అయినా మారలేదే…!!

నేలకు కొట్టిన బంతిలా వచ్చే ఎన్నికల్లో పైకి లేవాలి. ఓటమి చెప్పిన పాఠం నుంచి అంతా నేర్చుకోవాలి. పవన్ కల్యాణ్ ఒక్కడే పార్టీ భారాన్ని మోస్తారనే భావన [more]

Update: 2019-08-06 09:30 GMT

నేలకు కొట్టిన బంతిలా వచ్చే ఎన్నికల్లో పైకి లేవాలి. ఓటమి చెప్పిన పాఠం నుంచి అంతా నేర్చుకోవాలి. పవన్ కల్యాణ్ ఒక్కడే పార్టీ భారాన్ని మోస్తారనే భావన నుంచి క్యాడర్ బయటపడి ప్రజల్లో కదలాలి. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన అధినేతపై ప్రశ్నలు సొంత పార్టీ వారు వేయకుండా నాయకుడిని గుడ్డిగా నమ్మి ముందుకు పోయేలా తమ వ్యవస్థను నిర్మించుకోవాలి. అందుకు అవసరమైన కౌన్సిలింగ్ కోచింగ్ ను ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదలెట్టారు. గతంలో మాదిరి కాకుండా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గోదావరి వరదలలో ఆపన్నులను ఆదుకునేందుకు జనసైనికులు కదలాలని పిలుపు నివ్వడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ జోరు ఎన్ని రోజులు ఉంటుంది లే అనే పెదవి విరుపు విమర్శకుల నుంచి అప్పుడే మొదలైపోయింది.

టార్గెట్ అందుకోవాలి అందుకే ….

ఎన్నికల్లో ఓటమికి గురైన నియోజకవర్గాల వారితో పార్లమెంటరీ పరిధిలో పిలిచి సమీక్షలు నిర్వహిస్తూ దిశా దశా నిర్దేశించే పనిలో బిజీగా వున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఒక నేత జనసేనాని పై క్యాడర్ లో వున్న అసంతృప్తిని నేరుగా ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ తన కోటరీని వీడి ప్రజాక్షేత్రంలో నిత్యం ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అయితే దీనికి పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చి క్యాడర్ కి షాక్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉంటారని, వైఎస్ జగన్ పై కేసులు లేకపోతే ఆయన కూడా జనంలో ఉండేవారు కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ముందు నేతలు, పార్టీ అభిమానులు ప్రజల్లో ఉంటే గెలుపు సాధ్యమని నిర్వచించారు. ప్రచారానికి సమయం సరిపోక కూడా ఓడిపోయామని అన్నారు. గ్రూప్ లుగా పార్టీలో కొందరు సాగించిన నిర్వాకం కొంప ముంచాయన్నారు. తానూ జనంలో తిరిగితే తనను అభిమానులు నలిపి పారేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కడే పార్టీ కాదని అందరికోసం పార్టీ పెట్టానని తనకోసం కాదని గుర్తు పెట్టుకుని 2024 ఎన్నికలే టార్గెట్ గా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పుకొచ్చారు. చచ్చినా బిజెపి లో పార్టీని విలీనం చేసే ప్రసక్తి లేదని క్యాడర్ కి పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడం కొసమెరుపు.

పవన్ వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం ….

ఓటమి విశ్లేషణలు, జనసేన భవిష్యత్తు అడుగులపై ఇటీవల పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్, వైఎస్, చిరంజీవి వంటి వారంతా ప్రజల్లో చరిష్మా వున్నవారేనని వారు ఎలా ప్రజాక్షేత్రంలో ఉండేవారో పవన్ కల్యాణ్ మరిచిపోతే ఎలా అన్నది విమర్శకుల వాదన. ఎన్టీఆర్, చిరంజీవి వంటివారు ప్రజల్లో తిరగడానికి లేని ఇబ్బంది పవన్ కల్యాణ్ కి మాత్రమే ఉండటం విచిత్రమని, దీనిని బట్టి ఆయన ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్ళేది తక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు విపక్షంలో …

2004 నుంచి 2014 వరకు అధికారంలో లేని చంద్రబాబు ప్రజాక్షేత్రంలో అనేక పోరాటాలు చేశారు. ప్రతి అంశంలోనూ ఆయన ప్రజల్లోకి దూసుకుపోయి వారికి అండగా వున్నా అనే భరోసా కల్పించేవారు. చివరికి బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర పోలీసులతో ఆరుపదుల వయసు దాటినా దెబ్బలు తినేందుకు సిద్ధం అయ్యారు. అనేక సార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తూ అధికారపక్షాన్ని అల్లాడించేవారు. లోకేష్ నిత్యం జనంలో లేకపోయినా 2014 ఎన్నికల ముందు చంద్రబాబు సైతం ప్రజల్లో తిరుగుతూ పాదయాత్ర చేయడం ద్వారా అధికారంలోకి వచ్చారని మరి ఆయనపై ఏ కేసులు ఉన్నాయని ప్రజల్లో తిరిగారని ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఉంటే పార్టీకి ఇబ్బందే ….

పవన్ కల్యాణ్ వైఖరిలో ఇప్పటికి టిడిపి అనుకూల వైసిపి వ్యతిరేక ధోరణి స్పష్టం అవుతుందని అంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం ప్రజలు అది నమ్మడం వల్లే జనసేనను నమ్మలేదని ఇప్పుడు అదే పరిస్థితి కొని తెచ్చుకునేలాగా ఆయన వ్యాఖ్యలు జనసేన కొంప ముంచేలాగే ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు. విపక్షాన్ని ఎక్కువగా, అధికారపక్షాన్ని తక్కువగా అప్పుడు ఇప్పుడు మరోలా వున్న ఆయన ధోరణి వల్ల లాభం కన్నా నష్టమే తెచ్చిపెడుతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ రూట్ మార్చుకోవాలని నిత్యం ప్రజలతో మమేకం అయితేనే భవిష్యత్తులో ఆయన కల నెరవేరే మార్గం ఏర్పడుతుందని హితబోధ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News