మంత్రి పెద్దిరెడ్డి సక్సెస్ అవుతారా? వైసీపీలో హాట్ టాపిక్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితం. ఆయన కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ ఎవరికీ ఇవ్వలేదు. పెద్దిరెడ్డి కుటుంబంలో గత [more]

Update: 2020-10-03 03:30 GMT

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితం. ఆయన కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ ఎవరికీ ఇవ్వలేదు. పెద్దిరెడ్డి కుటుంబంలో గత ఎన్నికల్లో మూడు టిక్కెట్లను జగన్ ఇచ్చారు. అదే వారి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక విషయంలో మాత్రం సక్సెస్ అవుతారా? లేదా? అన్న ఆసక్తికర చర్చ చిత్తూరు జిల్లా వైసీపీ నేతల్లో జరుగుతుంది. అందులో సక్సెస్ అయితే పెద్దిరెడ్డికి తిరుగులేనట్లేనని భావిస్తున్నారు.

ఆధిపత్యం కోసం……

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నా చిత్తూరు జిల్లాకే ఎక్కువ పరిమితమవుతారు. తన జిల్లాలో ఆధిపత్యం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిత్యం ప్రయత్నిస్తుంటారు. అందుకే మంత్రి వర్గ విస్తరణలోనూ జగన్ కు అత్యంత సన్నిహితులైన, ఇష్టులైన భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి కూడా చోటు లభించలేదు. దీనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమని అందరికీ తెలిసిందే. వచ్చే విస్తరణలోనూ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చన్నది వైసీపీ నేతల భావన.

మదనపల్లిని జిల్లా కేంద్రంగా…

అయితే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట నెగ్గుతుందా? లేదా? అన్నది. జగన్ లోక్ సభ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని కూడా నియమించారు. అయితే రాజంపేట విష‍యంలో కొంత ఆలోచన చేయక తప్పదంటున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలున్నాయి. కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే పెద్దిరెడ్డిపై జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తీసుకురావాలని వత్తిడి పెరుగుతుంది.

కడప నుంచి అభ్యంతరాలు…

చిత్తూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండటంతో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే తన ఆధిపత్యం తగ్గిపోతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. అందుకోసం మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని పెద్దిరెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై కడప జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తే తమకు దూరం అవుతుందని రాయచోటి ప్రాంత వాసులు నో చెబుతున్నారు. ఇటు మదనపల్లెలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ ను ఎలా ఒప్పించగలుగుతారో చూడాలని అంటున్నారు వైసీపీ నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News