అందరూ వదిలేశారు.. ఆయనొక్కడే?

ఈశాన్యాన త్రిపుర, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన కేరళ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటల్లా ఉండేవి. వీటిల్లో త్రిపుర, బెంగాల్ లో సీపీఎం పట్టు దశాబ్దాల పాటు కొనసాగింది. [more]

Update: 2021-05-01 16:30 GMT

ఈశాన్యాన త్రిపుర, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన కేరళ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటల్లా ఉండేవి. వీటిల్లో త్రిపుర, బెంగాల్ లో సీపీఎం పట్టు దశాబ్దాల పాటు కొనసాగింది. కేరళలో మాత్రం పడిలేస్తూ వచ్చింది. ఇప్పుడు మొదటి రెండు రాష్టాల్లో సమీప భవిష్యత్తులో పార్టీ తిరిగి పునర్ వైభవం పొందే పరిస్థితి ఎంతమాత్రం కనపడటం లేదు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. కేరళలో మాత్రం అయిదేళ్లకోసారి పార్టీ గెలుపు ఓటములతో ముందుకు సాగుతోంది. 1977 తరవాత అధికార పార్టీ రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఆ సంప్రదాయాన్ని తిరిగి రాస్తామన్న ధీమా సీపీఎం వర్గాల్లో కనపడుతోంది. మే 2న ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని ఘంటాపథంగా చెబుతోంది.

ఈ ఇద్దరి పాత్ర…

ఇందుకు కారణం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు, తొలి కమ్యూనిస్టుగా సీఎంగా పేరుగాంచిన ఈఎంఎస్ నంబూద్రిపాద్, తరవాత అధికార పగ్గాలు అందుకున్న అచ్యుత మీనన్, పీకే వాసుదేవ నాయర్, ఈకే నయనార్ వంటి దిగ్గజనేతలు సైతం రెండోసారి అధికారం సాధించడంలో విజయవంతం కాలేకపోయారు.అన్ని పార్టీల మాదిరిగా సీపీఎంకు కూడా దిల్లీలో కేంద్ర నాయకత్వం ఉన్నప్పటికీ కేరళ ఎన్నికల్లో దాని పాత్ర నామమాత్రమే. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దక్షిణాదికి చెందిన ఏపీ నాయకుడు. మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కేరళీయుడే. అయినప్పటికీ ఈ ఇద్దరు అగ్రనేతల పాత్రకేరళ ఎన్నికల్లో పెద్దగా కనపడలేదు.

శబరిమల అంశం….

ఏవో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడం తప్ప వారి పాత్ర లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు ప్రజాదరణ కలిగిన నేతలు కూడా కారు. అందువల్ల క్షేత్రస్థాయిలో వారి ప్రభావం నామమాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తిగా పినరయి విజయన్ చుట్టూనే తిరిగాయి. భారమంతా ఆయనపైనే పడింది. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకూ అన్నీఆయనే చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏడు పదుల వయసులోనూ ఆయన విసుగు, విరామం లేకుండా, నిర్విరామంగా పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపారు. ప్రత్యర్థుల విమర్శలను, ఆరోపణలను బలంగా తిప్పికొట్టారు. శబరిమలలో మహిళల ప్రవేశం అంశం పార్టీకి ప్రతిబంధకంగా మారకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఐదేళ్ల పాలనలో….

అయిదేళ్ల పాలన కాలంలో అనేక కఠిన పరీక్షలు ఎదుర్కొన్న పినరయి విజయన్ వాటిని విజయవంతంగా అధిగమించారు. రెండేళ్ల క్రితం రాష్రాన్ని వరదలు కుదిపేశాయి. తొలి కరోనా పాజిటీవ్ కేసు వెలుగు చూసింది ఇక్కడే. ఇప్పటికీ కరోనాతో రాష్రం సతమతమవుతోంది. తన పాలన సామర్థ్యంతో ఆయన ఈ సమస్యలను పినరయి విజయన్ ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటింటికీ ఆహార, నిత్యావసర ప్యాకెట్లను సరఫరా చేసి ప్రజల మన్ననలు పొందారు. లక్షలాది మంది పేదలకు అండగా నిలిచారు. ప్రతి బడ్జెట్లో పింఛన్ల మొత్తం పెంచుతూ వచ్చారు. నిస్సాన్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు ఐటీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇవన్నీ ఆయనకు ప్రజాదరణను పెంచాయి.

విజయం పై ధీమా…

కొన్ని ప్రతికూలాంశాలు కూడా లేకపోలేదు. బంగారం అక్రమ రవాణా కుంభకోణం ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఈ కుంభకోణంలో పలువురు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ప్రజలు పెద్దగా విశ్వసించినట్లు కనపడ లేదు. అందువల్లే ప్రచారంలో పినరయి విజయన్ కు ఎక్కడా వ్యతిరేకత ఎదురుకాలేదు. ఇక విపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల తరఫున రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ల ప్రచారం, ఆరోపణలు ప్రజలు విశ్వసించిన పరిస్థితి లేదు. అందువల్ల విజయంపై పినరయి విజయన్, , పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News