పవన్ అనే నేను.....!

Update: 2018-10-17 15:30 GMT

నాయకుడంటే ఆశలవారధి. ఒక నమ్మకాన్ని కలిగించాలి. విశ్వాసాన్ని పెంపొందించాలి. ఓటమి చివరి క్షణం వరకూ నెగ్గుతామనే భరోసాతోనే యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాలి. అప్పుడే క్యాడర్ అతనివెంట నిలుస్తుంది. ప్రజలు ఓట్లు వేస్తారు. మళ్లీ మళ్లీ ఎన్నికల సాగరాన్ని ఈదడానికి అవసరమైన స్థైర్యం సమకూరుతుంది. ముందుగా చేతులెత్తేస్తే రావాల్సిన ఓట్లు కూడా రావు. బలమైన పార్టీ సైతం తనంతతాను బలహీనపడిపోతుంది. అంకెల లెక్కలే కాదు, రాజకీయమంటే మానసిక క్రీడావిన్యాసం కూడా. నాయకులకు ఈ నిజం తెలుసు. అందుకే డిపాజిట్లు రావని తెలిసిన చోట్ల సైతం తామే గెలుస్తున్నామంటారు. ప్రత్యర్థులు నవ్వుకోవచ్చు. ప్రజలు నివ్వెరపోవచ్చు. కానీ క్యాడర్ కలిసికట్టుగా ఉంటుంది. నాయకుడే బేజారెత్తిపోతే శ్రేణులు జావగారిపోతాయి. అన్ని పార్టీలకు , అందరు నాయకులకు తెలిసిన సత్యమిది. జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేశ పరుడే కాదు. వాస్తవిక వాది. గ్రౌండ్ లెవెల్ లో సర్వేలు చేయించుకున్న తర్వాత పార్టీ ఆశించిన స్థాయిలో గెలుపు సాధించలేదని గుర్తించారు. కింగ్ మేకర్ పాత్ర తమదేనని ప్రకటించారు. ఇది వికటిస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో తాజాగా తన వైఖరిని సరిదిద్దుకున్నారు.తమదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు తనను ముఖ్యమంత్రిగా సంబోధించమంటూ క్యాడర్ ను కోరుతూ వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ యూటర్న్ లో ఎన్నో రాజకీయ కోణాలు దాగి ఉన్నాయి. జనసేన కు మరింత ఊపు తెచ్చే యత్నాలకు పవన్ శ్రీకారం చుడుతున్నారు.

యూ టర్న్ లో...

జనసేనాని తన పంథాను మార్చుకుని ముఖ్యమంత్రి రేసులో తానుసైతం ఉన్నానని చాటిచెప్పడంలో వ్యూహం దాగి ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీకి సహకరించిన పవన్ 2019లో వైసీపీకి సహకరించబోతున్నారనే ప్రచారం బాగా సాగింది. వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఈమేరకు చర్చలు జరిపినట్లు సమాచారం వెల్లడైంది. పైపెచ్చు స్వయంగా తానే అనేక సందర్బాల్లో జగన్ తో తనకు వ్యక్తిగతంగా వైరం లేదని వెల్లడించారు. లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ద్వారా టీడీపీతో ఇక కలిసి నడిచేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. అప్పుడే వైసీపీ జాగ్రత్తగా పావులు కదపడం ప్రారంభించింది. పవన్ తో లోపాయికారీగా అవగాహన కుదుర్చుకునే యత్నం చేసింది. ఒక దశలో ఈమేరకు మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ పక్కా ఎత్తుగడతో ఈ రెండు పార్టీలను ఒకే గాటన కట్టేందుకు సమర్థవాదనను తెరపైకి తెచ్చింది. రెండు పార్టీలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఏ రకమైన సంకేతాలు పంపినా జనసేన, వైసీపీ దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు పార్టీలూ దూరం జరగాల్సిన రాజకీయ అనివార్యత నెలకొంది. ఆ సమయంలోనే జగన్ జనసేనాధిపతి పవన్ వ్యక్తిగత జీవితంపై ధ్వజమెత్తారు. దీంతో కొంతమేరకు వైషమ్యాలు ఏర్పడ్డాయి. మళ్లీ మధ్యవర్తులు రంగప్రవేశం చేసి ఈ విభేదాలు తీవ్రతరం కాకుండా బ్యాలెన్సు చేసే ప్రయత్నాలు చేశారు. మధ్యలో మళ్లీ బీజేపీ పెద్దలూ సర్దుబాటు వ్యవహారం నడిపినట్లు సమాచారం. ఇరుపక్షాలు విభేదాల డోసును తగ్గించాయి. అయినా పవన్ చేసే ప్రకటనల కారణంగా జనసేన పట్ల సాధారణ ప్రజానీకంలో నమ్మకం పెరగడం లేదు. దీనినుంచి బయటపడి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవాలంటే క్యాడర్ కు, ప్రజలకు ఒక గట్టి సందేశం ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు.

కవాతులో గట్టి సంకేతమే...

నేనే ముఖ్యమంత్రిని. నాకు అన్ని అర్హతలున్నాయి. రాజకీయ నాయకుడి కొడుకే వారసునిగా సీఎం కావాలా? కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? అంటూ పవన్ సూటిగా ప్రశ్నించడం మంచి పరిణామమే. అధికారపదవులు, సీఎం పీఠాలు తమ హక్కుభుక్తాలుగా భావిస్తున్న వారికి గట్టి హెచ్చరిక. ప్రజాదరణ కలిగిన సినీ రాజకీయవేత్త గా పవన్ ఈ ప్రశ్నలు సంధించడంతో చర్చకు దారితీస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లలో సీఎం కుమారులే మళ్లీ సీఎం అవుతారన్న నమ్మకం ప్రజల్లో సైతం పాతుకుపోయింది. కేటీఆర్, లోకేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రుల పుత్రరత్నాలుగా హవా చెలాయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రిని తానే అని ప్రకటించుకుని మరీ పాదయాత్ర చేస్తున్నారు మాజీసీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్. ప్రజలు కూడా వీరి కే ఫిక్స్ అయిపోయారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే వారసులకంటే పవన్ సామాజిక వర్గమే జనాభాసంఖ్యలో అధికం. అయినా అధికారం అందని ద్రాక్షగానే ఆ సామాజికవర్గాన్ని ఊరిస్తూ వచ్చింది. 2009లో మెగాస్టార్ చిరంజీవి ద్వారా తమ కల నెరవేరుతుందని భావించారు. కానీ ఆశలు తలకిందులయ్యాయి. జనసేన తో తమ ఆశలు చిగురిస్తాయనుకున్నారు. కానీ మొదట్నుంచీ రాజకీయం తనకు అధికారం కోసం కాదంటూ చెబుతూ రావడం ఆ సామాజిక వర్గానికి రుచించలేదు. దాంతో ఉభయగోదావరి జిల్లాల్లో సైతం ఆ పార్టీకి గట్టి పట్టు దొరకడం లేదు. దీనిని గ్రహించి తానే సీఎం అవుతానంటూ తాజాగా పవన్ ప్రకటించారు. ఇది అటు టీడీపీకి, ఇటు వైసీపీకి గట్టి సంకేతమే పంపినట్లుగా చెప్పుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News