పాచిక పారిందే….!!

పవన్ కల్యాణ్ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు గుంభనంగా, గంభీరంగా ఉన్నారు. పక్కపార్టీల్లో మాత్రం ముసలం పుట్టింది. నిన్నామొన్నటివరకూ [more]

Update: 2019-01-03 15:30 GMT

పవన్ కల్యాణ్ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు గుంభనంగా, గంభీరంగా ఉన్నారు. పక్కపార్టీల్లో మాత్రం ముసలం పుట్టింది. నిన్నామొన్నటివరకూ జగన్, పవన్ , మోడీ, కేసీఆర్ లను ఒకే గాటన కట్టిన నాయుడుగారు తాజాగా పవన్ ను ఆ జాబితా నుంచి తీసేశారు. తెలుగు దేశానికి సహకరించాలని ఫీలర్లు పంపుతున్నారు. పవన్ , తాను కలిసి పనిచేస్తే మీకేంటి ఇబ్బంది? అంటూ జగన్ ను ప్రశ్నించారు. తమ అధినేత అంతుచిక్కని వ్యూహాలు పన్నుతారని తెలిసిన టీడీపీ క్యాడర్ కు పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ బాబు తాజా సంకేతాలపై ప్రతిపక్షాల్లో అలజడి పుట్టింది. సొంతంగా ఎదగాలనుకుంటున్న జనసేన అయోమయంలో పడిపోయింది. దొరికిందే సందు అని వైసీపీ అదిగో ముసుగు తీసేశారు. జనసేన, టీడీపీ ఒకటే అంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తెలుగుదేశం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్న కాంగ్రెసు కలలు కల్లలవుతాయేమోనని కంగారు పడుతోంది. ఆంధ్రాముఖ్యమంత్రి వరుసగా రెండు రోజులపాటు వదిలిన పొలిటికల్ ఫీలర్లు మొత్తానికి రాజకీయ ముఖచిత్రంలో గందరగోళానికి కారణమవుతున్నాయి.

జగన్ తో జగడం…

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రధాన ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డి. పవన్ వంటివారు రంగంలో ఉన్నప్పటికీ సీఎం పీఠానికి ప్రధాన పోటీదారు కాదు. 2014లో సైతం జగన్ ,తాను ముఖాముఖి తలపడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. సొంతబలం సరిపోని స్థితిలో నరేంద్రమోడీ కరిష్మా, పవన్ గ్లామర్ లను టీడీపీకి అండగా తెచ్చుకోగలిగారు. వైసీపీ, టీడీపీల ద్విముఖ పోరులో సీనియార్టీ, రాష్ట్ర విభజన అవసరాల కోణంలో ప్రజలనుంచి గెలుపు సర్టిఫికెట్ తెచ్చుకున్నారు . ప్రస్తుతం అటువంటి రాజకీయ వాతావరణం లేదు. గతంలో టీడీపీకి కుడిఎడమలుగా నిలిచిన పవన్, మోడీలు తమ సొంతపార్టీలతో టీడీపీకి ప్రత్యర్థులుగా నిలుస్తున్నారు. వీరి పోటీని పెద్ద సీరియస్ గా చూడకపోయినప్పటికీ ఓట్ల చీలిక పెద్ద ఎత్తున సాగుతుంది. మరోవైపు ప్రత్యర్థి జగన్ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. కొన్ని అద్భుతమైన అవకాశాలను మిస్ చేసుకుంటున్నప్పటికీ ప్రజాదరణలో దీటుగానే నిలుస్తున్నారు. అసెంబ్లీ వంటి వేదికలను ప్రభుత్వంపై పోరాటానికి వినియోగించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఉండటం జగన్ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డితోనూ ఇప్పుడు అతని కుమారుడు జగన్ తోనూ రాజకీయ పోరాటం సాగిస్తున్నారు చంద్రబాబు. నిజానికి వైఎస్ బతికున్నప్పట్నుంచే జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది తెలుగుదేశం.

కన్విన్స్ .. కన్ఫ్యూజ్…

పవన్ కల్యాణ్ చంద్రబాబుతో విడిపోయిన తర్వాత నేరుగా లోకేశ్ ను టార్గెట్ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచీ నిధులు దండుకుంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వాదనతో వైసీపీ ఒకేగాటన కట్టేస్తూ వచ్చేది. దీంతో టీడీపీ ప్రభావంలో ఉన్నంతకాలం జనసేన ఎదగడం కష్టమనే అంశాన్ని పవన్ గ్రహించారు. అయితే నాలుగేళ్లు కలిసి నడిచిన తర్వాత ఒక్కసారిగా దూరమయ్యామంటే ఎవరూ నమ్మరు. తాను విమర్శలు చేస్తుంటే టీడీపీ చాలా ఆచితూచి స్పందిస్తుండేది. దీనివల్ల లోపాయికారీ అవగాహన ఉందనే అనుమానాలు తలెత్తుతుండేవి. అందుకే లోకేశ్ ను, అవినీతిని కలిపి ఆరోపణలు చేస్తే టీడీపీ దూరమవుతుందని యోచించి తీవ్రంగా ధ్వజమెత్తడం ప్రారంభించారు. ఆ ప్లాన్ వర్కవుట్ అయినట్లే చెప్పాలి. టీడీపీ నాయకులు సైతం పవన్ పై విమర్శల స్వరం పెంచారు. రెండు పార్టీలు విడివిడిగా తలపడతాయనే బలమైన భావన రాజకీయవర్గాల్లో స్థిరపడింది. ఇప్పుడు చంద్రబాబు స్వరం మార్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవన్ కల్యాణ్ కలిసి రావడం తోనే 25 నియోజకవర్గాల్లో 2014 లో ఎన్నికల్లో కలిసొచ్చిందనేది అంచనా. రానున్న ఎన్నికల్లో సైతం పవన్ తో కలిసేందుకు చంద్రబాబుకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ జనసేన కలిసిరావడం లేదు. కన్విన్స్ చేయలేకపోతున్నారు. దీంతో రాజకీయంగా కన్ఫ్యూజ్ చేశారు. జనసేననను నామమాత్రం చేసేశారు. వైసీపీతో ముఖాముఖి తలపడే వాతావరణాన్ని సృష్టించుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు.

ఫలించిన వ్యూహం…

చంద్రబాబు నాయుడు స్రుష్టించిన అయోమయం నుంచి బయటపడటానికి జనసేనకు రెండు రోజుల సమయం పట్టింది. జనసేనతో కలసివెళితే తప్పేమిటి? పవన్ సహకరించాలి. బీజేపీతో పోరాటానికి తనతో చేతులు కలపాలంటూ టీడీపీ అధినేత సంకేతాలు ఇవ్వడం పై తొలుత పవన్ అయోమయానికి గురయ్యారు. ఏరకంగా స్పందించాలన్న విషయం అర్థం కాలేదు. ఈలోపు పార్టీకి జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. టీడీపీ, జనసేన రెండూ ఒకటే అని ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. నిజానికి వైసీపీ, జనసేన ను ఒక దారిలోకి తీసుకొచ్చి ఒప్పందం కుదర్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయి. వీటి రెంటినీ దూరం చేయకపోతే భవిష్యత్తులో టీడీపీకి ఇక్కట్లు తప్పవు. అందువల్లనే జనసేన టీడీపీకి సన్నిహితమవుతోందన్న ఫీలర్లు వదిలారు. దీంతో అసలు విషయం గ్రహించడం సాధ్యంకాని వైసీపీ గట్టిగా ప్రతిస్పందించింది. కౌంటర్ ఇవ్వకతప్పని స్థితిలో అటు టీడీపీతో, ఇటు వైసీపీతో కలిసివెళ్లే అవకాశం లేదని జనసేన స్పష్టం చేసింది. ఈ రగడకు కారణమైన టీడీపీ, వైసీపీలపై పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు అంతంతమాత్రమే. ఇప్పుడు వైసీపీకీ దారులు మూసేశారు. వామపక్షాలతో మాత్రమే తాము కలిసి వెళతామని గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఈరకంగా చంద్రబాబు ప్లాన్ ఫలించినట్లే చెప్పుకోవాలి.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News