ప‌య్యావుల‌కు చెక్‌.. వైసీపీ వ్యూహం స‌క్సెస్ అయ్యేనా..?

రాజ‌కీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. ప్రత్యర్థుల‌పై పైచేయి సాధించేందుకు నాయ‌కులు వేసే ఎత్తులు చాలా చిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఎత్తుగ‌డే ఒక‌టి అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ [more]

Update: 2020-02-27 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. ప్రత్యర్థుల‌పై పైచేయి సాధించేందుకు నాయ‌కులు వేసే ఎత్తులు చాలా చిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఎత్తుగ‌డే ఒక‌టి అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉడికిస్తోంది. అధికార పార్టీ వైసీపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఇక్కడ ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయ‌కుడు, పీఏసీ చైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్‌కు చుక్కలు చూపిస్తోందట‌! దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తత‌లు చోటు చేసుకున్నాయి. మ‌రి ఆ విష‌యం ఏంటో.. ప‌య్యావుల‌ కేశవ్ కు ఎందుకు ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతోందో తెలుసుకుందాం.

ఇద్దరు నాలుగు సార్లు నుంచి…..

ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌య్యావుల కేశ‌వ్ కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, వైసీపీకి ఇక్కడ విశ్వేశ్వర‌రెడ్డి కీల‌క నాయ‌కుడిగా ఉన్నారు. ఈయ‌న 2014లో గెలిచారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే, స్వల్ప మెజారిటీతో ఓడిపోవ‌డంతో త‌న ఓట‌మికి గ‌ల కార‌ణాలను అన్వేషించిన విశ్వేశ్వర రెడ్డి ప‌య్యావుల‌ కేశవ్ కు క‌లిసి వ‌స్తున్న పాయింట్లను క‌నిపెట్టారు. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ వీరిద్దరే అక్కడ ప్రత్యర్థులుగా పోటీ ప‌డుతున్నారు. ఈ నాలుగు సార్లలో మూడు సార్లు కేశ‌వ్ గెలిస్తే.. ఓ సారి విశ్వేశ్వర్ రెడ్డి విజ‌యం సాధించారు.

సొంత పంచాయతీలో…..

ఇక ప‌య్యావుల కేశవ్ గెలుపులో ప్లస్ పాయింట్లు ఏంటో క‌నిపెట్టిన విశ్వేశ్వర్‌రెడ్డి వాటిని దెబ్బతీయ‌డం ద్వారా ప‌య్యావుల‌కు చెక్ పెట్టొచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప‌య్యావుల కేశవ్ సొంత పంచాయ‌తీ కౌకుంట్ల ఆయ‌న‌కు ఎప్పటి నుంచో అండ‌గా నిలుస్తోంది. ఈ పంచాయ‌తీ ప‌రిధిలోని గ్రామాల్లో మొత్తం 7500 ఓట్లు ఉన్నాయి. ఇవ‌న్నీ గుండుగుత్తుగా ఆయ‌న‌కే ప‌డుతున్నారు. దీంతో ఇక్కడ ప‌య్యావుల‌ కేశవ్ కు స‌హ‌జంగానే అనుకూల ఓట్లు ఉన్నాయి.

పంచాయతీని విడగొట్టేందుకు…..

మొన్న ఎన్నిక‌ల్లో ఇక్కడ 90 శాతం ఓట్లు టీడీపీకే ప‌డ్డాయి. అందుకే ప‌య్యావుల కేశవ్ కేవ‌లం 2 వేల ఓట్లతో గ‌ట్టెక్కారు. దీనిని గ‌మ‌నించిన విశ్వేశ్వర‌రెడ్డి ఈ పంచాయ‌తీని విడ‌గొట్టడం ద్వారా ప‌య్యావుల‌ కేశవ్ ను నైతికంగా దెబ్బ‌కొట్టాల‌ని, అప్పుడు ఓట్లు చీలి త‌ను ల‌బ్ది పొందేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నదే త‌డ‌వుగా కార్యాచ‌ర‌ణ‌కు కూడా దిగిపోయారు. కౌకుంట్ల విభజనపై పంచాయతి కార్యాలయంలో గతంలో గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే కేశవ్ గ్రామ సభకు హాజరై ఈ కార్యక్రమంలో మెజార్టీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని చెప్పారు. అప్పట్లో గ్రామ సభ తీర్మానాన్ని స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

విడిపోతే కష్టమేనా?

ఈ విషయంపై కోర్టులో కేసు వేశారు. గ్రామసభలోనూ రెండుపార్టీలు ఎవరికి వారు విడిపోయి ఆధిపత్యం ప్రదర్శించారు. పంచాయతిలోని ఐదుగ్రామాలు ఉమ్మడిగా ఉండాలని ఎట్టి పరిస్థితిలో విడిపోకూడదని టీడీపీ నేతలు కార్యకర్తలు బలప్రదర్శన నిర్వహించారు. విభజనకు అనుకూలంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు మద్దతు తెలిపారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్రస్థాయిలో ర‌గ‌డ చొటు చేసుకునే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఇక్కడ పోలీసులు ప‌హారా కాస్తున్నారు. మ‌రి విశ్వేశ్వర్ రెడ్డి అనుకున్నట్టుగా పంచాయ‌తీ చీలిపోతుందా ? వైసీపీ వ్యూహం పారుతుందా లేదా ? పయ్యావుల కేశవ్ కు చెక్ పెడతారా? అన్నది చూడాలి.

Tags:    

Similar News