జగన్ని ఆడిపోసుకుంటే ఎలా..?

పవన్ కి ఎవరి మీద ద్వేషం కోపం ఉండదని అంటారు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వెనక కారణాలు ఎవరూ ఊహించలేకపోతున్నారు. [more]

Update: 2019-07-07 14:30 GMT

పవన్ కి ఎవరి మీద ద్వేషం కోపం ఉండదని అంటారు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వెనక కారణాలు ఎవరూ ఊహించలేకపోతున్నారు. పవన్ తన రాజకీయ ప్రచారంలో ఎపుడూ జగన్ని మాత్రమే గురి పెట్టి బాణాలు వేసేవారు. ఇక ఎన్నికల వేళ అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షమైన వైసీపీ మీద విమర్శలు చేసి తప్పుడు రాజకీయ వ్యూహం అనుసరించారు. సరే ఎన్నికలు అయ్యాయి, వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక పవన్ తన పార్టీకి మరమ్మతులు చేసుకుని ప్రజా క్షేత్రంలో నిలపాల్సిన పని ఉంది. దానికి బదులుగా ఆయన జగన్ని విమర్శించడానికి మళ్ళీ రెడీ అవుతున్నారు. తానా సభల్లో జగన్ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ పవన్ చేసిన కామెంట్స్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా ఉన్నాయి.

వైఎస్ ఫ్యామిలీతోనే….

సరిగ్గా పదేళ్ల క్రితం పవన్ యువరాజ్యం అధినేతగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళ పంచెలూడగొడతాను అంటూ రెచ్చిపోయారు. అప్పట్లో పంచె కట్టు సీఎం వైఎస్సారే ఉండేవారు. అంటే పవన్ డైరెక్ట్ గా పెద్దాయన్నే లక్ష్యంగా చేసుకున్నారన్న మాట. ఫలితం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ గెలిచారు. అయితే ఆ తరువాత పరిణామాలు చూస్తే జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి బాటలో నడుస్తూ ఆయన తన సొంత పార్టీ ద్వారా జనాలకు చేరువ అయ్యారు. మొత్తానికి అధికార పీఠం అందుకున్నారు. 2014లో పవన్ రాజకీయాల్లోకి వచ్చిందే జగన్ని ఓడించేందుకు అంటారంతా. అది నాడు సాధ్యపడింది కూడా. అయితే 2019లోనూ జగన్నే విమర్శిస్తూ పవన్ చేసిన రాజకీయాన్ని జనం గ్రహించారు. దాంతో ఆయన పార్టీని, టీడీపీని కూడా దారుణంగా ఓడించారు.

పస లేని ఆరోపణలు…..

జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తాను అని ఎన్నికల సభల్లో గర్జించిన పవన్ చివరకు తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలై జగన్ ను సీఎం గా చూడాల్సివచ్చింది. రాజకీయాల్లో పదేళ్ల నుండి ప్రత్యర్ధిని మార్చుకోని పవన్ వ్యూహం కరెక్టో కాదో ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వారిని అన్న నందమూరి, తరువాత వైఎస్సార్ కుటుంబం అంటే చాలా ఇష్టం. అది పదే పదే రుజువైన విషయం కూడా. పవన్ కూడా తాను జనాలకు ఏం చేయగలిగిందీ చెప్పుకోవాలి. తన విధానాలతో జనంలోకి రావాలి అంతే తప్ప జగన్ జైల్ నుంచి వచ్చిన వారని, అవినీతిపరులని తరచూ కామెంట్స్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి. ఎందుకంటే బంపర్ మెజారిటీతో జనం జగన్ కు ప్రజా న్యాయస్థానంలో తీర్పు ఇచ్చేశారు. అలాంటి కామెంట్స్ చేస్తే ప్రజా తీర్పునే కించపరచినట్లు. పవన్ దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తారో అంత తొందరగా ఆయన పార్టీకి కొత్త దారులు ఏర్పడతాయి.

Tags:    

Similar News