పినరయి కూడా వారిలో కలసి పోయారే?

రాజకీయ కక్షలకు ఎవరూ అతీతం కాదు. ఇన్నాళ్లూ కమ్యునిస్టులకు దాని నుంచి కొంత మినహాయింపు ఉంది. కమ్యునిస్టు పార్టీలు రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తాయని భావించారు. కానీ [more]

Update: 2021-02-04 17:30 GMT

రాజకీయ కక్షలకు ఎవరూ అతీతం కాదు. ఇన్నాళ్లూ కమ్యునిస్టులకు దాని నుంచి కొంత మినహాయింపు ఉంది. కమ్యునిస్టు పార్టీలు రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తాయని భావించారు. కానీ మారుతున్న కాలానుకనుగుణంగా కమ్యునిస్టు పార్టీలు కూడా మారుతున్నాయనడానికి కేరళ రాష్ట్రం ఉదాహరణగా నిలుస్తుంది. కేరళలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. యూడీఎఫ్ ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా నియంత్రించేందుకు పినరయి విజయన్ సయితం ఇతర రాష్ట్రాల బాటలోనే నడుస్తున్నారని స్పష్టమయింది.

ఉమెన్ చాందీపై…..

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీపై పాత కేసును పినరయి విజయన్ ప్రభుత్వం తిరగదోడింది. ఆయనతో పాటు మరికొందరు నేతలపై లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగిస్తూ పినరయి విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 78 ఏళ్ల వయసున్న ఉమెన్ చాందీపై లైంగిక దాడి కేసు నమోదు చేయడం కేరళలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలను అధికార పార్టీలోని కొందరు నేతలు కూడా తప్పుపడుతున్నారు.

లైంగిక వేధింపుల కేసు….

ఉమెన్ చాందీతో పాటు మరికొందరిపై 2016, 2018, 2019 సంవత్సరాల్లో నమోదయిన ఐదు కేసులను పినరయి విజయన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గతంలో యూడీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు సోలార్ ప్యానెల్ స్కామ్ లో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ వీరిపై ఫిర్యాదు చేశారు. ఉమెన్ చాందీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తనను లైంగికంగా వేధించారని ఆమె చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేసును సీబీఐకి అప్పగించారు. ఈ స్కాంపై దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వీరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం హాట్ హాట్ గా మారింది.

సీబీఐకి అప్పగించి…..

అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు దిగడం, కేసులు నమోదు చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇప్పటి వరకూ కేరళలో అధికారంలో ఉన్న కమ్యునిస్టులు దీనికి మినహాయింపు అని భావించారు. పినరయి విజయన్ దీనికి అతీతం అనుకున్నారు అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విపక్ష పార్టీ గొంతు నొక్కేందుకు, కక్ష సాధింపుతోనే కేసులు నమోదు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలు కావడంతో సీబీఐకి అప్పగించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News