పవన్ ను పక్కన పెడితేనే బెటరా?

ఎంత ప్రభావం చూపుతాడో తెలియదు కానీ ప్రతి దానికి పెద్ద సమస్యగా మారాడే? ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తెలంగాణ బీజేపీలోని కొందరి నేతల [more]

Update: 2021-04-15 11:00 GMT

ఎంత ప్రభావం చూపుతాడో తెలియదు కానీ ప్రతి దానికి పెద్ద సమస్యగా మారాడే? ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తెలంగాణ బీజేపీలోని కొందరి నేతల అభిప్రాయం. జాతీయ పార్టీ అన్న తర్వాత కొన్ని నిబంధనలుంటాయని వాటి ప్రకారమే వెళతామని, అన్ని చోట్ల ప్రొటోకాల్ అంటే కుదరదని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేయాలని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే, వచ్చే కొద్దోగొప్పో ఓట్లను ఎందుకు పోగొట్టుకోవడమని మరో వర్గం అభిప్రాయపడుతుంది.

పొత్తు లేకుండానే….?

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఉందా? అంటే దానికి సరైన సమాధానం రెండు పార్టీల నుంచి రాదు. ఒక వర్గం మాత్రం తమకు జనసేనతో తెలంగాణలో పొత్తే లేదని మాత్రం స్పష్టంగా చెబుతుంది. కేంద్ర నాయకత్వం సయితం తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతుంది. అయితే జనసేనానితో సయోధ్యతో వెళితే తప్పేంటన్నది మరొక వర్గం వాదన. ఇక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రెండు వర్గాలుగా పవన్ కల్యాణ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయంటున్నారు.

చెడటంతో…..

నిజానికి బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే పవన్ కల్యాణ్ ను వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా సంజయ్ లాంటి హిందుత్వ వాది తెలంగాణకు అవసరమంటూ పొగిడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత గ్యాప్ కన్పించినప్పటికీ వెంటనే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు రంగంలోకి దిగి పరిస్థిితిని చక్కదిద్దారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హర్ట్ అయిన పవన్ కల్యాణ్ సురభి వాణీదేవికి ఎన్నికల రోజు మద్దతిచ్చారు. దీంతో బండి సంజయ్ వర్గం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.

ప్రభావం లేకపోయినా…?

జనసేన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనలు కూడా చేస్తుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వేణ్ణీళ్లకు చన్నీళ్లగా ఉపయోగపడతారని బీజేపీ భావిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ ను శాంతపర్చాలని కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటున్నారు. పెద్దగా ఉపయోగం లేకపోయినా, అనవసరమైన తలనొప్పి ఎందుకన్న ధోరణిలోనే బీజేపీ నేతలు పవన్ కల్యాణ‌్ విషయంలో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు లేకుండానే సయోధ్యతో వెళ్లాలన్నది బండి సంజయ్ ఆలోచన.

Tags:    

Similar News