65 శాతం మంది నేరచరితులేనా?

సమకాలీన పరిస్థితుల్లో నేరచరితులు, కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు లేని రాజకీయాలను ఊహించలేం. అసలు అలాంటి ఆలోచన చేయడమే అత్యాశ అవుతుంది. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల్లో కొంతవరకు [more]

Update: 2021-06-12 16:30 GMT

సమకాలీన పరిస్థితుల్లో నేరచరితులు, కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు లేని రాజకీయాలను ఊహించలేం. అసలు అలాంటి ఆలోచన చేయడమే అత్యాశ అవుతుంది. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల్లో కొంతవరకు ఇటువంటి పరిస్థితులను చూడగలం. కానీ సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యుదయ భావాలు గల, ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసే పార్టీల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇటీవల జరిగిన అయిదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ విలక్షణతను ప్రదర్శించింది. నాలుగున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ అక్కడి ప్రజలు అధికార పార్టీకి రెండోసారి అధికారాన్ని అప్పగించారు. దేశవ్యాప్తంగా వామపక్ష ప్రాభవం కొడిగడుతున్న వేళ కేరళ ప్రజలు వామపక్ష కూటమిని గెలిపించి దానికి జీవం పోశారు.

కేసులున్న వారినే…?

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నీతి, నిజాయతీ, సచ్ఛరిత గల, మచ్చలేని నాయకులు మంత్రులు కావాలని కోరుకోవడం సహజం. కానీ పినరయి విజయన్ పూర్తిగా కొత్తవారితో ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని చూసిన తరవాత ఇలాంటి అభిప్రాయం కలగదు. ఇది ఆందోళన, ఆవేదన కలిగించే విషయం. దిగజారుతున్న ప్రజాస్వామ్య, నైతిక విలువలకు నిదర్శనం. మే 20న ప్రమాణం చేసిన 20 మంది కేరళ మంత్రుల్లో దాదాపు 65 శాతం మంది నేరచరితులే. ఇది ఎవరో గిట్టని వారు చెప్పిన విషయం కాదు. మంత్రుల ఎన్నికల అఫిడవిట్లను లోతుగా పరిశీలించిన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్- అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్స్మ్), కేరళ వాచ్ తేల్చిన అంశమిది. కేవలం మంత్రులే కాదు స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైనే క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి అల్లుడు, తొలిసారి శాసనసభ కు ఎన్నికైన పి.ఎ. మహమ్మద్ రియాస్ పైన క్రిమినల్ కేసులున్నాయి. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన రియాస్ బేపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కేసులున్నప్పటికీ ఆయనకు తన మామ, ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ కీలకమైన పీడబ్ల్యూడీ, పర్యాటక శాఖలను కేటాయించ
డం విశేషం.

సీపీఎం మాత్రమే కాదు….?

సీపీఎంకు చెందిన పి.రాజీవ్, వి.శివన్ కుట్టి, సాజి చెరియన్, వి.ఎన్.వాసవన్, ఆర్. బిందు, వీణా జార్జ్, వి. కె.ఎన్. బాలగోపాల్, కె.రాధాక్రిష్ణన్, ఎంవీ గోవిందన్ మాస్టర్ లపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. కేవలం సీపీఎంకు చెందిన మంత్రులే కాకుండా మంత్రివర్గంలోని ఇతర పార్టీల మంత్రులపైనా క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. సీపీఐకు చెందిన పి.ప్రసాద్, జె.చించురాణి, జి.ఆర్. అనిల్, కె.రాజన్ నేరచరిత కలిగి ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీ పీ) కు చెందిన ఏకైక మంత్రిఎ.కె.నసీంద్రన్ పైనా క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఇండియన్ నేషనల్ లీగ్ (ఐ ఎన్ ఎల్)కు చెందిన ఏకైక మంత్రి అహ్మద్ దేవర్కోల్ విల్ పైనా అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. తిరువళ్ల నుంచి ఎన్నికైన జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన కె.క్రిష్ణన్ కుట్టి నేరచరితుడే. తిరువనంతపురం వెస్ట్ నుంచి జేకేసీ (జనాధిపత్య కేరళ కాంగ్రెస్) పార్టీ తరఫున ఎన్నికైన ఆంటోనీ రాజ్ సైతం నేర అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇడుక్కి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కేఎంసీ పార్టీ కేరళ కాంగ్రెస్ (మణి) ఎమ్మెల్యే రోజీ అగస్టిన్ కూడా నేరచరితను కలిగి ఉన్నారు.

కేసులు ఉన్నంత మాత్రాన…?

నేషనల్ సెక్యులర్ కాన్ఫరెన్స్ (ఎన్ ఎస్ సి) పార్టీకి చెందిన వి. అబ్దుల్ రహమాన్ కూడా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కేసులు ఉన్నంత మాత్రాన తాము నేరస్తులు కాదన్న వాదన్న ఆయా మంత్రుల నుంచి వినపడవచ్చ. దీనిని పూర్తిగా తోసిపుచ్చడం కూడా కష్టమే. ఈ వాదన సంప్రదాయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చేయడంలో అర్థముంది. ఎందుకంటే అవి వ్యక్తిమీద ఆధారపడ్డ పార్టీలు. కానీ వామపక్షాలు ఇందుకు భిన్నమైనవి. అవి వ్యక్తిమీద ఆధారపడిన పార్టీలు కావు. సిద్ధాంత బలం గల, క్రమశిక్షణకు, నైతిక విలువలకు పెద్దపీట వేసే నిబద్ధత గల పార్టీలు. వాటి నుంచి వచ్చే ఇలాంటి సమర్థింపులను ప్రజలు హర్షించలేరు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News