రెండోసారి గెలిస్తే అంతే కాబోలు?

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలు, పినరయి విజయన్ మంత్రివర్గ కూర్పు జాతీయస్థాయిలో అందరి ద్రుష్టిని ఆకర్షించాయి. నాలుగున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ అధికార పార్టీ రెండోసారి [more]

Update: 2021-06-03 16:30 GMT

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలు, పినరయి విజయన్ మంత్రివర్గ కూర్పు జాతీయస్థాయిలో అందరి ద్రుష్టిని ఆకర్షించాయి. నాలుగున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ అధికార పార్టీ రెండోసారి గెలవడం మొదటి ప్రధాన అంశం. ఇంతవరకు కేరళలో ఏ ముఖ్యమంత్రి సాధించని విజయాన్ని నమోదు చేసిన పినరయి విజయన్ సహజంగానే హీరో అయ్యారు. దేశవ్యాప్తంగా వామపక్షాల ప్రభ మసకబారుతున్న తరుణంలో పార్టీని నిలబెట్టడం ద్వారా పార్టీలో తిరుగులేని నేత అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మంత్రివర్గ కూర్పులో మాత్రం విజయన్ విమర్శల పాలయ్యారన్నది చేదు నిజం. ముందుగా పాత మంత్రివర్గంలోని ఒక్కరికీ చోటు కల్పించకపోవడం ద్వారా నయా నియంతను తలపించారు.

ఆమెకు మొండి చేయి..?

గతంలో ఎనిమిదో దశకంలో నాటి ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేబినెట్ రహస్యాలు లీకవుతున్నాయంటూ ఒక్క కలం పోటు మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశారు. ఆ తరవాత 1989లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుుగదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం. చట్టసభకు తొలిసారి ఎన్నికైన తన అల్లుడు మహమ్మద్ రియాజ్ కు పినరయి విజయన్ మంత్రివర్గంలో చోటు కల్పించడం రాజకీయవర్గాల్లో ఆశ్ఛర్యాన్ని కలిగించింది. గత ఏడాదే తన కుమార్తె సౌమ్యను రియాజ్ కు ఇచ్చి వివాహం చేశారు. ఈ అంశంపై పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ క్రమశిక్షణకు భయపడి పైకి ఎవరూ నోరు విప్పడం లేదు. అన్నింటికీ మించి మూడో అంశం కీలకమైనది మాజీ ఆరోగ్యమంత్రి 64 సంవత్సరాల శైలజకు మంత్రివర్గంలో మొండి చేయి చూపడం. ఈ విషయం లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పినరయి విజయన్ ని తప్పుపట్టారు.

అందరూ ప్రశంసించినా?

2019 చివర్లో రాష్ర్టంలో వెలుగుచూసిన కొవిడ్ ను ఎదుర్కోవడంలో ఆరోగ్యమంత్రిగా శైలజ పనితీరు అందరినీ ఆకట్టుకుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆమె సేవలను, నిబద్దతను, చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఈ విషయంలో శైలజ నిర్వహించిన పాత్రను కేంద్ర పెద్దలు సైతం అభినందించారు. అంతేకాక ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా శైలజను అభినందించాయి. ఒక్క కొవిడ్ నే కాకుండా 2018లో నిఫా వైరస్ ను , తరవాత రోజుల్లో రాష్రాన్ని చుట్టముట్టిన వరదలను ఎదుర్కోవడంతో శైలజ చూపిన చొరవ అందరి మన్ననలు అందుకుంది. ఒకదశలో ముఖ్యమంత్రికి బదులు ఆమె పేరే రాష్ర్టంలో మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో శైలజకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంతేకాక మరింత కీలకమైన శాఖను ఆమెకు కట్టబెడతారన్న ప్రచారం జరిగింది. చివరకు ఆమె పార్టీ విప్ పదవి కట్టబెట్టడంతో రాజకీయ, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రజలు బ్రహ్మరధం పట్టినా?

కొంతమంది నెటిజన్లు సీఎం పినరయి విజయన్ నిర్ణయంపై కత్తులు నూరారు. సంప్రదాయ పార్టీల్లాగా వామపక్ష పార్టీలు మారాయన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఇక్కడా కష్టపడేవారికీ, నిజాయతీగా పనిచేసే వారికి చోటు లేదన్న విమర్శలు వినిపించాయి. ఆరోగ్యమంత్రిగా అమితమైన నిబద్ధతతో పనిచేసిన శైలజకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కన్నూరు జిల్లాలోని మన్ననూరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె అరవై వేలకు పైగా మెజార్టీతో విజయఢంకా మోగించారు. రాష్ర్టంలో అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో శైలజ మొదటి స్థానంలో నిలిచారు. సీఎం పినరయిపినరయి విజయన్ కి కూడా అంత మెజార్టీ రాలేదు. కొత్తవారికి అవకాశం కల్పించాలన్న విధాన నిర్ణయంలో భాగంగానే శైలజకు మంత్రి పదవి ఇవ్వలేదన్న పార్టీ వాదనలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. ఆమె సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే విప్ పదవి అప్పగించామన్న సీపీఎం పెద్దల అభిప్రాయంతో చాలామంది ఏకీభవించడం లేదు. పార్టీ నిర్ణయాన్ని శైలజ సైతం సమర్థించడం విశేషం. క్రమశిక్షణను కఠినంగా అమలు చేసే పార్టీలో ఇలాంటి ప్రకటనలు రావడం సహజం.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News