పవన్ భరోసా ఇస్తారా…?

ఇటీవల ఎన్నికల్లో కుదిరితే అధికారంలో లేకుంటే అధికారంలోకి వచ్చే పార్టీకి తమ మద్దతు ఇచ్చే రేంజ్‌లో ఎదగాలని భావించిన జనసేన పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన విషయం [more]

Update: 2019-08-04 00:30 GMT

ఇటీవల ఎన్నికల్లో కుదిరితే అధికారంలో లేకుంటే అధికారంలోకి వచ్చే పార్టీకి తమ మద్దతు ఇచ్చే రేంజ్‌లో ఎదగాలని భావించిన జనసేన పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఇక, మిగిలిన వారుకూడా బలమైన పోటీ ఇచ్చినప్పటికీ.. ప్రజల మద్దతును మాత్రం కూడగట్టలేక పోయారు. దీంతో కేవలం రాజోలు నియోజకవర్గంలో తప్ప ఎక్కడా జనసేన గెలిచిన సందర్భం కనిపించలేదు. దీంతో పార్టీ భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఇక, త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనకు జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

భీమవరం నుంచి ఓడి….

ఇప్పటికే పలు కమిటీలను వేసిన పవన్ కల్యాణ్ ఇక, ఇప్పుడు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఓటమి దెబ్బతో విలవిలలాడుతున్న నేతల్లో మనోస్థైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించనున్నట్టు తెలిసింది. ఇక్కడ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇక, ఇదే జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అలాంటి జిల్లాలో పక్కా ప్రణాళిక ప్రకారం పార్టీని అభివృద్ధి చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నాయకులు కూడా పవన్ కల్యాణ్ దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నారు.

వీరి భవితవ్యం ఏంటి…?

వీరిలో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొలిశెట్టి శ్రీనివాస్‌, ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిన రెడ్డి వెంకట అప్పల నాయుడు, పాలకొల్లులో ఓటమిపాలైన గుణ్నం నాగబాబు, నర్సాపురం నుంచి ఓడిపోయిన బొమ్మిడి నాయకర్‌లు ఓడిపోయినా 25 వేల నుంచి 30 వేల వరకు ఓట్లు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. ఎన్నికలు జరిగి రెండు మాసాలైనా కూడా వీరికి ఇప్పటి వరకు దిశానిర్దేశం కానీ, భవితపై సూచనలు కానీ పార్టీ నుంచి ఇప్పటి వరకు అందలేదు.

జనసేన వీడాలనుకుంటూ….

వీరిలో కొంద‌రు రాజ‌కీయ భ‌విష్యత్తుపై క్లారిటీ లేక‌పోవ‌డంతో జ‌న‌సేన‌ను వీడాల‌న్న నిర్ణయానికి వ‌చ్చేశారు. ఎక్కువ మంది వైసీపీలోకి జంప్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిన నేత‌లే కాకుండా ప‌వ‌న్ వీరాభిమానులు, అభిమాన సంఘాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్న వారు కూడా పవన్ కల్యాణ్ పై న‌మ్మకం లేక జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిలో కొత్త ఉత్సాహం నింపేందుకే పవన్ కల్యాణ్ తాజా ప‌ర్యట‌న‌కు వెళుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో వీరంతా కూడా తమ భవితవ్యంపై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు, ప్రజల మనసుల్లో చోటు సంపాయించుకునేందుకు వీరంతా రెడీగా ఉన్నారు. ఇప్పటి వ‌ర‌కు పార్టీలో స్థానిక , జిల్లా క‌మిటీలు లేక‌పోవ‌డంతో వీరంతా త‌మ‌కు గుర్తింపు లేద‌న్న ఆవేద‌న‌లో ఉన్నారు. మ‌రి ఇప్పట‌కైనా పవన్ కల్యాణ్ జ‌న‌సైనికుల్లో న‌మ్మకం క‌లిగించేలా పార్టీని ముందుకు న‌డుపుతాడో ? లేదో ? చూడాలి.

Tags:    

Similar News