వారెవ్వా...సీఎం అంటే మీరే....!

Update: 2018-08-29 18:29 GMT

పవన్ కుమార్ చామ్లింగ్..... ఈ పేరు చాలామందికి తెలియక పోవచ్చు. ఇందులో వింతేమీ లేదు. నిజానికి తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలియకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాని ఆయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ గురించి తెలుసుకుని తీరాలి. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన బాటలో పయనించాల్సిన అవసరం ఉంది. ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని చెప్పడం అతిశయోక్తి కానే కాదన్నది అక్షర సత్యం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులు చామ్లింగ్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

చిన్న రాష్ట్రంలో.....

సిక్కిం చాలా చిన్న రాష్ట్రం. అక్కడి ఎమ్మెల్యేలు మొత్తం 32 మందే. ఇంతకన్నా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం పుదుచ్చేరి. ఆ తర్వాత 40 మంది ఎమ్మెల్యేలతో గోవా మూడో స్థానంలో ఉంది. సిక్కిం ఈశాన్య భారతానికి ముఖద్వారంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ తర్వాత సిక్కిం మీదుగా ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సోంలో అడుగుపెట్టాలి. ఇంతకూ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్రత్యేకత ఏంటంటే.... 1994 నుంచి ఇప్పటి వరకూ అంటే 24 సంవత్సరాల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు రికార్డు అధిగమించడం. జ్యోతిబసు 1977 నుంచి ఏకధాటిగా 2000 వరకూ 23 సంవత్సారాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఛామ్లింగ్ ఇప్పుడు అధిగమించారు. 1994, 1999,2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన చామ్లింగ్ అయిదు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భారత రాజకీయ చరిత్రలో కచ్చితంగా ఇదో రికార్డు అని చెప్పకతప్పదు.

సొంత పార్టీని పెట్టి.....

దక్షిణ సిక్కింలో 1950 సెప్టెంబరు 22న జన్మించారు చామ్లింగ్. 1982లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు. రెండోసారి ఎన్నికైన అనంతరం మంత్రి పదవిని చేట్టారు. నరబహదూర్ భండారీ మంత్రివర్గంలో 1992 వరకూ పనిచేశారు. కీలకమైన పరిశ్రమలు, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రిగా సేవలు అందించారు. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించారు. రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలను అధిగమించిన చామ్లింగ్ చివరకు సొంత పార్టీని ప్రారంభించారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో 1993 మార్చి 3 సొంత పార్టీని ప్రారంభించి ముఖ్యమంత్రి పదవి సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ విజయపతాకాన్ని ఎగురవేసింది. అది మొదలు నేటి వరకూ ఆయనకు తిరుగులేదు. మున్ముందు కూడా తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వరుసగా ఐదు సార్లు.....

వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం, అవినీతి రహిత పాలన అందించడం ద్వారా సిక్కిం ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పవన్ కుమార్ చామ్లింగ్. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం32 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించడంతో వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014 మే 21న గవర్నర్ శ్రీనివాస దాదా సాహెబ్ పాటిల్ ఆయన చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. 2014 ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గాను 22 స్థానాలను సాధించి ప్రజల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. 18 నెలల తర్వాత ఏడుగురు విపక్ష ఎమ్మెల్యేలు చామ్లింగ్ పార్టీలో చేరడంతో బలం 29కి పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షమైన సిక్కిం క్రాంతికారి పార్టీ పది స్థానాలు సాధించగా దానికి ప్రస్తుతం ముగ్గురే మిగిలారు. రాష్ట్రంలోని ఏకైక లోక్ సభ, రాజ్యసభ స్థానాన్ని కూడా చామ్లింగ్ పార్టీనే గెలుచుకుంది. 2019 లోక్ సభ ఎన్నికలతో పాటు సిక్కిం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు తగిన ఏర్పాట్లలో పార్టీ ఉంది. ఈసారి కూడా చామ్లింగ్ విజయంపై ధీమాతో ఉన్నారు. ప్రతిపక్షమైన సిక్కిం క్రాంతికార్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ చామ్లింగ్ ను దెబ్బతీసే పరిస్థితుల్లో లేదు.

ఆరుగురు ప్రధానులతో...

నేపాల్, భూటాన్, చైనా తదితర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన చిన్న రాష్ట్రం సిక్కిం ప్రశాంతతకు మారు పేరులాంటిది. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నప్పటికీ దాని ప్రభావం లేదు. పూర్తి పర్యావరణ రాష్ట్రంగా పేరొందింది. ప్లాస్టిక్ ను నిషేధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం రికార్డులకెక్కింది. పీవీ నరసింహరావు నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ ఆరుగురు ప్రధానులతో కలసి పనిచేసిన అనుభవం చామ్లింగ్ కు ఉంది. పీవీ, దేవేగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్ పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీ లతో చామ్లింగ్ సమన్వయంగా వ్యవహరించారు. ఎవరు ప్రధాని అన్నది తనకు ముఖ్యం కాదని, రాష్ట్రాభివృద్ధే తనకు ముఖ్యమని తరచూ పేర్కొనే చామ్లింగ్ వచ్చే ఏడాది కూడా విజయం సాధించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News