ఫార్ములా సక్సెస్ అయితేనే?

అధికారంతో సంబంధం లేకుండా రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఏదో ఒకటో రెండో గెస్టు పాత్రలకు [more]

Update: 2020-02-03 15:30 GMT

అధికారంతో సంబంధం లేకుండా రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఏదో ఒకటో రెండో గెస్టు పాత్రలకు పరిమితమవుతారనుకున్నారందరూ. కానీ పెద్దపాత్రలు, వరస సినిమాలకు సిద్ధమవుతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ విమర్శలకూ కారణమవుతున్నాయి. ఇటీవలే జట్టుకట్టిన బీజేపీ, జనసేన ల ప్రాచుర్యంపై తాజా పరిణామాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశం పై లెక్కలు వేస్తున్నారందరూ.

ఫ్యాన్స్ కు పండుగ…

మళ్లీ సినిమాల్లో నటించేందుకు పవన్ కల్యాణ్ పూనుకోవడం ఆయన అభిమానులకు నిజంగా పండగే. ప్రత్యేక శైలి, విభిన్నమైన నటనతో యువతను ఆకట్టుకున్న నటుడు పవర్ స్టార్. తనకు సినిమాలపై ఆసక్తి లేదంటూ చాలా సందర్బాల్లో ఆయన ప్రకటిస్తూనే వచ్చారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం నెత్తిన పెట్టుకుంటూనే వచ్చారు. రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలోనూ అభిమానులే కొండంత అండగా పవన్ కల్యాణ్ కు నిలిచారు. అయితే తమ హీరో వెండితెరకు దూరం కావడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేక పోయారు. సినిమాల్లో నటించాలనేది వారి నిండైన కోరిక. ఇప్పుడది ఫలిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎన్నో రకాలుగా యోచించిన పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది సన్నిహితులు చెబుతున్నమాట. ఆర్థిక కారణాలు ఒక ఎత్తు. రాజకీయాలకు గ్లామర్ అవసరం చాలా ఉంటుంది. దీర్ఘకాలం ఎన్నికల్లో విజయాలు సాధించకుండా ఉంటే తెరమరుగైపోతారు. కనీసం సినిమాల్లోనూ కనిపించకపోతే ఆకర్షణ క్రమేపీ తగ్గిపోయే అవకాశాలున్నాయి. అందువల్ల పవన్ కల్యాణ్ ది సరైన నిర్ణయమేననేది సినీ, రాజకీయ వర్గాల అంచనా.

రెండు పడవలు…

ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత నుంచి సినిమా, రాజకీయం కలిసి నడుస్తున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. అనేకమంది తారలు రాజకీయ ప్రవేశం చేశారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ ఈ రెండు రంగాల మధ్య సాన్నిహిత్యం పెనవేసుకుపోయింది. ఎన్టీరామారావు అధికారంలో ఉండగానూ కొన్నిచిత్రాలు నిర్మించారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్ అశోక వంటివి ఆయనకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత నటించిన మేజర్ చంద్రకాంత్ ఎన్టీయార్ లోని ఆకర్షణను రెట్టింపు చేసింది. 1994లో జరిగిన ఎన్నికలలో పునరధికారానికి కొంత తోడ్పాటునందించింది. సినిమాలకు స్వస్తి చెప్పేశానంటూ పవన్ కల్యాణ్ తనంతతానుగా ప్రకటించి తప్పుచేశారని తొలి దశలోనే భిన్నమైన వాదనలు వినవచ్చాయి. సినిమాలు అభిమానుల ఫాలోయింగ్ ను కాపాడుతూ ఉంటాయి. దానిని రాజకీయ శక్తిగా మార్చుకునేందుకు అవకాశాలుంటాయి. బలమైన ప్రత్యర్థులు ఉన్న స్థితిలో రాజకీయాల్లో గట్టి విజయాలు సాధించకపోతే రెంటికీ చెడ్డ రేవడిగా ఉండిపోవాల్సి వస్తుంది. అందువల్ల సినిమాలు చేస్తూనే రాజకీయంగా తన టైమ్ వచ్చేవరకూ వేచి ఉండటం ఉత్తమమనేది జనసేనలోనే మెజార్టీ అభిప్రాయంగా ఉంది. గతంలో పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయిద్దామని భావించి మెగాస్టార్ చిరంజీవి నిలబడలేకపోయారు. దాదాపు పదేళ్ల విరామంతో తిరిగి మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం అదే బాటను అనుసరించబోతున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమా ఆకర్షణను కాదని కాలం గడపడం వృథా ప్రయాస అనేవారికి కొరత లేదు. వారందరి కోరిక తాజా నిర్ణయంతో పవన్ తీర్చేస్తున్నట్లుగానే భావించాలి.

పార్ట్ టైమ్ విమర్శలు…

ఇప్పటికే పవన్ కల్యాణ్ పై పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడనే విమర్శలున్నాయి. పబ్లిక్ లీడర్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనాలి. ఏదో ఒక యాక్టివిటీని నిర్వహిస్తూ ఉండాలి. ఆ తరహా లక్షణాలను జనసేనాని కనబరచకపోవడం వల్ల పార్టీ భవిష్యత్తుపైనే అనుమానాలు ఏర్పడ్డాయి. పార్టీ ఏర్పాటై అయిదేళ్లు గడచినా పూర్తి నిర్మాణం చేయలేదు. కేవలం అభిమానుల ఆదరణతోనే పార్టీ నడుస్తోంది. సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సి ఉంది. జాతీయ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపిన తర్వాత రాజకీయ పోరును ఉద్ధృతం చేయాల్సిన దశ వచ్చింది. ఈ స్థితిలో ప్రతినిముషమూ విలువైనదే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రకరకాల రూపాల్లో ఆందోళనలు చేస్తోంది. బీజేపీ , జనసేన కూటమి టీడీపీని వెనక్కి నెట్టి వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలవాలని ఆశిస్తోంది. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ రాజకీయ బాధ్యతలు పెరుగుతున్నాయి. సినిమా రంగానికి, రాజకీయ రంగానికి పవర్ స్టార్ సమన్యాయం చేయగలరా? అనే ప్రశ్నలు ఇదే సందర్భంలో ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయంగా దూసుకు వెళ్లడానికి సినిమా అండ ఉపయోగపడుతుందనే వాదనలూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ కోరిక మాత్రం పక్కా ఫలిస్తోంది. కానీ సినీ రాజకీయాల కాంబో ఫార్ములా సక్సెస్ ఫుల్ గా వర్కవుట్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News