పవన్ చెబితేనే చెల్లుబాటవుతుందా?

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సరే ఎన్నికల సంగతి పక్కన [more]

Update: 2020-02-24 11:00 GMT

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సరే ఎన్నికల సంగతి పక్కన పెడితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కొత్త వారు అవుతారని అంటున్నారు. ఆ కొత్త వారు ఎవరా అన్నది ఒక చర్చగా ఉంటే కమలధారిని ఎంపిక చేసే విషయంలో పవన్ నిర్ణయం కూడా ఇపుడు కీలకం అవుతుందని కాషాయ శిబిరంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరకూ చూస్తే పవన్ కల్యాణ్ కి ఆయనతో పెద్దగా సాన్నిహిత్యం లేదు. దాంతో తనతో కలసి పనిచేసే కొత్త అధ్యక్షుడి ఎంపిక బాధ్యత పవన్ కల్యాణ్ కూడా కొంత తీసుకుంటున్నారుట.

ఆయన ఓకే అంటేనే…..?

పవన్ కల్యాణ‌్ విషయానికి వస్తే రాజకీయాల్లో ఆయన జూనియర్, పైగా యువకుడి కిందనే లెక్క. దాంతో తన వయసుకు, అనుభవానికి సరిపోయే జోడీనే ఆయన ఎంపిక చేస్తారని అంటున్నారు. సీనియర్లు, మంత్రులుగా చలామణీ అయిన వారు కనుక ఏపీ బీజేపీ అధ్యక్షులు అయితే వారి లెక్కలు వేరేగా ఉంటాయని, దాంతో సమన్వయం కష్టమవుతుందని కూడా పవన్ కల్యాణ‌్ అనుకుంటున్నారుట. ఈ క్రమంలో యువకుడి నెత్తిన కమల కిరీటం పెడితే జోడు గుర్రాల్లా ఇద్దరం కలసి పనిచేసుకుపోతామని పవన్ కల్యాణ్ సందేశాలు ఇస్తున్నారని అంటున్నారు.

అదీ కధ…..

ఇక ఏపీలో కమ్మ, కాపు, రెడ్డి వర్గాలు రాజకీయంగా బలంగా ఉన్నాయి. కమ్మలకు ప్రతినిధిగా టీడీపీ ఉంటే, రెడ్డిల తరఫున వైసీపీ ఉంది. బీజేపీ కూడా ఈ కుల సమీకరణల నుంచి బయటకు రావడం లేదు. కాపుల నుంచి అందుకే కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసి పీఠం అప్పగించారు. ఇపుడు కూడా మళ్ళీ కమ్మ, కాపుల మధ్యనే బీజేపీ రాజకీయం తిరిగుతోందట. దాంతో పవన్ కల్యాణ్ మనసులో ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. తాను ఎటూ కాపులకు ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఆ వర్గం నుంచి బీజేపీలో కొత్త నేత ఎందుకన్నది ఆయన భావనగా చెబుతున్నారు. అలాగే కమ్మల నుంచి ఎవరినీ పెట్టినా టీడీపీ ప్రోగా ఉంటారని, పైగా రాజకీయ అధిపత్యం కూడా ఉంటుందని జనసేనలో చర్చ సాగుతోందిట. దాంతో బీసీల నుంచి యువకుడికి పదవి అప్పగిస్తే బాగుంటుదని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారని అంటున్నారు.

మాధవుడే నాయకుడా….?

ఇలా అన్ని రకాలుగా పవన్ కల్యాణ్ విశ్లేషణలు, ఆలోచనలు కలగలసి చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కొత్త బీజేపీ సారధి అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం, యువకుడు కావడంతో జనసేనాని ఆయనకే ఓటు వేస్తారని అంటున్నారు. ఇక ఏపీ బీజేపేతో కలసి నడిచేందుకు పవన్ కల్యాణ్ కి కూడా ఇకపైన ఎటువంటి ఇబ్బందులు ఉండవని, జోడు గుర్రాల మాదిరిగా ఇద్దరు యువకులూ రెండు పార్టీలను ముందుకు తీసుకుఇపోయేందుకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. పైగా ఏపీలో బీజేపీలో జనసేన మాట నెగ్గడానికి కూడా మాధవ్ లాంటి జూనియర్ కి పగ్గాలు అప్పగించడం వల్ల సులువు అవుతుందని జనసేనలో ఆలోచనలు సాగుతున్నాయట. మరి ఈ ప్రచారాలన్నీ నిజమైతే పవన్ ఓటే తులసీదళమైతే మాత్రం కచ్చితంగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా మాధవ్ వస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News