ఆ సీటు కోసం మూడు ముక్క‌లాటేనా

పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశార‌నే [more]

Update: 2019-02-09 12:30 GMT

పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశార‌నే మంచి పేరైయితే ఉంది కాని..అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు కూడా పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో అయితే ఈ సారి ఆయ‌న కాకుండా త‌న‌యుడు అప్ప‌ల‌నాయుడు పోటీ చేస్తార‌ని ప్ర‌చారంలో ఉంది. తండ్రిని ప‌క్క‌న పెట్టి ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో అప్ప‌ల‌నాయుడి జోక్యం మితిమీరి సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇక భూ క‌బ్జాలు, సెటిల్‌మెట్ల‌తో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం లాంటి వ్య‌వ‌హారాలు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అస‌లు స‌మ‌స్యంతా కొడుకుతోనే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

స‌త్య‌నారాయ‌ణ పార్టీలో సీనియ‌ర్‌. ఆయ‌న గ‌తంలో ర‌ద్ద‌యిన ప‌ర‌వాడ నుంచి మూడుసార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిన ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో పెందుర్తి నుంచి విజ‌యం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్థి బాబ్జి చేతిలో, 2009లో ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థి పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబుపై స‌త్యానారాయ‌ణ ఓడిపోయారు. అయితే 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గండి బాబ్జిపై విజ‌యం సాధించారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం కలిగి ఉన్న స‌త్య‌నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గానికి ఎక్కువ‌గానే నిధులు తెచ్చుకోగ‌లిగారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ అంశాలు జ‌నంలో ఆయ‌న‌పై సానుకూల‌త‌ను క‌లిగిస్తుండ‌గా ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌లు కూడా మ‌చ్చ‌గానే మిగిలిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కైతే ఆయ‌న పేరు త‌ప్పా మ‌రొక‌రి పేరు ప్ర‌స్తావ‌నయితే రావ‌డం లేదు క‌నుక‌. ఆయ‌న‌కే టికెట్ ద‌క్కే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని తెలుస్తోంది.

ఇక వైసీపీ నుంచి అదీప్‌రాజు ప్ర‌ముఖంగా విన‌బ‌డుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌గా ప‌నిచేస్తున్నారు. అదీప్‌కాకుండా మ‌రోక‌రికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తే దివంగ‌త నేత మాజీమంత్రి గుడివాడ గురునాథ‌రావు త‌న‌యుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ పేరు అనౌన్స్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.అయితే అదీప్‌కే ఎక్కువ‌గా ఛాన్స్ ఉన్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. ప్ర‌జాక్షేత్రంలో నిరంత‌రం తిరుగుతూ పార్టీ క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేస్తున్నారు.ఇంత‌కు ముందు ఎలాంటి ప‌దవులు చేప‌ట్ట‌క‌పోయినా, రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా ఆయ‌న కొంత ప్ర‌జాభిమానం సొంతంగా సంపాదించుకోగ‌లిగార‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర‌ను కూడా పూర్తి చేయ‌డంతో సొంతంగా క్యాడ‌ర్‌ను నిర్మించుకోగ‌లిగారు. దీంతో అధిష్ఠానం ఆయ‌న వైపే మొగ్గే ఛాన్స్ అయితే ఉంది.

2009లో ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థిగా పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు ఇక్క‌డ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో జ‌న‌సేన కూడా ఇక్క‌డ గెలిచే అవ‌కాశం ఉంద‌ని క‌న్నేసింది. కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. బీసీల ఓట్ల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగితే గెలుపు తథ్యం ధోర‌ణిలో ఆ పార్టీ పావులు క‌దుపుతోంది. జ‌న‌సేన నుంచి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ గుంటూరు న‌ర్సింహామూర్తి, వేగి దివాక‌ర్‌, మండ‌వ ర‌వికుమార్ వంటి నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మూడు పార్టీలు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో త్రిముఖ పోరు ఉండ‌నుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News