జేడీ “పంజా” అందుకేనటగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గుర్తింపు తెచ్చిందే సినిమాలు. ముందు ఆయన మెగా స్టార్ సోదరుడు గా అందరికి పరిచయం అయ్యాకే ఆ ట్యాగ్ లైన్ [more]

Update: 2020-01-31 03:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గుర్తింపు తెచ్చిందే సినిమాలు. ముందు ఆయన మెగా స్టార్ సోదరుడు గా అందరికి పరిచయం అయ్యాకే ఆ ట్యాగ్ లైన్ తోనే ఎంట్రీ ఇచ్చి సొంత బాణీతో రాణించి ఇమేజ్ తెచ్చుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు రాజకీయాలవైపు ఆయన్ను నడిపించింది. అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి ఇంకా ఎంతో కెరీర్ వున్నా కొంత కాలం పక్కన పెట్టి మరీ ఆయన యువరాజ్యం అధినేతగా పనిచేశారు. సరే… పీఆర్పీ దీర్ఘకాల రాజకీయాలకు సెట్ అవ్వలేమని డిసైడ్ చేసుకుని సున్నిత మనస్కుడైన చిరంజీవి తన స్కూల్ ను కాంగ్రెస్ లో విలీనం చేసి అందుకు తగ్గ ప్రతిఫలం అందుకుని అనుభవించేశారు.

ఇద్దరి దారులు వేరు …

ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ ఆలోచన ధోరణి విభిన్నం. అన్న ను ఆయన విమర్శించరు కానీ ఇది కాదు రూట్ అంటూ జనసేన పార్టీ మొదలు పెట్టి అభ్యర్థులే లేకుండా పోటీ లేకుండా విభిన్న రాజకీయానికి తెరతీశారు. తొలి ప్రయత్నం అనుకున్నట్లే సక్సెస్ ను పవన్ కల్యాణ్ కి అందించింది. ఇదేదో బావుంది అనుకుని తన బలం సొంతంగా ఎంత ఉందో చూసుకోవాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే టిడిపి మరోసారి పీఠం ఎక్కడం ఖాయం అనుకుని కొన్ని పార్టీల పొత్తుతో నేరుగా ఎన్నికల బరిలోకి దిగి చేదు అనుభవం మూటగట్టుకున్నారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందడాన్ని ఆయన ఇప్పటికి ఓర్చుకోలేక పోతున్నారు. పార్టీని లాగించడం ప్రస్తుత రోజుల్లో కష్టమైన పని అన్నది నిండా మునిగాక కానీ ఆయనకు అర్ధం కాలేదు. ఇంకేముంది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పవన్ కల్యాణ్ కు కామధేనువు మాదిరి కనిపించింది.

పిలవని పేరంటానికి వెళ్లి …

ప్రస్తుతం అవసరం లేకపోయినా పొత్తు కు సై అన్నారు. పవన్ కల్యాణ్ పాతమిత్రుడే కనుక ఎపి లో బలపడాలన్న ఆలోచనలో వున్న ఆయన్ను కలుపుకుని వెళ్లాలని కమలం నిర్ణయించింది. ఇక్కడి దాకా కథ బాగానే సాగింది. ఆ తరువాత కమలం నీడలో ఉన్నందున నిత్యం రాజకీయాలు అంటే ఖర్చే తప్ప వచ్చే రూపాయి ఆయనకు కనిపించలేదు. తనకు వచ్చిన… నచ్చిన పని సినిమాలు చేయడం కనుక వెయిటింగ్ లో ఉన్నవారితో డీల్ కుదుర్చుకుని రంగంలోకి దూకేశారు పవన్ కల్యాణ్. సినిమాలు చేయడం తప్పేమీ కాదు. అదీగాక ఎన్టీఆర్ అంతటివారు ముఖ్యమంత్రిగా ఉండి సినిమాల్లో నటించిన చరిత్ర వుంది. నాలుగేళ్లలో ఎన్నో కొన్ని సినిమాలు చేస్తే రాజకీయంగా కూడా పవన్ కల్యాణ్ పాపులారిటీ ఫ్యాన్స్ లో కొనసాగుతుంది. కానీ ఇదే నచ్చలేదుట మాజీ జెడి లక్ష్మీనారాయణ కు. పవన్ కల్యాణ్ సినిమాలు చేయను అని చెప్పి చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆయన నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారంటూ జనసేన కు రాజీనామా చేసి సంచలనం సృష్ట్టించారు. ఆయన నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ సైతం స్వాగతించి గౌరవ ప్రదంగానే ఆయనకు ఒక లేఖ ద్వారా వీడ్కోలు పలికేసారు.

జేడీ వెళ్లడానికి రీజన్స్ ఇవేనా?

సక్సెస్ వెనకే నేటి జనం. అది సినిమాలు అయినా రాజకీయం అయినా. సరిగ్గా జేడీ సైతం ఇదే అంచనాకు వచ్చేశారు. పార్టీలో తనకేమీ నెంబర్ టూ పొజిషన్ లేదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీస గుర్తింపు లేదు. ఓడిన నేతగా జనంలోనూ అధినేత కు ఇమేజ్ లేదు. వచ్చే ఎన్నికల్లో తన సీటుకు గ్యారంటీ లేదు. ఇన్ని కారణాలు ఎదురుగా కనిపిస్తుంటే ఎదో ఒక కారణం చూపించి బయటపడిపోవడమే మంచిదని జేడీ భావించినట్లు తెలుస్తుంది. అసలు కారణాలు వదిలి సినిమాల్లో తిరిగి పవన్ కల్యాణ్ నటించడం నచ్చలేదని పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తా అని ఇదేమి పనంటూ జేడీ తన రాజీనామా అస్త్రం సంధించారు.

అప్పుడు స్టార్ ఇమేజ్ ఉందనేగా …?

వాస్తవానికి పవన్ కల్యాణ‌ ఇమేజ్, తన వ్యక్తిగత చరిష్మా తో గెలుపు తీరం చేరుకుంటామని భావించే ఆయన జనసేనను నమ్ముకున్నారు. ఒక సినీ స్టార్ స్థాపించిన పార్టీలో నిలకడ వుండే రాజకీయాలు ఎలా వుంటాయని జేడీ తొందర పడ్డారు. పవన్ కూడా ఎన్టీఆర్ లా ఆవేశ పరుడు. తనకు ఏది తోస్తే అది చేస్తారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఏ కోశానా లేదు. అవన్నీ ఎన్నికల ముందు కనిపించని జేడీ కి ఇప్పుడు భూతద్దంలో కనిపించడం విశేషం. ఆయన రిజైన్ కి రీజన్స్ చాలానే ఉన్నాయన్న చర్చ నడుస్తుంది. సినీ గ్లామర్ కారణంగానే పవన్ కల్యాణ్ పార్టీ లో ఆయన చేరారు తప్ప మరే రీజన్ నాడు లేదు. టిడిపి లో చేరితే జెడి వైసిపి గతంలో చేసిన విమర్శలు నిజమనే సంకేతాలు ఇచ్చిన వారు అవుతారు. బిజెపి లో గత ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. వైసిపి లో చేరే అవకాశం నాడు లేనే లేదు. దాంతో పవన్ కల్యాణ్ ఒక్కరే ఆయనకు ప్రత్యామ్నాయంగా కనిపించారు. ఇప్పుడు కొన ఊపిరితో వున్న జనసేన కు జెడి ఇచ్చిన షాక్ మామూలు దేమి కాదు. అయితే జనసేన అంటే పవన్ కల్యాణ్ అని మాత్రమే నిర్మాణం అయిన పార్టీకి అందులో ఎవరు వున్నా పోయినా నష్టం ఏమి లేదు కానీ నైతికంగా జనంలో మరింత పలుచన కావడం తప్ప అన్న చర్చ సాగుతుంది.

Tags:    

Similar News