పెద్దారెడ్డి తేరుకోలేకపోతున్నారా?

మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఖుషీగా ఉన్నా ఒక్క తాడిపత్రిలో మాత్రం ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్ హ్యాపీ. మున్సిపాలిటీ చేజారిపోవడంతో ఆయన పూర్తిగా [more]

Update: 2021-04-15 13:30 GMT

మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఖుషీగా ఉన్నా ఒక్క తాడిపత్రిలో మాత్రం ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్ హ్యాపీ. మున్సిపాలిటీ చేజారిపోవడంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అధినాయకత్వానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో పెద్దారెడ్డి ఉన్నారు. అందుకే పెద్దారెడ్డి దూకుడు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులకు సయితం ఇదే రకమైన ఆదేశాలు జారీ చేశారంటున్నారు.

ఆ ఎన్నికలు డిఫరెంట్….

పెద్దారెడ్డి గత ఎన్నికల్లో ఊహించని విధంగా జేసీ అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు. జగన్ చరిష్మాతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలో లేకపోవడం, అస్మిత్ రెడ్డి యువకుడు కావడంతో ప్రజలుపెద్దారెడ్డి వైపు మొగ్గు చూపారు. దశాబ్దాల తర్వాత తాడిపత్రిలో తొలిసారి జేసీ బ్రదర్స్ కు పెద్దారెడ్డి చెక్ పెట్టి విజయం సాధించగలిగారు. దీంతో జగన్ కూడా అనేక సార్లు పెద్దారెడ్డి విషయాన్ని పార్టీ సీనియర్ నేతల వద్ద ప్రస్తావించేవారట.

లైట్ గా తీసుకోవడంతో…..

కాగా మున్సిపల్ ఎన్నికలకు ముందు పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి తన అనుచరులతో వెళ్లడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడే పెద్దారెడ్డి అప్రమత్తమవ్వాల్సిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని తక్కువగా అంచనా వేయడం, మున్సిపాలిటీలో సరైన వ్యూహాన్ని అమలు పర్చకపోవడంతోనే తాడిపత్రిలో పెద్దారెడ్డికి పరాభవం ఎదురయిందంటున్నారు.

దూకుడు తగ్గించాలని…..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నుంచి పెద్దారెడ్డి పెద్దగా ప్రజల ముందుకు రావడం లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బయటకు వచ్చినా ఆయన వివాదరహితంగానే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వివాదాలు వస్తే అది జేసీకి ప్లస్ అవుతుందని మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత గాని పెద్దారెడ్డికి తెలిసి రాలేదు. జేసీపై వరస కేసులు కూడా మున్సిపాలిటీలో ఓటమికి ఒక కారణమని పెద్దారెడ్డి అధినాయకత్వానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద పెద్దారెడ్డి పరాభవాన్నుంచి తేరుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News