ఈయన మంత్రి అయితే మజాయే వేరు ?

కొన్ని చోట్ల పొలిటికల్ సీన్లు యాక్షన్ మూవీనే తలపిస్తాయి. అలాంటి వాటిలో విశాఖ జిల్లా నర్శీపట్నం ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బాగా పాతుకుపోయారు. [more]

Update: 2021-04-05 12:30 GMT

కొన్ని చోట్ల పొలిటికల్ సీన్లు యాక్షన్ మూవీనే తలపిస్తాయి. అలాంటి వాటిలో విశాఖ జిల్లా నర్శీపట్నం ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బాగా పాతుకుపోయారు. పెళ్ళి కాక ముందే మంత్రి అయిన రికార్డు ఆయన సొంతం. ఇక అయ్యన్న వటవృక్షం మాదిరిగా నియోజకవర్గం అంతటా బలంగా విస్తరించారు. అయ్యన్నపాత్రుడును ఢీ కొట్టడం కష్టం అన్న వేళకు పుట్టుకువచ్చారు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్. ఈయనతో పేచీ ఇపుడు అయ్యన్నను తెగ టార్చర్ పెడుతోంది.

ఇదే ఓటమి….

అయ్యన్నపాత్రుడుకు ఓటమి కొత్త కాదు, ఆయన 1989లో తొలిసారి ఓడారు. అలాగే 2004 ఎన్నికల్లో రెండవమారు కూడా ఓడారు. కానీ నాడు ఎక్కడా టీడీపీ పునాదులు కదిలిపోలేదు. కేవలం నాటి కాంగ్రెస్ పార్టీ వేవ్ కారణంగా కాస్తా పక్కకు జరిగారంతే. ఇపుడు అలా కాదు, పెట్ల ఉమాశంకర్ ఒక్క ఎన్నికతోనే దడ పుట్టించేస్తున్నారు. పైగా అయ్యన్న మీద‌ పాతిక వేల మెజారిటీతో గెలిచారు. ఇక పంచాయతీలు, మునిసిపాలిటీని కూడా గెలిచి మొత్తం క్లీన్ స్వీప్ చేసేశారు. ఇక ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేతో పెట్ల శాంతించే రకం అంతకంటే కాదు, నాలుగు కాలాల పాటు తన రాజకీయాన్ని పటిష్టపరచుకుని బడా నాయకుడు కావాలన్నదే ఉమా శంకర్ గణేష్ ఆశయం. దానికి తగిన వ్యూహాలు ఉన్నాయి. వయసు ఉంది. వెన్ను తట్టే వైసీపీ అధినాయకత్వం కూడా ఉంది. అందుకే అయ్యన్న ఫ్యామిలీకి ఇపుడే అసలైన సవాల్ ఎదురవుతోంది.

మంత్రి రేసులో ….

ఇప్పటిదాకా వైసీపీ తరఫున వినిపించిన మంత్రి పదవుల రేసులో అనేక మంది ఉన్నారు. వారి లిస్టులోకి కొత్తగా పెట్ల ఉమాశంకర్ వచ్చి చేరారు. అయ్యన్న కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న నర్శీపట్నాన్ని ఒక్క దెబ్బకు మునిసిపల్ ఎన్నికల్లో కూల్చేసిన ఉమా శంకర్ మీద జగన్ మక్కువ మరింతగా పెంచుకున్నారుట. అయ్యన్నపాత్రుడు జగన్ ని ప్రతీ రోజూ నానా రకాలైన విమర్శలతో తూలనాడేవారు. చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా జగన్ మీద రెచ్చిపోయేవారు. సరైన సమయం చూసి ఆయనకు సౌండ్ లేకుండా చేసిన పెట్ల అంటే జగన్ ఇపుడు ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు అంటున్నారు.

డౌటే లేదు….

నర్శీపట్నం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. గతంలో ఎన్టీయార్ తరువాత చంద్రబాబు పలుమార్లు అయ్యన్నను మంత్రిని చేశారు. ఇపుడు అయ్యన్న ఫ్యామిలీని పూర్తిగా సైడ్ చేయాలంటే పెట్ల ఉమాశంకర్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ అయితే క్యాడర్ నుంచి వస్తోంది. జగన్ కి కూడా లెక్కలు అన్నీ తెలుసు. అందువల్ల ఉత్తరాంధ్రా జిల్లా సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని మరీ పెట్ల నెత్తిన అమాత్య కిరీటం పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే అయ్యన్నకు అతి దెబ్బ పడిపోయినట్లేనని కూడా అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News