బాబు బుట్టలో పడటం లేదటగా…!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడిపోయారా? ఆయన తమతో కలసి వస్తున్నారన్న సంకేతాలను ఇప్పటికే ప్రజల్లోకి బలంగా పంపగలిగింది తెలుగుదేశంపార్టీ. జనసేన [more]

Update: 2019-01-24 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడిపోయారా? ఆయన తమతో కలసి వస్తున్నారన్న సంకేతాలను ఇప్పటికే ప్రజల్లోకి బలంగా పంపగలిగింది తెలుగుదేశంపార్టీ. జనసేన నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడు కలసి ప్రయాణం చేస్తారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా జరుగుతోంది. అయితే జనసేనానికి అతి దగ్గరగా ఉండే నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. పవన్ తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదని వారంటున్నారు. పవన్ మరోసారి టీడీపీతో కలసి తప్పు చేయరని గట్టిగా చెబుతున్నారు.

ఒంటరిగానే పోటీ చేయాలని….

ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పవన్ తో చర్చలు జరిపినప్పుడు ఆయన స్పష్టంగా ఈవిషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆకుల సత్యనారాయణ రాజమండ్రి ఎంపీ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్ చంద్రబాబుతో కలిస్తే తాను జనసేనలో చేరినా ఎంపీటిక్కెట్ దక్కదు.అందుకోసమే ఆకుల సత్యనారాయణ పార్టీలో చేరేముందు పవన్ నుంచి ఈ క్లారిటీ తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కేవలం వామపక్షాలతో కలసి మాత్రమే పోటీ చేస్తారని, టీడీపీతో చేతులు కలపరని ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.

బాబు ప్రయత్నాలు….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ తమతో కలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. పవన్ తన వెంట ఉంటే ఏపీలో బలమైన సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. కాపులకు ప్రత్యేకంగా అగ్రవర్ణాల రిజర్వేషన్లలోనుంచి ఐదు శాతం కేటాయించడం కూడా పవన్ ను మంచి చేసుకోవడంలో భాగమేనన్న టాక్ ఆ పార్టీలోనే విన్పిస్తోంది. పవన్ తనకు అండగా ఉంటే ఖచ్చితంగా విజయతీరాలకు చేరతామని భావిస్తున్న చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

పార్టీని బలోపేతం చేసేందుకే….

అయితే పవన్ మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా ఇష్టపడటం లేదని చెబుతున్నారు. తన టార్గెట్ 2024 అని, అప్పటి వరకూ తాను పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెడతానని పవన్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీతో కలిసినా 25 నుంచి 30 సీట్లకు మించి ఇవ్వరని, అలా వెళితే పార్టీ ఎన్నటికీ రాష్ట్రంలో బలోపేతం కాదని ఆయన భావిస్తున్నారు. అందుకోసం వామపక్షాలతో కలిసే నడవాలని పవన్ దాదాపు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు త్వరలోనే వామపక్ష నేతలతో సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించి టీడీపీకి పవన్ తగు రీతిలో సమాధానం ఇవ్వాలనిచూస్తున్నారని జనసేన ముఖ్యనేత ఒకరు తెలుగుపోస్ట్ కు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు వేసిన వలలో పవన్ పడడన్నది ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News