రా…రా…బంగారం….!!

పవన్ కళ్యాణ్ చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలిగినవారుగా పేరు. ఆయనది పాతికేళ్ల సినీ జీవితం, పాతిక సినిమాల ప్రాభవం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్లు, సూపర్ హిట్లు, [more]

Update: 2019-07-25 09:30 GMT

పవన్ కళ్యాణ్ చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలిగినవారుగా పేరు. ఆయనది పాతికేళ్ల సినీ జీవితం, పాతిక సినిమాల ప్రాభవం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్లు, సూపర్ హిట్లు, ఏవరేజ్ సినిమాలు తీసేస్తే ఫ్లాపులు కూడా ఎక్కువే. పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డమ్ అ కి వరసగా సినిమాలు చేసుకుంటూ పోతే బాగానే ఉండేది కానీ ఆయన నెమ్మదిగానే సినిమాలు చేశాడు. కరెక్ట్ గా పాతికతో ముగించాడు. 2019 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ గట్టి ఆశలే పెట్టుకున్నాడనుకోవాలి. అందువల్లనే మళ్ళీ ముఖానికి రంగు పూసుకోను అంటూ భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్ వూహించిన రాజకీయ వాతావరణం ఆయన టీడీపీని వీడి ఘాటు విమర్శలు చేసిన కొత్తల్లో ఉండేది. అప్పట్లో జగన్ మానియా ఇంతలా లేదు, మరో వైపు చంద్రబాబు బీజేపీ కాంబినేషన్ తో టీడీపీ బలంగా కనిపించేది. దాంతో ఇలాంటి సమయంలో మూడవ పార్టీగా దిగితే బాగా ఓట్లు, సీట్లు చీల్చవచ్చునన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలు 2018 ఆరంభం వరకూ కరెక్ట్.

సీన్ మరడానికి కారణం….

అలాంటి రాజకీయ వాతావరణం మారిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమనుకోవాలి. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన సవాల్ ని వైసీపీ స్వీకరించడం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీ అవడం, అధికారంలో ఉన్న టీడీపీపై వత్తిడి పెరగడం, చివరికి టీడీపీ బీజేపీకి రాం రాం చెప్పి వైసీపీ రూట్లోకే వచ్చి అవిశ్వాసం పెట్టడం ఇది చరిత్ర. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ బీజేపీకి దూరంగా జరిగి ధర్మ పోరాట దీక్షల పేరు మీద మోడీని తిడుతూ పోవడం జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన టీడీపీ వ్యతిరేక స్టాండ్ ని మార్చుకున్నారన్న ఆరోపణలకు ఆయనే కారణం. తన బలమైన వాణిని టీడీపీకి వ్యతిరేకంగా వినిపించకపోవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీ ఒక్కటి అన్నది వైసీపీ ప్రచారం అయింది. చివరికి టీడీపీ దారుణంగా బలహీనపడి ఘోరంగా ఓడిపోతే జనసేన సైతం అదే బాటలో నడిచింది.

మళ్ళీ ముఖానికి రంగు…..

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తాను ముఖానికి రంగు వేసుకుంటే అది అవమానమేమోనని భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అయితే సినిమా పరిశ్రమను వీడి వెళ్తునపుడు ఏకంగా సినీ ప్రముఖులందరినీ పిలిచి గ్రాండ్ గా వీడ్కోలు పార్టీయే ఇచ్చారు. తన జీవితం ఇక ప్రజలకే అంకితమని కూడా చెప్పారు. నాడు చిరంజీవి ధైర్యం కూడా అదే. ముఖ్యమంత్రి అయిపోతానన్న నమ్మకంతో ఆయన సినిమా రంగాన్ని అలా వదిలేశారు. అయితే తొందరలోనే తత్వం బోధపడిన చిరంజీవి మళ్ళీ ముఖానికి రంగు వేసుకోవడానికి పదేళ్ళు పట్టింది.

పవన్ ని రమ్మంటున్నారుగా….

ఇక పవన్ కళ్యాణ్ సైతం మేకప్ వేసుకుని నటించడంతో తప్పులేదని సినీ ప్రముఖుడు పరుచూరి గోపాలక్రిష్ణ లాంటి వారు అంటున్నారు. తమిళనాడు దివంగత నేత ఎంజీ రామచంద్రన్ ని ఆయన ఇందుకు ఉదహరించారు. ఆ మాటకు వస్తే అన్న నందమూరి కూడా 1989లో ఓడిపోయినపుడు చాలా సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ మార్గాన నడవడం తప్పు ఏమీ కాదు, పేరుకు పేరు, డబ్బు అన్నీ వస్తాయి. ఆ వచ్చిన మొత్తంతో మళ్ళీ రాజకీయంగా బలంగా జనంలోకి వెళ్ళవచ్చు.

రంగు వేసుకుంటే…..

అయితే ఇక్కడే మరో చిక్కు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాడన్న విమర్శలు మొదలవుతాయి. దాంతో అంతంతమాత్రంగా ఉన్న జనసేన మరింత ఇబ్బందులు పడుతుంది. ఇదే ఇపుడు పవన్ కళ్యాణ్ ను సినిమాలకు దగ్గర కాకుండా ఆపుతున్నది. ఈ డైలమా నుంచి ఆయన బయటపడితేనే ముఖానికి రంగు పడేది. అయితే రెండు రంగాలను బ్యాలన్స్ చేసుకునే సత్తా తనకు ఉందని పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటే ఏ విమర్శలు కూడా ఆయన్ని ఏమీ చేయలేవని అనే వారూ ఉన్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ దారి ఎటు వైపో.

Tags:    

Similar News