చైనా బలోపేతం అయిందా? అమెరికా ఆందోళన అదేనా?

ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా- సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) మధ్య పోటీ ఉండేది. రెండు దేశాల బలం, బలగం సమానంగా ఉండేది. ఆర్మీ, నేవీ, ఎయిర్ [more]

Update: 2020-09-22 16:30 GMT

ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా- సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) మధ్య పోటీ ఉండేది. రెండు దేశాల బలం, బలగం సమానంగా ఉండేది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పరంగా రెండు దేశాలు పోటాపోటీగా ఉండేవి. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసేందుకు ఎత్తులు పైయెత్తులు వేసేవి. అప్పట్లో యావత్ ప్రపంచం రెండుగా విడిపోయింది. చిన్న దేశాలు అటు అమెరికా వైపో, లేదా ఇటు సోవియట్ యూనియన్ వైపో మొగ్గు చూపాల్సిన అనివార్యమైన పరిస్థితి నెలకొంది. భారత్ వంటి ఒకట్రెండు దేశాలు తటస్థంగా ఉండేవి. అయినప్పటికీ సోవియట్ వైపే భారత్ మొగ్గు ఉండేది. 90వ దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్ పతనం తరవాత అమెరికాకు ఎదురులేకుండా పోయింది. తాను ఆడింది పాడింది పాటగా మారింది.

చైనా దూకుడుతో….

నాటి సోవియట్ స్థానాన్ని చైనా ఇప్పుడు చైనా భర్తీ చేస్తోంది. అంతర్జాతీయంగా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది. అన్ని విషయాల్లో సవాల్ చేస్తోంది. తన ఆర్మీ, నేవీ, వైమానిక దళాన్ని బలోపేతం చేసుకుంటోంది. అధునాతన సాధన సంపత్తిని సమకూర్చుకుంటోంది. అభివద్ధి చెందిన దేశం, వంద కోట్లకు పైగా గల జనాభా, ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశంగా అంతర్జాతీయ వ్యవహారల్లో కీలకపాత్ర పోషిస్తోంది. తన మాట నెగ్గించుకునేందుకు తాపత్రయపడుతోంది. బీజింగ్ ఎదుగుదలను అమెరికా ఒక కంట గమనిస్తూనే ఉంది. తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూనే ఉంది. చైనా నేవీ అమెరికా కన్నా బలోపేతంగా ఉందని తాజాగా ‘పెంటగాన్’ వెల్లడించింది. డ్రాగన్ అంతర్జాతీయంగా శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుందని పేర్కొంది. అగ్రరాజ్యం రక్షణ కార్యాలయాన్ని పెంటగాన్ అని వ్యవహరిస్తారు.

అమెరికాకు ఆందోళన…..

ఇటీవల వెలుగు చూసిన పెంటగాన్ నివేదిక అమెరికాకు ఒకింత ఆందోళన కలిగించే మాట వాస్తవం. చైనా మూడు విభాగాల్లో ముఖ్యంగా నేవీ శక్తి సంపన్నంగా ఉందని తక్షణం అప్రమత్తం కావాలని ఆ నివేదిక హెచ్చరించింది. చైనా వద్ద 350 నౌకలు, జలాంతర్గాములు ఉండగా, వాషింగ్టన్ వద్ద కేవలం 293 మాత్రమే ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. చైనా బలానికి ఇంతకు మించి మరో నిదర్శనం అక్కరలేదని వ్యాఖ్యానించింది. అయితే ఇందులో అమెరికాకు ఊరట కలిగించే అంశం ఒకటి ఉంది. సంఖ్యాపరంగా బీజింగ్ వద్ద ఎక్కువ నౌకలు ఉన్నప్పటికీ అవి చిన్నవి. వాటిపై 5200 క్షిపణులను మాత్రమే మోహరించగలదు. అదే సమయంలో అమెరికా వద్ద తక్కువ ఉన్నప్పటికీ అవి చాలా పెద్దవి. వాటిపై దాదాపు 12వేల క్షిపణులను మోహరించే అవకాశం ఉంది. అయితే ఈ కారణం చూపి అలక్ష్యం వహించరాదని, బలాన్ని పెంచుకోవాలని అమెరికా ప్రభుత్వానికి పెంటగాన్ విస్పష్టంగా సూచించింది. నౌకాదళం దన్ను చూసే భారత్, అమెరికా కలసి తనపై దాడిచేసినా తిప్పిగొట్టగలమని చైనా ప్రభుత్వ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ ’ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది.

అందుకే నౌకాదళంపై…..

ఆధునిక యుగంలో భూమిపై జరిగే యుద్ధాలు పరిమితమే. అంతా నౌకా, వైమానిక యుద్ధాలే అధికం. సైన్యం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంది తప్ప శత్రు దేశంలోకి ఉన్నపళంగా చొరబడలేదు. వైమానిక, నౌకా దళానికి ఆ శక్తి ఉంది. యద్ధ విమానాలు విమాన వాహకనౌకల నుంచి దాడికి బయలు దేరతాయి. నౌకలు నేరుగా సముద్ర జలాలను దాటి పొరుగుదేశంలోకి చొచ్చుకుపోగలవు. ఈ విషయాన్ని గుర్తించే బీజింగ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లను పక్కనపెట్టి నౌకాదళం బలోపేతంపై దష్టి సారించింది. బలమైన నౌకాదళం కారణంగానే చైనా దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో తన బలగాలను మోహరించిందన్న విషయం గమనార్హం. విమాన వాహక యుద్ధ నౌకలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న సైనిక స్థావరాల ద్వారా అమెరికా కు ఏ దేశంపైన అయినా దాడి చేయగల సమకూరింది.

ఒక్క నౌకాదళం మినహా….

చైనా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని ఈ రెండు అంశాలపై దష్టి సారించడం ద్వారా అమెరికాను అవసరమైతే గట్టిగా ఎదురుదెబ్బ తీసే స్థాయికి ఎదిగింది. ఈ అంశాలను పెంటగాన్ తన నివేదికలో సవివరంగా ప్రస్తావించింది. అయితే ఒక్క నేవీ మినహా ఇప్పటికీ మిలటరీ, వైమానిక దళం పరంగా అమెరికాదే పైచేయి. రక్షణ వ్యయంలోనూ అగ్రరాజ్యానిదే ఆధిపత్యం. 2020 -21 లో చైనా రక్షణ వ్యయం రూ.13 లక్షల కోట్లు. అయితే అనధికారికంగా రూ.18 లక్షల కోట్లు ఉండవచ్చని రక్షణ నిపుణుల అంచనా. భారత రక్షణ బడ్జెట్ కు ఇది నాలుగురెట్లు అధికం. అమెరికా రక్షణ బడ్జెట్ ఏకంగా 54 లక్షలకోట్లు కావడం గమనార్హం. అంతమాత్రాన అలక్ష్యం వహిస్తే ఏ రోజైనా వాషింగ్టన్ ను బీజింగ్ అధిగమించగలదు. ఈ విషయం అగ్రరాజ్యానికి బోధపడినట్లే కనపడుతుంది. అందుకే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా చైనా లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News