ఏపీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్‌.. వాస్తవాలు ఏంటి…?

ఫోన్ ట్యాపింగ్‌. ఈ విష‌యం ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఓ ప‌త్రిక వెలుగులోకి తెచ్చిన కోర్టుల‌పై కుట్రల నేప‌థ్యంలో హైకోర్టు న్యాయ‌మూర్తుల [more]

Update: 2020-08-23 12:30 GMT

ఫోన్ ట్యాపింగ్‌. ఈ విష‌యం ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఓ ప‌త్రిక వెలుగులోకి తెచ్చిన కోర్టుల‌పై కుట్రల నేప‌థ్యంలో హైకోర్టు న్యాయ‌మూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు సంచ‌ల‌నాల‌కు,రాజ‌కీయ విమ‌ర్శల కూడా వేదిక అయ్యాయి. దీంతో అస‌లు ఫోన్ ట్యాపింగ్ ఏంటి ? ఎవ‌రు చేయొచ్చు ? ఎవ‌రు చేయ‌కూడ‌దు ? ఏపీలో నిజంగానే న్యాయ‌మూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా ? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి. దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కీల‌క ప్రక్రియ‌. 1885 నాటి టెలిగ్రాఫ్ చ‌ట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ను అనుమ‌తించింది. అంటే.. అవ‌స‌రం అనుకున్న వారి ఫోన్లపై నిఘా ఉంచ‌డ‌మే.

వీటికి మాత్రమే…..

అయితే, ఇది అంద‌రికీ వ‌ర్తించ‌ద‌ని.. 2000 సంవ‌త్సరంలో అప్పటి ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. కేవ‌లం ఇంటిలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సీడీడీటీ, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్, ఎన్ ఐఏ, రా అండ్ అనాలిసిస్ వింగ్ వంటి ప‌ది సంస్థల‌కు మాత్రం… కేంద్ర హోం శాఖ అనుమ‌తి తీసుకుని అత్యంత ర‌హ‌స్యంగా ట్యాపింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. అది కూడా దేశ భ‌ద్రత‌కు ముప్పు.. అంత‌ర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించిన విష‌యాలు, దేశ ఆర్థిక విష‌యాల‌ను ఇత‌ర దేశాల‌కు తెలియజేస్తున్న సంస్థలు, లేదా వ్యక్తులు, మాద‌కద్రవ్యాల ర‌వాణా, దేశ రాజ‌కీయ నేత‌ల‌కు ఇత‌ర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు వంటి వాటి సంద‌ర్భంలోనే ట్యాపింగ్‌ను అనుమ‌తిస్తారు. ఇత‌ర విష‌యాల్లో కానీ, రాష్ట్రాల‌కు కానీ, ట్యాపింగ్ అనుమ‌తి లేదు.

ఓటుకు నోటు కేసులో…..

దీనికి ప్రత్యక్ష ఉదాహ‌ర‌ణ‌.. 2015లో జ‌రిగిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మ‌ధ్య ర‌గ‌డ‌ను చెప్పుకొచ్చవ‌చ్చు. అప్పట్లో త‌న ఎమ్మెల్సీకి ఓటేయాలంటూ.. తెలంగాణ‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఒక‌రికి డ‌బ్బులు చేర‌వేసిన కేసులో ఏపీ సీఎంగా ఉన్నచంద్రబాబు ను దోషిగా చూపించేందుకు తెలంగాణ స‌ర్కారు ఆయ‌న ఫోన్‌ను ట్యాప్ చేసింది. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారితీసింది. నిధులు ఇస్తాన‌న్నది నిజం కావడంతో చంద్రబాబు వెన‌క్కిత‌గ్గారు. ఇక‌, ట్యాపింగ్ నేరం కాబ‌ట్టి త‌మ ప్రభుత్వం ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని కేసీఆర్ వెన‌క్కి త‌గ్గారు. అంటే అప్పట్లో తెలంగాణ ట్యాపింగ్ చేయ‌క‌పోయి ఉంటే చంద్రబాబును బోనెక్కించి ఉండేవార‌నే వాద‌న కూడా ఉంది.

న్యాయమూర్తుల ఫోన్లు….

ఇక‌, ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌ద్దాం.. హైకోర్టులో జ‌గ‌న్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. న్యాయ‌మూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నార‌నేది ఓ మీడియా తీసుకువ‌చ్చిన క‌ధ‌నం. దీనిపై తాజాగా హైకోర్టులో పిల్ కూడా దాఖ‌లైంది. నిజానికి ఈ విష‌యంలో ప్రభుత్వానికి ఎలాంటి అర్హతా లేదు. ఒక‌వేళ నిజంగానే ట్యాపింగ్ చేస్తే.. న్యాయ‌మూర్తులే ట్యాపింగ్ చేస్తున్నార‌నే ఫిర్యాదు చేసి ఉండొచ్చు. కానీ, ఓ ప‌త్రిక‌, అందునా జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా ఉండే ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థనంపై వాస్తవాలు తేలాల్సి ఉంది. కానీ, ఇంత‌లోనే దీనికి రాజ‌కీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ సీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు త‌న ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తున్నార‌నే అనుమానం ఉందంటూ.. వ్యాఖ్యానించారు.

గతంలో వైసీపీ కూడా….

దీనిపై ఏకంగా ఆయ‌న కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గ‌తంలోనూ ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో వైఎస్సార్ సీపీ నాయ‌కుడు విజ‌య‌సాయి రెడ్డి కూడా త‌మ ఫోన్లను చంద్రబాబు ఇంటిలిజెన్స్‌ను వినియోగించి ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారంటూ.. వాదించారు. కానీ, అది వాస్తవం కాద‌ని అప్పట్లోనే తేలిపోయింది. తాజాగా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి హోం మంత్రి సుచ‌రిత కూడా అదే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏముందని, మీరేమైనా.. దేశ‌ద్రోహానికి పాల్పడ్డారా? అంటూ.. ప్రశ్నించారు. మొత్తంగా.. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Tags:    

Similar News