పవన్ మళ్ళీ అదే రూట్లో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గందరగోళ రాజకీయాలను అలాగే కొనసాగిస్తున్నారు. సొంత పార్టీ పెట్టుకుని కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అనుకూలంగానే సాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా [more]

Update: 2019-09-01 00:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గందరగోళ రాజకీయాలను అలాగే కొనసాగిస్తున్నారు. సొంత పార్టీ పెట్టుకుని కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అనుకూలంగానే సాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా అమరావతి రాజధాని పర్యటనలో పవన్ చేసిన కామెంట్స్ టీడీపీకి సంతోషంగా ఉంటాయేమో కానీ పవన్ కి రాజకీయ పునాదిగా ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో మాత్రం పెద్దగా మద్దతు లభించకపోవచ్చునని అంటున్నారు. అమరావతి రాజధాని ఓ సున్నితమైన సమస్య. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఇప్పటికీ నోరు విప్పలేదు. దాని అలా సంక్లిష్టంగా మర్చిన ఘనత అచ్చంగా అయిదేళ్ళు ఏలిన టీడీపీ సర్కార్ కే దక్కుతుంది. నవ్యాంధ్రలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీకి కొత్త రాజ‌ధాని అమరావతిని నిర్మించే సువర్ణ అవకాశం దక్కింది. దాన్ని పాడుచేసుకోవడమే కాకుండా ఏపీ ప్రజలకు సరైన దశ దిశా లేకుండా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేవలం రాజధాని అమరావతి మీద అమిత ప్రేమ కారణంగా టీడీపీ ఓడిపోయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

సమగ్రమైన ఆలోచన లేదా?

ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆయన రాజకీయ ఆలోచనల పరిధి మరీ ఇంతలా కుదించుకుపోయిందా ఆని అనిపించకమానదు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అక్కడే ఉండాలని ఆయన పట్టుపడుతున్నారు. కానీ ఏపీ నైసర్గిక పరిస్థితులు గమనించినపుడు మూడు భిన్న ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలలో మిగిలిన రెండు ప్రాంతాల ప్రజలు అభివృధ్ధికి ఆమడ దూరంలో ఉన్నామని చాలా దశాబ్దాలుగా బాధపడుతున్నారు. విభజన హామీల ప్రకారం ఈ ప్రాంతాలకు న్యాయం జరగలేదు. ఇక రాయలసీమ తీసుకుంటే శ్రీభాగ్ ఒప్పందం ఉండదే ఉంది. మరి వారికి రాజధాని అయినా హైకోర్టు అయినా ఇవ్వాలి. మరి వేటి గురించి ప్రస్తావించకుండా అంతా అమరావతిలోనే అంటూ గత సర్కార్ అధికార కేంద్రీకరణ చేస్తూ పోయింది. దానివల్లనే టీడీపీకి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తనికి మొత్తం సీట్లు గుండు సున్నా అయిపొయాయి. ఇపుడు పవన్ కళ్యాణ్ ఏపీలో ఉన్న మొత్తం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివ్రుధ్ధికి డిమాండ్ చేయాల్సివుండగా అమరావతి రాజధాని నిర్మిస్తే చాలు అనడం ద్వారా బాబు నినాదాన్నే వినిపిస్తున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రితో మాట్లాడరా..?:

ఇప్పటివరకూ మంత్రులు సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం రాజధాని అమరావతి విషయంలో నోరెత్తలేదు, ఇక బొత్స వంటి వారు కూడా రాజధాని అమరావతిని మారుస్తామని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. అక్కడ రాజధానిని ఆర్ధిక పరిస్థితులను బట్టి నిర్మించుకుని వెళ్తామని బొత్స అన్నారు. ఒకవేళ సందేహలు ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ముఖ్యమంత్రి జగన్ ని కలసి మాట్లాడవచ్చు కదా. రాజధాని అమరావతి విషయం పూర్తిగా రాష్ట్రానిదని ఓ వైపు బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెబుతుంటే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ని కలుస్తానని పవన్ చెప్పడంతో అర్ధమేంటో ఆయనకే తెలియాలి. 2015లో రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించినపుడు పవన్ అన్ని విషయాలు ప్రభుత్వం నుంచి కూడా తెలుసుకోవాలి కదా అని అప్పటి సీఎం బాబుని కలిశారు. మరి ఇపుడు కూడా విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే జగన్ ని కలవాలి కదా అంటున్నవారూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్లనే పవన్ పూర్తిగా టీడీపీ స్టాండ్ ని తీసుకుని మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి అయితే అమరావతి విషయంలో మద్దతుగా ఉన్న రెండు జిల్లాలు చాలేమో, మరి పవన్ కి పదమూడు జిల్లాల అవసరం ఉంటే అధికార వికేంద్రీకరణకు సంబంధించి మంచి సూచనలతో ప్రభుత్వాన్ని కలిస్తే ఆయనకు కూడా రాజకీయంగా ఓ విధానం అంటూ ఉందని అంతా భావిస్తారు.

Tags:    

Similar News