కట్టడి చేశారు.. కానీ కరుణమాత్రం లేదే?

కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తున్నా కేరళలో మాత్రం కొంత కట్టడి చేయగలిగారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయికి దాటింది. కానీ [more]

Update: 2020-04-22 16:30 GMT

కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తున్నా కేరళలో మాత్రం కొంత కట్టడి చేయగలిగారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయికి దాటింది. కానీ కేరళలో మాత్రం పినరయి విజయన్ సర్కార్ కట్టడి చేయగలిగింది. గతంలో ఉన్న అనుభవం కావచ్చు. అకుంఠిత దీక్ష కావచ్చు. కరోనాను సాధ్యమయినంత వరకూ నియంత్రించగలడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ కేంద్ర మాత్రం కేరళ పట్ల వివక్ష చూపిస్తుందన్న ఆరోపణలున్నాయి.

విపత్తు సమయంలో ముందుగానే…..

కేరళలో కమ్యునిస్టుల బలం ఎక్కువ. కొన్ని దశాబ్దాలుగా కేరళ కమ్యునిస్టులకు కంచుకోటగా నిలుస్తుంది. అయితే కేరళకు వరస విపత్తులు ఇబ్బంది పెడుతున్నాయి. ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయ. అయినా పినరయి విజయన్ మాత్రం విపత్తు సమయంలో రాజీపడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇరవై వేల కోట్ల ప్యాకేజీని అందరి కంటే ముందుగా ప్రకటించి దేశ వ్యాప్తంగా పినరయి విజయన్ ప్రశంసలు అందుకున్నారు.

కరోనా కట్టడికి….

నిజానికి కేరళకు నర్సుల కర్మాగారంగా పేరు. బ్రిటీష్ పార్లమెంటే కేరళ నర్సుల సేవలను ప్రశంసించడం విశేషం. కేరళలోనే మన దేశంలో తొలి కరోనా కేసు నమోదయింది. వూహాన్ నుంచి వచ్చిన విద్యార్థికి జనవరి నెలలోనే పాజిటివ్ గా తేలడంతో ఆమెను ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేసి పంపారు. ఆ విద్యార్థిని కోలుకున్నా పినరయి విజయన్ అన్ని చర్యలు తీసుకున్నారు. కేరళ జనాభా దాదాపు మూడున్నర కోట్లు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని పినరయి విజయన్ ముందుగానే చర్యలు ప్రారంభించారు.

కేంద్రం నుంచి మాత్రం…..

కేరళలో ఎక్కువ మంది విదేశాల్లో ఉంటారు. అక్షరాస్యత ఎక్కువ కావడంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది. అందుకే చిన్న రాష్ట్రమైనా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలున్నాయి. ఇక ఉపాధి నిమిత్తం దేశ వ్యాప్తంగా కేరళీయులు లేని ప్రాంతం లేదంటే ఆశ్చర్యం కాదు. వీరంతా తిరిగి వస్తే ఎక్కడ ఇబ్బంది తలెత్తుతుందోనని ముందుగానే పినరయి విజయన్ చర్యలు ప్రారంభించారు. ఫిబ్రవరిలోనే అనేకమందిని క్వారంటయిన్ చేశారు. దాదాపు 276 మంది వైద్యుల నియామకం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. దీంతో మృతుల సంఖ్యను కేరళలలో గణనీయంగా తగ్గించారు. విపత్తులు, వైరస్ లతో విలవిలలాడుతున్న కేరళ పట్ల నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కేరళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 157 కోట్లు కావడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News