ఒకింత వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అనేక కార‌ణాల‌తో 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెను త‌ప్పించారు. అయినా కూడా ఆమె చంద్ర‌బాబుపై ఎక్క‌డా నొచ్చుకోలేదు. పైగా.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కూడాఆమె హాజ‌ర‌య్యారు. పీతల సుజాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత వ్యూహంతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ చింత‌ల‌పూడి సీటు నాదే అని... హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మే అన్న ధీమాతో ఆమె ఉన్నారు. చంద్ర‌బాబు దృష్టిలోనూ ఆమెపై వ‌చ్చిన అప‌నింద‌లు తొలిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె మ‌నోభావం ఏంటో తెలుసుకుందాం..

తెలుగు పోస్ట్ : చింత‌ల‌పూడిలో ఇప్పుడు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. కారణాలేంటి?

సుజాత: రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర ప్రజలందరూ అనాథ‌లా అందరూ వదిలేసిన ఏపీ అభివృద్ధి చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్య‌మ‌ని న‌మ్మి ఆయ‌న్ను సీఎం చేశారు. చంద్రబాబు న‌వ్యాంధ్ర‌ అభివృద్ధి కోసం 24 గంటలు అహ‌ర్నిశ‌లు కష్టపడుతున్నారు. చంద్రబాబు ను ఆదర్శంగా తీసుకునే మేమందరం మా నియోజకవర్గాల్లో ముందుకు వెళ్తున్నాం. చింతలపూడి జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. గత పదేళ్ల పాటు ఇక్కడ పాలించిన వారు నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నా... ఇంకా చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.

తెలుగు పోస్ట్ : టీచ‌ర్‌గా మీరు ఉత్త‌మ అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఏది బాగుంది ?

సుజాత‌: టీచర్‌, ఎమ్మెల్యే రెండూ కూడా సమాజానికి సేవ చేసేందుకు స్కోప్‌ ఉన్న పదవులే. టీచర్‌గా ఎంతో మంది భావిభారత పౌరులను తయారు చేసే మహోన్నత అవకాశం నాకు కలిగింది. అలాగే ఉత్తమ టీచ‌ర్‌గా ఉండ‌డం నాకు గర్వకారణం. అలాగే ఎమ్మెల్యేగా మ‌రింత ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం. రాజకీయంగా మా నాన్నగారికి టీడీపీతో ఉన్న విసృతమైన సంబంధాలు... మా పెద్దనాన్నగారు ఎంపీపీగా, వైస్‌ ఎంపీపీగా చేసిన పరిచయాలు మా కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. వాస్తవంగా మా నాన్నగారికి రావాల్సిన ఛాన్స్‌ నాకు రావడం... నేను ఎమ్మెల్యేగా గెలుపొందడం దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. టీచర్‌గా భావిభారత పౌరులను తయారు చేసే అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా సమాజంలో ఎంతో మందికి ఎన్నో రకాలైన సేవలు చేసే అవకాశం ఉంటుంది. అంతిమంగా ఈ రెండింటి లక్ష్యం సమాజసేవే.

తెలుగు పోస్ట్ : రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శత్రువులు ఎక్కువయ్యారా ?

సుజాత‌: రాజకీయాల్లో శత్రుత్వం అనేది తాత్కాలికం అయింది. ఇక్కడ శాశ్వ‌త‌ శత్రువులు ఉండరు. శాశ్వ‌త మిత్రువులూ ఉండరనే నానుడి నిజం. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మంచి పనులు చేసినా కొందరు శత్రువులు అవుతుండడం సహజం. అయితే మనం అన్నిటినీ సానుకూలంగానే స్వీక‌రించాలి. అంతిమంగా ప్రజాసమస్యలు గుర్తించి వాటిని పరిష్కరింప చేసి వాళ్ల మెప్పుతోనే ముందుకు వెళ్తూ ఉండాలి.

తెలుగు పోస్ట్ : మీకు మంత్రి ప‌ద‌వి వచ్చిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు? అదేస‌మ‌యంలో మిమ్మ‌ల్ని తొల‌గించిన‌ప్పుడు ?

సుజాత‌: ఓ టీచర్‌గా ఉన్న నాకు 2004 ఎన్నికల్లో ఆచంటలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్‌ ఇవ్వడమే గొప్ప అదృష్టం. అలాంటి చంద్రబాబు నాయుడు నాకు గాడ్‌ ఫాద్‌ర్‌. అలాంటి వ్యక్తి తిరిగి 2014 ఎన్నికల్లో మరో సారి చింతలపూడి నుంచి పోటీ చేసే ఛాన్స్‌ ఇచ్చారు.రెండో సారి సీటు ఇవ్వడంతో పాటు గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు పీతల సుజాత అంటే స్టేట్‌లోనే తెలియని వారు లేరు. అలాంటి గుర్తింపు ఇచ్చిన ఘ‌న‌త చంద్రబాబుగారిది. మంత్రి ప‌ద‌వి తొల‌గించినందుకు నాకు బాధ ఎందుకు ఉంటుంది.? కొన్ని సామాజిక కారణాల నేపథ్యంలోనే మంత్రి పదవి నుంచి నన్ను తొలగించారనుకుంటా.

తెలుగు పోస్ట్ : మంత్రిగా ఉన్న‌ప్ప‌టి కంటే ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే ?

సుజాత‌: మీరన్నది నిజమే. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సిన అవసరం ఉంటుంది. శాఖ‌ల స‌మీక్ష‌లు ఎక్కువ‌. మ‌న‌ శాఖలో ఏం జరుగుతుందో ప్రతి నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడు సహజంగానే నియోజకవర్గంలో పర్యటించేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేగా కేవలం నియోజకవర్గానికే పరిమితం. ఈ క్రమంలోనే అప్పుడు పార్టీ నాయ‌కులకు, కార్యకర్తలకు తరచూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువ స్కోప్‌ ఉంటుంది.

తెలుగు పోస్ట్ : మీ మీద ఆ ప్రచారం నిజ‌మేనా ?

సుజాత‌: చంద్రబాబుగారు నన్ను మంత్రిని చెయ్యడం నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. తొలగించినప్పుడు నేను ఎప్పుడూ భాద పడలేదు. పార్టీలో ఎవరికీ రానంత అదృష్టం నాకు వచ్చింది. దీనిపై భాదపడాల్సిన అవసరమే లేదు.

తెలుగు పోస్ట్ : చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఉందా ?

సుజాత‌: ఈ రోజు నవ్యాంధ్రలో ప్రతి ఒక్కరూ తమ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ భవిష్యత్తు కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం మళ్ళీ చంద్రబాబునే సీఎంగా కోరుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్న బలమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు, పెట్టని అంశాలను కూడా అమలు చేశారు. మ‌న‌తో పాటే మిగులు ఆదాయంతో ప్రారంభమైన తెలంగాణలో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కూడా అమలు చెయ్యడం లేదు. లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన రాష్ట్రంలో చూడముచ్చటైన రాజధాని, పోలవరం నిర్మాణం, రహదారులు, రైతులకు, ప్రజలకు అనేక సంక్షేమ పథ‌కాలు ఎలా ?అమలు జరుగుతున్నాయో ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు వ్యూహంలో కీలకం అవుతాయి.

తెలుగు పోస్ట్ : ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా రాలేదు. పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌నే న‌మ్మ‌కం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇమేజ్ త‌గ్గింద‌ని భావిస్తున్నారా ?

సుజాత‌: చంద్రబాబుపై ప్రత్యర్థులు చేసిన కుట్రలతో ఆయన ఇమేజ్‌ రోజురోజుకు పెరుగుతుంది. ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే ప్రభుత్వం. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసింది. నేడు ఎన్డీయే ప్ర‌త్యేక హోదా ఇవ్వకుండా మరో సారి మోసం చేసింది. ఈ కుట్రలను ఒంటి చేత్తో ఎదుర్కొంటోన్న‌ చంద్రబాబుగారి ఇమేజ్‌ రోజురోజుకు పేరుగుతుందే తప్పా ఎక్కడ తగ్గుతుంది. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంక‌న్న సాక్షిగా ప్రకటించిన మోడీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే చంద్ర‌బాబు జాతీయస్థాయిలో తమకు ఎక్కడ పోటీ వస్తాడో ? అన్న అక్కసుతోనే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. జాతీయ హోదా ప్ర‌క‌టించి కూడా పోలవరం విషయంలోను ఎన్ని కొర్రీలు వేస్తుందో ? చూస్తూనే ఉన్నాం. అయినా పోల‌వ‌రం పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇవన్నీ ఆయన ఇమేజ్‌ రోజురోజుకు ప్రజల్లో మరింత పెంచుతున్నాయే తప్పా ఎక్కడా తగ్గడం లేదు.

తెలుగు పోస్ట్ : నిన్న‌టి వ‌ర‌కు బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి...ఇప్పుడు అదే పార్టీని వ్య‌తిరేకిస్తుంటే జ‌నాలు న‌మ్ముతారా ?

సుజాత‌: ఏపీ ప్ర‌జ‌లు విజ్ఞులు.. వాళ్లు తప్పనిసరిగా నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు నెర‌వేర్చ‌డం లేదు. కేంద్రప్రభుత్వం నవ్యాంధ్రను ఎలా నమ్మించి మోసం చేసిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

తెలుగు పోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఒంట‌రి పోరు మీకు న‌ష్టం కాదా ?

సుజాత‌: ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీతో ఇప్పుడు ప‌వ‌న్ అంట‌కాగుతున్నారు. ప‌వ‌న్‌ కేంద్రాన్ని నిలతీయడం మానేసి చంద్రబాబుగారిపై ఎందుకు విమర్శలు చేస్తారు... వీళ్ల స్వార్ధపూరిత రాజకీయాలు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. జ‌గ‌న్‌ తన కేసుల నుంచి బయటపడేందుకు, ప‌వ‌న్ త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు జాతీయపార్టీ సపోర్ట్‌ ఉంటే చాలు అన్న కోణంలోనే ఆంధ్ర ప్రజలను పణంగా పెట్టి వారి వ్యక్తిగత రాజకీయాల‌ కోసం బీజేపీతో చేతులు కలిపారు.

తెలుగు పోస్ట్ : ప్ర‌స్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుంద‌ని, ఎవ‌రికీ మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. మీ అవ‌గాహ‌న ఏంటి ?

సుజాత‌: ప్రజా ఎజెండాతో ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ద్విముఖ పోటీ ఉన్నా, త్రిముఖ పోటీ ఉన్నా విజయం మాదే. అధర్మానికి, ధర్మానికి జరుగుతున్న యుద్ధలో అంతిమంగా ధర్మం విజయం సాధిస్తోంది.

తెలుగు పోస్ట్ : నియోజ‌క‌వ‌ర్గంలో చాలా స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయ‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స‌మాధానం...?

సుజాత‌: ఇలాంటి విమర్శలు చేసే ముందు వైసీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కట్టు బట్టలతో వదిలేసిన రాష్ట్రంలో చెట్టుకింద నుంచి పాలన ప్రారంభించిన చంద్రబాబు గారు నాలుగేళ్లల్లో నవ్యాంధ్రను ఎంత అభివృద్ధి చేశారో చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో జరిగని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లల్లో చేసి చూపించినందుకు వైసీపీ వాళ్లు కూడా చంద్రబాబుగారిని అభినందించాలి. ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని పసలేని విమర్శలు చేస్తుంటే సరిపోదు కదా. I0 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది.. ? ఏదో ఒక పేట అభివృద్ధి చేస్తే సరిపోతుందా... ? నాలుగున్నర ఏళ్లల్లో ఇంత కష్టకాలంలో కుడా అభివృద్ధి జరిగిందంటే అదంతా చంద్రబాబుగారి క్రెడిట్టే.

తెలుగు పోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గానికి మీరిచ్చే ప్రాధాన్యం ఏంటి?

సుజాత‌: చింతలపూడి ఎత్తిపోత‌ల పథకం మెట్ట ప్రాంతానికి వరప్రదాయిని. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు నీరు అందించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. కొన్ని రహదారుల నిర్మాణం పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇవి కూడా పూర్తి అయితే నియోజ‌క‌వ‌ర్గంలో రవాణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మారు మూల గ్రామాలకు సైతం బస్సులు వేయించుకునే అవకాశం ఉంటుంది. దీనిపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాను. చిన్న తర‌హా ప‌రిశ్ర‌మ‌లు పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించిన విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న వెంటనే వచ్చి ఇక్కడ ఉపాధి పొందేలా ప్రణాళికలు రచిస్తున్నాను.

తెలుగు పోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మీకే సీటు ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఉందా ? మీ హ్యాట్రిక్ క‌ల నెర‌వేరుతుందా ?

సుజాత‌: నేను ఎప్పుడూ పార్టీలో ఏదీ ఆశించి అడగలేదు. చంద్రబాబుపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆయన తప్పనిసరిగా నాకు సీటు ఇస్తారు, నేను విజయం సాధిస్తాను. హ్యాట్రిక్ ప‌క్కా.

తెలుగు పోస్ట్ : ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా?

సుజాత‌: ఎస్సీలు టీడీపీకి కాస్త దూరంగా ఉంటార‌న్న అపోహ గతంలో ఉండేది. ఇప్పుడు చంద్రబాబుగారు కార్పొరేషన్‌ రుణాలు పెంచారు. ఎంతో మంది నిరు పేదలుగా ఉన్నవారిని సైతం కార్లకు ఓనర్లు చెయ్యడం, వాళ్లు స్వయం ఉపాధి పొందేలా చెయ్యడంలో సక్స్‌సెస్‌ అయ్యారు. ఎస్సీలతో పాటు ఇప్పుడు అన్ని కులాలు టీడీపీ వైపే చూస్తున్నాయి. విదేశాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునే ఎస్సీ విద్యార్థులకు రుణాలు నుంచి... వారు ఇల్లు కట్టుకునేందుకు ఇచ్చే మొత్తం పెంచడం... 100 యూనిట్లలోపు విద్యుత్‌ బిల్లులు ఉచితంగా ఇవ్వడం ఇలా దేశంలో ఏ ముఖ్య మంత్రి ఎస్సీలకు చెయ్యనన్ని పనులన్నీ చంద్రబాబు గారు చేస్తున్నారు.

తెలుగు పోస్ట్ : సుజాత నియోజ‌క‌వ‌ర్గం మారుస్తారని ? అమ‌లాపురం ఎంపీగా వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి ?

సుజాత‌: చంద్రబాబు గారి నిర్ణయమే నా నిర్ణయం. ఆయన ఎంపీగా పోటీ చెయ్యమన్నా చేస్తా... అసెంబ్లీకి వెళ్లమన్నా వెళ్తా.

Similar News