మనోడి మాటలతోనే…?

సయ్యద్ అక్బరుద్దీన్….. ఆయన ఎవరు..? ఏం చేస్తుంటారు? ఎక్కడ పనిచేస్తుంటారు? తదితర విషయాలు సగటు భారతీయుడికి రేఖామాత్రంగా కూడా తెలియవు. ఆ మాటకు వస్తే మేధావి వర్గంలో [more]

Update: 2019-08-21 16:30 GMT

సయ్యద్ అక్బరుద్దీన్….. ఆయన ఎవరు..? ఏం చేస్తుంటారు? ఎక్కడ పనిచేస్తుంటారు? తదితర విషయాలు సగటు భారతీయుడికి రేఖామాత్రంగా కూడా తెలియవు. ఆ మాటకు వస్తే మేధావి వర్గంలో కూడా కొంతమందికే సుపరిచితం. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సభ. అంతర్జాతీయ వేదికలపై వివిధ అంశాలకు సంబంధించి భారత్ విధానాన్ని, వైఖరిని సమర్థవంతంగా వినిపించడం ఆయన విధి. వివిధ దేశాల అధినేతలను, దౌత్యవేత్తలను కలిసి కీలక అంశాలపై భారత్ వాణిని సవివరంగా, సమర్థవంతంగా తెలియచేయడం ఆయన విధి నిర్వహణలో ఒక భాగం. సీనియర్ దౌత్యవేత్త అయిన సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయంలో ఎప్పుడూ భారత్ గౌరవ ప్రతిష్టలు కాపాడుతూ వచ్చారు.

భారత్ వైఖరిని…..

తాజాగా ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని బలంగా వినిపించి దాయాది దేశం పాకిస్థాన్, దాని అనుంగు మిత్రదేశం చైనాకుక చుక్కలు చూపించారు. భారత్ వైఖరిని సవివరంగా తెలియ చేయడం ద్వారా న్యూఢిల్లీ ప్రతిష్టను నిలువెత్తులో నిలిపారు. తాజాగా జమ్మూ, కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ అధికరణల రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాకిస్థాన్ నానా యాగీ చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై హడావిడి చేస్తుంది. సర్వకాల సర్వావ్యవస్థల్లో తన మిత్రదేశమైన చైనా మద్దతుతో చెలరేగిపోతోంది. తనది కాని, తనకు సంబంధించని, పూర్తిగా ద్వైపాక్షిక అంశమైన కాశ్మీర్ ను అంతర్జాతీయ వేదికలపైకి లాగడం దాని దుష్ట పన్నాగం అర్థమవుతోంది. దీనిని ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత ప్రతినిధి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాక్ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. దాని వాదనలో ఎలాంటి పస లేదని సహేతుకంగా వివరించారు. దీంతో పాక్ తోక ముడుచుకోవాల్సి వచ్చింది. చేసేదేమీలేక చైనా కూడా అనివార్యంగా వెనక్కు తగ్గక తప్పలేదు.

పాక్ యాగీ చేసేందుకు….

కాశ్మీర్ పై చర్చించడానికి రహస్యంగా నిర్వహించిన ఐరాస భద్రతామండలి వేదికగా భారత్ పై యాగీ చేయడానికి పాక్, చైనాలు ప్రయత్నించాయి. ఇది ద్వైపాక్షిక అంశమని మెజార్టీ సర్వసభ్య దేశాలు తేల్చి చెప్పడంతో పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. గత్యంతరం లేక పాక్, చైనా రాయబారులు ఝాంగ్ జన్, మలీహా లోథీ సమావేశం నుంచి బయటకు వచ్చి సొంతంగా ప్రకటనలు చేసి నిష్క్రమించారు. కనీసం పాత్రికేయుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చేందుకు వారు నిరాకరించారు. సమావేశంలో ఒక ప్రకటన కోసం చైనా పట్టుబట్టింది. ఇందుకు బ్రిటన్న మద్దతు పలికింది. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు సమావేశం అనంతరం భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్న పోలాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

చాకచక్యంగా వ్యవహరించి…..

ఇక పాక్, చైనా దౌత్యవేత్తలకు భిన్నంగా భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చాకచక్యంగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయా దేశాల దౌత్యవేత్తల ప్రకటనలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా పరిగణించలేమని అక్బరుద్దీన్ కుండబద్దలు కొట్టారు. మండలి సమావేశం అనంతరం పాక్, చైనా దౌత్యవేత్తలకు భిన్నంగా విలేకర్లుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్వయంగా, ప్రత్యేకించి పాక్ విలేకరుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించారు. ముందుగా వారితో కరచాలనం చేశారు. చర్చలకు భారత్ ఎప్పుడు సిద్ధపడుతుందన్న పాక్ విలేకరుల ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఆపితేనే అది సాధ్యమవుతుందని తెలివిగా సమాధానమిచ్చారు. చర్చలకు భారత్ వ్యతిరేకం కాదని చెబుతూనే, అది పాక్ పైనే ఆధారపడి ఉందని చెప్పడం ద్వారా భారత్ వైఖరిని విస్పష్టంగా వివరించారు. 370, 35ఎ అధికరణల రద్దు భఆరత్ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు ఎలా జోక్యం చేసుకోగలని ప్రశ్నించడం ద్వారా పాక్ విలేకరులను ఇరుకున పెట్టగలిగారు.

ఆయన కృషివల్లే….

పాక్ ను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా చిక్కుల్లో పడింది. జర్మనీ, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఆఫ్రికా దేశాలు భారత్ కు దన్నుగా నిలబడటంలో అక్బరుద్దీన్ కృషి దాగుంది. ఉభయ దేశాల మధ్య చర్చలు జరగాలన్న ఫ్రాన్స్, ఇండోనేసియా ప్రకటన వెనక అక్బకుద్దీన్ పాత్ర కూడా ఉంది. 2016 జనవరి నుంచి అక్బరుద్దీన్ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కావడం విశేషం. ఆయన తండ్రి బషీరుద్దీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతిగా పనిచేశఆరు. కతర్ లో భారత రాయబారిగా వ్యవహరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా సేవ లందించారు. పూనేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ అధారిటీ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన భార్య డాక్టర్ జేబా బషీరుద్దీన్ పుట్టపర్తి సత్యసాయి యూనివర్సిటీలో ఆంగ్ల విభాగ అధిపతిగా పనిచేశారు. అక్బరుద్దీన్ హైదరాబాదీ కావడం తెలుగువారికి గర్వకారణం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News