ఈయన ఎందులోనూ పోటీ పడలేకపోతున్నారా?

రాజ‌కీయాలు మారుతున్నాయి. నేత‌ల వ్యవ‌హారశైలి కూడా మారుతోంది. ఏరోజుకారోజు.. ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నవారే లైవ్ పాలిటిక్స్‌లో ముందుంటున్నారు. ఎంత సీనియ‌ర్లు అయినా.. [more]

Update: 2021-05-31 13:30 GMT

రాజ‌కీయాలు మారుతున్నాయి. నేత‌ల వ్యవ‌హారశైలి కూడా మారుతోంది. ఏరోజుకారోజు.. ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నవారే లైవ్ పాలిటిక్స్‌లో ముందుంటున్నారు. ఎంత సీనియ‌ర్లు అయినా.. గ‌తంలో ఎంత‌మంది ద‌గ్గర ఎన్ని నీరాజ‌నాలు అందుకున్నా.. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా రాజ‌కీయాలు చేయ‌క‌పోతే.. అలాంటి వారు పూర్తిగా వెనుక‌బ‌డిపోతున్నారు. అంతెందుకు టీడీపీ పుట్టిన‌ప్పటి నుంచి రాజ‌కీయాలు చేస్తోన్న కురువృద్ధ నేత‌లు గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. వీరి స‌మకాలీన రాజ‌కీయాల‌కు అనుగుణంగా అడుగులు వేయ‌లేక అవుట్ డేటెడ్ లీడ‌ర్లు అయిపోతున్నారు. కొంద‌రు చిన్న వ‌య‌సే అయినా కూడా యాక్టివ్ రాజ‌కీయాల్లో ముద్ర వేయ‌లేక‌పోతున్నారు. ఇలాంటి వారిలో ముందున్నారు.. తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం ఎమ్మెల్యే కమ్ మంత్రి పినిపే విశ్వరూప్‌.

వివాద రహితుడిగా…?

పినిపే విశ్వరూప్‌ పొలిటిక‌ల్ చ‌రిత్ర చూసుకుంటే.. సుదీర్ఘంగా ఉంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలోనే ఆయ‌న మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. త‌ర్వాత రోశ‌య్య కేబినెట్‌లోనూ కొన‌సాగారు. ఇక‌, స‌మైక్యాంధ్ర ఉద్యమంలోనూ రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ అజాత శ‌త్రువుగా ఉన్నారు. వివాద ర‌హితుడిగా.. అవినీతి ర‌హిత నేత‌గా.. పినిపే విశ్వరూప్‌ గుర్తింపు సాధించారు. ఎస్సీ సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న‌కు మంచి పేరుంది. ఎవ‌రూ వేలెత్తి చూపించే ప‌రిస్థితి లేని నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇవ‌న్నీ.. ఇప్పుడు ఆయ‌న‌ను ఎక్కడా కాపాడ‌లేక పోతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జనసేన దూకుడుతో…?

ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్‌.. వ‌య‌సు చిన్నదే (58 ఏళ్లు) అయినా.. దూకుడుగా ముందుకు సాగ‌డంలేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. సొంత సామాజిక వ‌ర్గానికి కూడా ఆయ‌న ఏమీ చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. పైగా ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అమ‌లాపురంలో జ‌నసేన దూకుడు చూపించ‌డంపై కూడా అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఇక అమ‌లాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులు సామాజిక వ‌ర్గప‌రంగా ఇక్కడ దూసుకు పోతున్నారు.

ఎవరూ ఖాతరు చేయక…?

నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసుల నుంచి రెవెన్యూ వ‌ర‌కు ఎవ‌రూ మంత్రి పినిపే విశ్వరూప్‌ ని పెద్దగా కాత‌రు చేయ‌డం లేద‌ని. ఫలితంగా ఆయ‌న త‌న హ‌వాను కొన‌సాగించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు. సీనియార్టీ.. స‌హా.. సిన్సియార్టీ ఉన్నప్పటికీ.. నేటి త‌రంతో ఆయ‌న పోటీ ప‌డ‌లేక పోతున్నార‌ని అనేవారు పెరుగుతున్నారు. ఈ ప‌రిణామం.. ఇలానే పెరిగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పినిపే విశ్వరూప్‌ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటే ఆయ‌నకు యువ‌త‌రం నుంచి పెద్ద స‌వాళ్లు త‌ప్పవ‌నే అంటున్నారు.

Tags:    

Similar News