పిల్లిలో అంత బాధ ఉందా?

జగన్ కి వాస్తవాలు తెలియాలి. కానీ తమ పేరు ఎక్కడా బయటపడకూడదు. ఇదీ ప్రస్తుతం వైసీపీలో సీనియర్ల మనోగతం అంటున్నారు. అంతా బాగుంది అని జగన్ భావిస్తున్నారు. [more]

Update: 2021-05-09 02:00 GMT

జగన్ కి వాస్తవాలు తెలియాలి. కానీ తమ పేరు ఎక్కడా బయటపడకూడదు. ఇదీ ప్రస్తుతం వైసీపీలో సీనియర్ల మనోగతం అంటున్నారు. అంతా బాగుంది అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎవరినీ ఆయన ఖాతరు చేయడంలేదు. ఇక లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నీ జగన్ కి జై కొట్టడం కూడా సీనియర్లకు కొంత ఇబ్బందిగా మారింది. జగన్ తమ వైపు అసలు చూడని వేళ వారు నాలుగు గోడల మధ్యన గోడు వెళ్ళబోసుకుంటున్నారు అన్నది ఇప్పటిదాకా ప్రచారం. అయితే అది వాస్తవమే అని తాజాగా టీడీపీ అనుకూల మీడియా లీక్ చేసిన ఒక వీడియో చెబుతోంది. ఇందులో సగం నిజమే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు అంటే అక్కడికేదే విషయం ఉన్నట్లే కదా లెక్క.

అంతా నా ఇష్టం….

జగన్ తీరు అలాగే ఉంది అంటున్నారు సీనియర్లు. జనాలు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిస్తే కదా అని ఎకసెక్కం ఆడుతున్నారు. బీజేపీ నుంచి వైసీపీలో చేరిన రాజమండ్రీ నేత ఆకుల సత్యనారాయణ ఇంట్లో కొందరు వైసీపీ కీలక నేతలు భేటీ అయి ఇలాగైతే ఎలా అని గాఢంగా నిట్టూర్చారుట. అంతటితో ఆగకుండా కరోనా విషయంలో జగన్ చేతులెత్తేశారు అని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారుట. ఈ భేటీలో రాజమండ్రీ లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ తో పాటు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారని అంటున్నారు. వైఎస్సార్ హయాం నుంచి ఆ ఫ్యామిలీకి అతి పెద్ద నమ్మిన బంటు అయిన పిల్లి ఈ మీటింగులో కొంచెం అసంతృప్తిగా మాట్లాడారు అన్నదే సంచలనంగా ఉంది.

అదేనా బాధ…?

సీనియర్ మోస్ట్ అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కి జగన్ ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ వంటి కీలకమైన శాఖను ఇచ్చారు. అయితే శాసనమండలి రద్దు పేరు మీద ఆయన పదవి ఊడగొట్టేశారు. అయినా సరే గుర్తుంచుకుని రాజ్యసభకు పంపేశారు. ఇది ఏడుపదుల వయసులో పిల్లికి సరైన హోదావే అంటున్నారు. పైగా పిల్లి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడారు. ఆ మాటకు వస్తే ఆయన అంతకు ముందు ఎన్నికలోనూ ఓడారు. సొంత నియోజకవర్గంలో పట్టు లేని పిల్లి సుభాష్ చంద్రబోస్ ని ఇంకా గౌరవించి పెద్దల సభకు పంపారని వైసీపీ నేతలు అంటూంటే పిల్లి మాత్రం మంత్రి పదవి పోయిందని రగిలిపోతున్నారుట. అందుకే ఆయన నోట జగన్ వ్యతిరేక మాట వచ్చిందని చెబుతున్నారు.

అదంతా మార్ఫింగా…?

ఇది ఎలా ఉందంటే అచ్చం తిరుపతి హొటల్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు వీడియో కధ లాగే అంటున్నారు. అప్పుడు అచ్చెన్న కూడా వీడియో మార్ఫింగ్ అన్నారు. చివరికి మాత్రం సైలెంట్ అయ్యారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం పూర్తిగా మార్ఫింగ్ అనడంలేదు. మేము భేటీ కావడం నిజం. మాట్లాడుకోవడం నిజం. కానీ ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేయలేదు అని చెబుతున్నారు. అంటే సగం నిజమని ఆయనే ఒప్పుకున్నాక ఇక మ్యాటర్ పూర్తిగా అర్ధమైపోతోందిగా అంటున్నారు టీడీపీ నేతలు. ఇదిలా పక్కన పెడితే వారు అన్న మాటలు జగన్ కి వ్యతిరేకంగా ఉన్నాయనుకున్నా జనాలకు మాత్రం ఆమోదంగానే ఉన్నాయని కూడా అంటున్నారు. కరోనా వేళ దేని మీద నియంత్రణ లేకుండా ప్రభుత్వం పేదలను బలి ఇచ్చేస్తోందన్నదే జన ఘోష. దాంతో ఈ వ్యవహారంలో గట్టిగా ఏమైనా అన్నా కూడా సర్కార్ కే చిక్కు అనేల సీన్ ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు గుంభనంగానే ఉండాలనుకుంటున్నారుట‌. మరో వైపు చూస్తే సీనియర్ల వేదన వాదన పిల్లి సుభాష్ చంద్రబోస్ ద్వారా బయట పడ్డాయా. పులివెందుల పులి జగన్ మెడలో పిల్లి గంట కడతారా అన్న చర్చ మాత్రం వైసీపీలో గట్టిగా సాగుతోందిట.

Tags:    

Similar News