చరిత్ర తిరగరాశారు.. దటీజ్ విజయన్

పినరయి విజయన్.. దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. పినరయి విజయన్ చరిత్ర తిరగరాశారు. దైవ భూమిగా భావించే కేరళలో వరసగా రెండోసారి విజయం సాధించడం ఒక రికార్డు. [more]

Update: 2021-05-02 18:29 GMT

పినరయి విజయన్.. దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. పినరయి విజయన్ చరిత్ర తిరగరాశారు. దైవ భూమిగా భావించే కేరళలో వరసగా రెండోసారి విజయం సాధించడం ఒక రికార్డు. ఎన్ని కుట్రలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? నిజాయితీగా ఉన్న నేతపై తప్పుడు ప్రచారం చేసి గెలవాలనుకున్న వారి చెంపను కేరళ ప్రజలు చెళ్లుమనిపించారు. ఐదేళ్లలో తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని పినరయి విజయన్ మరోసారి నిరూపించారు.

రెండోసారి గెలిచి….

కేరళలో అధికార పార్టీ రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఆ సంప్రదాయాన్ని పినరయి విజయన్ తిరగరాశారు కమ్యునిస్టు పార్టీలు దేశ వ్యాప్తంగా కనుమరుగవుతున్న తరుణంలో మరోసారి పినరయి విజయన్ ప్రాణం పోశారు. కేరళలో 1977 తర్వాత రెండోసారి అధికారంలోకి రావడం పినరయి విజయన్ మాత్రమే. ఐదేళ్లలో కేరళ ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ పినరయి విజయన్ వెనక్కు తగ్గలేదు. ప్రతిసమస్యను అధిగమించుకుంటూ వచ్చారు.

ఎన్ని కష్టాలొచ్చినా…?

వరదలు, నిఫా వైరస్, కరోనా వైరస్ ఇలా కేరళకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా విజయన్ ఆ సమస్యల నుంచి అధిగమించారు. కరోనా సమయంలోనూ పేదప్రజలకు అండగా నిలబడి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. శబరిమల వంటి సున్నిత సమస్యలను కూడా నెమ్మదిగా నరుక్కుంటూ చివరకు పినరయి విజయన్ విజయం సాధించారు.

అనేక ప్రయత్నాలు జరిగినా…?

ఇక ఆయనపై అవీనీతి మచ్చ వేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గోల్డ్ స్కామ్ కేసులో ఆయన పేరు ప్రముఖంగా విన్పించేలా చేశారు. కానీ పినరయి విజయన్ విజయానికి అవేమీ అడ్డంకి కాలేదు. కేరళ ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా ఆయనపై కుట్ర జరుగుతుందని గట్టిగా నమ్మారు. అందుకే ఆయన వెంట నిలిచారు. రెండోసారి కేరళలో విజయం సాధించి పినరయి విజయన్ తాను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజల్లో నమ్మకం కలిగిన నేతను ఎవరూ వదులుకోరని మరోసారి నిరూపించారు.

Tags:    

Similar News