వీరిద్దరూ పాపం.. బలయిపోయినట్టేనా ?

ఆ ఇద్దరూ ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. నిజానికి వీరు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. కానీ జగన్ చేరదీసి పెద్దల సభ [more]

Update: 2020-07-06 03:30 GMT

ఆ ఇద్దరూ ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. నిజానికి వీరు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. కానీ జగన్ చేరదీసి పెద్దల సభ ద్వారా మంత్రులను చేశారు. దీంతో డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా గెలిచిన వారికి అవకాశాలు తగ్గాయన్న ఆందోళన నాడే పార్టీలో వినిపించింది. వైసీపీకి ఎమ్మెల్యేలే 151 మంది ఉన్నారు. అంతమందిని ఉంచుకుని మరీ ఎమ్మెల్సీలను మంత్రులుగా చేయాలా అన్న అసంతృప్తి కూడా నాడు గట్టిగానే వచ్చింది. అయితే చిత్రంగా మూడు రాజధానుల అంశం తెర మీదకు రావడం, జగన్ సైతం వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో శాసనమండలిలో టీడీపీ అడ్డుకోవడం జరిగింది. దాంతో జగన్ ఏకంగా మూడవ కన్ను తెరచి మండలి రద్దు అనేశారు.

జరిగింది ఇదే …

సరే జగన్ మూడవ కన్ను తెరిస్తే మండలి మాయం కాలేదు, దాని ఆయువు అలాగే ఉంది. కేవలం తమ అభిప్రాయంగా చెప్పి కేంద్రానికి ఏపీ అసెంబ్లీ పంపించింది. కేంద్రం చేతిలోనే కధ అంతా ఉంది. మరి కేంద్రం మండలి రద్దు అనడంలేదు. అనడానికి, అనకపోవడానికి వారికి కారణాలు కూడా లేవు. రాజకీయ లాభాలు అంతకంటే లేవు. దాంతో మండలి రద్దు జరగలేదు కానీ మంత్రుల పోస్టులు మాత్రం ఊడిపోయాయి. పిల్లి, మోపిదేవి గట్టిగా సీట్లో కూర్చుని ఏడాది అయినా కాకముందే వారిని ఢిల్లీ బాట పట్టించారు జగన్. బీసీనేతలు అంటూ రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించినా మంత్రుల కంటే అది ఎక్కువ కాదన్న మాట ఇపుడు వారు అనుచరుల్లో వినిపిస్తోందిట.

తొందరెందుకో ….?

ఇక మండలి రద్దు అన్న తరువాత పెద్ద తతంగమే ఉందని జగన్ కి తెలుసు. కానీ ఆదరాబాదరాగా ఇద్దరు మంత్రులను పెద్ద సభకు ఢిల్లీకి పంపించేయాలని జగన్ చూడడం వెనక వారి మీద ప్రేమతో పాటు మరో రకమైన రాజకీయం ఉందని ఇపుడు వినిపిస్తున్న మాట. వైసీపీలో మంత్రి పదవులు లేక జనం అల్లాడుతున్నారు. పైగా జగన్ రెండున్నరేళ్ళు కాలపరిమితి పెట్టారు. అసలే ఆశావహులు ఎక్కువ. ఇలా మూతి బిగించేయడంతో ఎక్కడికక్కడ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ సీఎం కావాలని సొంత సామాజికవర్గం రెడ్లు ఎంతో త్యాగం చేసారు. సామాజిక సమీకరణల పేరిట వారికి చెక్ పెట్టేశారు. దాంతో బయట పడని అసంతృప్తి చాలానే ఉందని గ్రహించే జగన్ ఈ ఇద్దరు మంత్రుల ఖాళీలను క్రియేట్ చేశారని అంటున్నారు.

ఇక విస్తరణే….

ఇక తాను అన్న మాట తప్పకుండా ఇద్దరు మంత్రుల రాజీనామాలను చూపిస్తూ మొత్తం విస్తరణకే జగన్ పూనుకుంటున్నారని అంటున్నారు. అలా చేయడం వల్ల మరికొంతమందికి మంత్రి పదవులు అవకాశంగా వస్తుందని అంటున్నారు. నిజానికి భారీ మెజారిటీలు వచ్చిన చోట పరిమితమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఖాళీలను చూపిస్తూ ఆశావహులను అదుపులో ఉంచుకోవాలి. జగన్ కి ఆ రాజకీయ లౌక్యం లేక మొత్తం పదవులు నింపేశారు ఇపుడు ఎమ్మెల్యేల సెగను తట్టుకోలేక ఇద్దరు మంత్రులకు కావాలనే ఉద్వాసన పలికారా. దానికి శాసనమండలి రద్దు సాకుగా వాడుకున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో కొంత మంది పనిచేయని వారిని కూడా ఇంటికి పంపించి కనీసం అరడజను మంది కొత్తవారిని మంత్రులుగా చేస్తే కొంత అయినా న్యాయం జరుగుతుందని జగన్ భావిస్తున్నారుట. మిగిలిన వారికి మరో విడత విస్తరణ ఉంటుందని కూడా సంకేతాలు ఇవ్వడం ద్వారా మొత్తానికి పార్టీలో ఆశావహులకు చెక్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా. సరే ఈ మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే ఆ ఇద్దరు మంత్రులు మాజీలై బలి అయ్యారా అన్న మాట కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News