పెద్దిరెడ్డి టార్గెట్ ఎందుకవుతున్నారు?

ఇప్పుడు విపక్షాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కన్నా ఆయన మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన టార్గెట్ గా మారారు. పదిహేను నెలల నుంచి పెద్ది రెడ్డి [more]

Update: 2020-10-09 00:30 GMT

ఇప్పుడు విపక్షాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కన్నా ఆయన మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన టార్గెట్ గా మారారు. పదిహేను నెలల నుంచి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిపై విపక్షాలు అనేక ఆరోపణలు చేశాయి. ఆయనను వివాదాస్పదమైన వ్యక్తిగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ అధికారంలో లేకపోయినా ఎనిమిదేళ్లపాటు అన్ని రకాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధినేతకు సహకరించారు.

జగన్ కోటరీలో…..

అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కోటరీలో ముఖ్యులుగా మారారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటను జగన్ కాదనలేరన్నది వైసీపీలో అందరూ అంగీకరించే వాస్తవం. జగన్ కు ఎంత విలువ ఇస్తారో అదే గౌరవం, విలువ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ నేతలు ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఫోకస్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే తెలుగుదేశం పార్టీ పెట్టింది.

వరస వివాదాలు….

అయితే వరసగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిలో కూడా పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్నది టీడీపీ ఆరోపణ. జడ్జి రామకృష్ణ కుటుంబాన్ని పెద్దిరెడ్డి టార్గెట్ చేశారని, దళితులపై దాడులకు దిగుతున్నారని టీడీపీ పదే పదే ఆరోపిస్తుంది. అయితే తనకు ఈ విషయంలో సంబంధం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఆయన ప్రమేయం లేకుండా ఘటనలు జరుగుతాయా? అన్న సందేహం కూడా టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.

రోడ్డు వ్యవహారం…..

ఇక తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటికి ప్రభుత్వ నిధులతో రోడ్డును నిర్మించుకోవడం కూడా వివాదమయింది. అధికారులను బెదిరించి మరీ పెద్దిరెడ్డి రోడ్డును నిర్మించుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. రోడ్డుకోసం తన సొంత భూమి పోయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అప్పటికే ప్రజల్లోకి పెద్దిరెడ్డి రోడ్డు వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. సొంత పార్టీ నేతలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ప్రత్యర్థి పార్టీలకు ఉప్పు అందిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విపక్షాలకు టార్గెట్ గా మారారు.

Tags:    

Similar News