జగన్ ఆ గీతను చెరిపేశారా?

Update: 2018-07-25 08:00 GMT

ప్రశ్నలు లేవనెత్తుతున్న పవన్. జనంలోకి దూసుకెళుతున్న జగన్ జుట్లు పట్టుకుంటున్నారు. తెలుగుదేశానికి దీటుగా తమ పార్టీలను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించాలనే ప్రయత్నంలో పరిధులు,పరిమితులు దాటిపోతున్నారు. రాజకీయ కొలబద్దలు కుచించుకుపోతున్నాయి. వ్యక్తిగత విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. అధికారపార్టీ టీడీపీకి అనవసరమైన స్కోప్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్, జగన్ లు నిన్నామొన్నటివరకూ హుందాగానే ఉన్నారు. తమ పార్టీలపైనే దృష్టిపెట్టి టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. హఠాత్తుగా గాలి మారింది. రెంటిలో ఒకటి బలమైన ప్రత్యామ్నాయంగా నిరూపించుకుంటే తప్ప ప్రజామద్దతు సంఘటితంగా కూడగట్టడం అసాధ్యమని వీరిరువురూ గ్రహించారు. దానికనుగుణంగా తమ కార్యాచరణను తీర్చిదిద్దుకుంటున్నారు. ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయ అనివార్యత వీరిరువురి మధ్య పోటాపోటీ వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలుగుదేశం శ్రేణులు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లుగా సంబరాలు చేసుకుంటున్నాయి.

జగడమే...

‘కార్లు మార్చినట్లు భార్యలను మార్చే వ్యక్తి నైతిక విలువల గురించి మాట్లాడమేమిటి? బహుభార్యత్వానికి అసలు జైలులో ఉండాలి. ’ అంటూ పవన్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇంతవరకూ అవినీతి, పరిపాలనపరమైన లోపాలు, విధానపరమైన అంశాల్లో విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు. వ్యక్తిగత విషయాల్లో పెద్ద నాయకులు కొంత సంయమనం పాటిస్తూ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో గీతలు చెరిపేశారు. పవన్, జగన్, బీజేపీ మూడూ కుమ్మక్కు అవుతున్నాయంటూ టీడీపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది. తెలుగుదేశాన్ని అటాక్ చేసినట్లుగా జగన్, పవన్ లు బీజేపీపై దాడి చేయకపోవడం ఇందుకు ఆస్కారం కల్పిస్తోంది. బీజేపీని పక్కనపెట్టినా వైసీపీ, జనసేనలు ఒక సమన్వయంతో వెళతాయనే భావన నెలకొంది. అవసరమైతే ఎన్నికల తర్వాత పొత్తులకూ అవకాశం ఉందనే భావన ఏర్పడింది. ఇది రెండు పార్టీలకు శ్రేయోదాయకం కాదు. దీంతో పవన్ దాడిని ఉద్ధృతం చేశాడు. వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోవడం, జగన్ నిరంతరం ముఖ్యమంత్రి పదవి తనకు కావాలంటూ జనంలో మాట్లాడుతూ ఉండటాన్ని టార్గెట్ చేశాడు. దీనిని తిప్పికొట్టే క్రమంలో భాగంగా జగన్ వ్యక్తిగత విషయాలపై నిందారోపణలు సాగించారు.

పోటాపోటీ...

సమర్థ పాలన, సంక్షేమం, కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అనే సూత్రాలతో అధికారపక్షమైన తెలుగుదేశం ప్రజా మద్దతు కోరుతోంది. జగన్, పవన్ లు వీటికి దీటైన ప్రత్యామ్నాయాన్ని చూపించగలగాలి. అందులోనూ ఏదో ఒక పార్టీ టీడీపీని బలంగా ఎదుర్కొనగలుగుతుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే తటస్థంగా ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంఘటిత పరుచుకోవడానికీ వీలవుతుంది. ఇందుకుగాను వైసీపీ, జనసేనలు పరస్పరం పోటీ పడాల్సిన వాతావరణం నెలకొంది. లేకపోతే ఈరెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక తెలుగుదేశాన్ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లిపోతుంది. టీడీపీకి తామే ప్రత్యామ్నాయమని ప్రజలు విశ్వసించే విధంగా చేయలేకపోతే ఓటర్లు గందరగోళానికి గురవుతారు. 2009లో చంద్రబాబు నేతృత్వంలోని మహాకూటమి, వైఎస్సార్ ఆధ్వర్యంలో కాంగ్రెసు తలపడినప్పుడు ప్రజారాజ్యం తననుతాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకోలేకపోయింది. ఫలితంగా మూడో స్థానంలో ఆగిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఈ రెండు పార్టీల్లో ఒకదానికి అనివార్యం. ఇంతవరకూ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం, వైసీపీ రెండూ ప్రధానంగా బరిలో ఉన్నాయి. తటస్థ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైసీపీ ఎక్కువగా ఆకర్షించగలుగుతుంది. ఇది జనసేనకు ఇబ్బందికరం. అందుకే టీడీపీతో పాటు వైసీపీ పైనా పవన్ విరుచుకుపడుతున్నారు.

టీడీపీ ఖుషీ...

వైసీపీ, జనసేన రోడ్డున పడే పరిస్థితి కనిపించడంతో ఎక్కువ సంతోషిస్తున్న పార్టీ తెలుగుదేశం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలకు సంఘటితంగా బలం ఉంది. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ప్రబలమైన శక్తిగా నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన మొదటి స్థానంలో ఉన్నట్లు అంచనా. తూర్పుగోదావరిజిల్లాలో టీడీపీ, జనసేన సమ ఉజ్జీలుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరాంధ్రపై జనసేన దృష్టి సారిస్తోంది. తమకు ఇప్పటికే ఆధిక్యత దక్కుతుందని భావిస్తున్న జిల్లాల్లో జనసేన, వైసీపీలు విడివిడిగా కాన్సంట్రేషన్ పెంచితే టీడీపి రాజకీయంగా నష్టపోతుంది. అదే పరస్పరం తలపడి అన్ని ప్రాంతాల్లోనూ ముఖాముఖి వాతావరణాన్నికల్పించుకోగలిగితే త్రిముఖ పోటీలో టీడీపికి ఎడ్జ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పవన్, జగన్ ల జగడాన్ని రాజకీయ అవకాశంగా ఆస్వాదిస్తోంది తెలుగుదేశం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News