పెద్దిరెడ్డి ఖాతరు చేయడం లేదే?

సాధార‌ణంగా పైకి క‌నిపిస్తున్న వాతావ‌ర‌ణానికి, పైకి వ‌స్తున్న వార్తల‌ను చూస్తే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులు అంద‌రూ కూడా జ‌గ‌న్‌ను చూసి భ‌య‌ప‌డ‌తార‌ని, ఆయ‌న‌కు ఏమాత్రం ఎదురు చెప్పర‌ని [more]

Update: 2020-02-04 02:00 GMT

సాధార‌ణంగా పైకి క‌నిపిస్తున్న వాతావ‌ర‌ణానికి, పైకి వ‌స్తున్న వార్తల‌ను చూస్తే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులు అంద‌రూ కూడా జ‌గ‌న్‌ను చూసి భ‌య‌ప‌డ‌తార‌ని, ఆయ‌న‌కు ఏమాత్రం ఎదురు చెప్పర‌ని అనుకుంటారు. కానీ, నిశితంగా గ‌మ‌నిస్తే ఎవ‌రికి వారే మోనార్క్‌లు. అయితే, వీరిలో ఓ న‌లుగురైదుగురు మిన‌హా ప్రతి ఒక్కరూ వారి పంథాలో వారు వెళ్తున్నారు. ఇక‌, మ‌రొక‌రు మాత్రం అటు అధికారుల‌ను, ఇటు నియోజ‌క‌వర్గంలోను, మ‌రీ ముఖ్యంగా సీఎంవోలోను కూడా తాను చెప్పిందే వేదం అనే మాదిరిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. ఆయ‌నే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.

కోర్ టీంలో కీలకం…..

చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన సీనియ‌ర్ నాయ‌కుడిగా ఆయ‌న‌కు మంచి పేరుంది. గ‌తంలో వైఎస్ జ‌మానా నుంచి కూడా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయ‌న రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి కూడా ఎంపీగా వ‌రుస విజ‌యాలు సాధించి వైసీపీకి ఢిల్లీలో కీల‌కంగా మారారు. మిథున్‌రెడ్డి పార్టీ త‌ర‌పున అనంత‌పురం జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటే జ‌గ‌న్ కోర్ టీంలో కీల‌కం.

ఓట్లు తెచ్చి పెట్టే….

ఇక‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం ఆయ‌న జ‌గ‌న్ కేబినెట్‌లో పంచాయ‌తిరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రిగా ప‌నిచేస్తున్నారు. ఇది పైకి ఏముందిలే అనే పోర్ట్ ఫోలియో. అయితే, ప్రభుత్వానికి ఓటు బ్యాంకును చేకూర్చేశాఖ‌ల్లో అత్యంత కీల‌క‌మైంది ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న గ్రామీణ ఉపాధి ప‌థ‌కం స‌మా పంచాయితీ అభివృద్ధి ప‌నులు అన్నీ కూడా ఈ శాఖ ద్వారానే సాగుతాయి. ఇంత కీల‌క‌మైన శాఖ‌ను నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉపాధి ప‌నుల‌ను త‌న వారికి , లేదా పార్టీలో జ‌గ‌న్ సంకేతాలు ఉన్న వారికి మాత్రమే క‌ట్టబెడుతున్నారనే విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ముప్పుతిప్పలు పెడుతూ….

గ‌త ప్రభుత్వంలో ప‌నులు చేసి , నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి పైసా కూడా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నార‌ట‌. ఇది సాధార‌ణంగా ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా జ‌రిగేదే అనుకోండి కానీ, త‌న నియోజ‌క‌వ‌ర్గం, సీఎం నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్రమే ప‌నులు కేటాయిస్తూ నిధులు విడుద‌ల చేయ‌డం, ఎవ‌రైనా అడిగితే తన క‌న్నా నీకు ఎక్కువ తెలుసా? అని ప్రశ్నించ‌డం పెద్దిరెడ్డి స్టయిలని చెప్పుకొంటున్నారు.

వార్నింగ్ లు ఇస్తూ…..

జ‌గ‌న్‌కు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య ఉన్న ప‌రిచ‌యాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నార‌ట‌. దీంతో పెద్దిరెడ్డిని ఇప్పుడు సీత‌య్య అంటూ సంబోధించుకుంటున్నార‌ట వైసీపీ నాయ‌కులు. ఇక‌, సొంత జిల్లా చిత్తూరులో నూ అన్ని ప‌నులూ త‌న క‌నుస‌న్నల్లోనే సాగాల‌ని చూడ‌డ‌మే కాకుండా.. ఏ నాయ‌కుడైనా త‌న మాట మీరితే.. చ‌ర్యలు త‌ప్పవ‌నే హెచ్చరిక‌లు కూడా పంపుతున్నార‌ట. సో.. జ‌గ‌న్ కేబినెట్‌లో సీత‌య్య ప‌నితీరు ఇదేన‌ని అంద‌రూ చెప్పుకొంటుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News