పవన్ అసలైన….బలమైన ప్రత్యర్థా…?

‘నన్ను ద్వేషించినా ఫర్వాలేదు. ప్రేమించినా ఫర్వాలేదు. నా అస్తిత్వాన్ని మాత్రం గుర్తించు.’ అంటుంది రాజకీయం. బీజేపీ ఓటు బ్యాంకు, సాధించిన సీట్లతో పోలిస్తే వామపక్షాలను అసలు పరిగణనలోకే [more]

Update: 2019-12-09 15:30 GMT

‘నన్ను ద్వేషించినా ఫర్వాలేదు. ప్రేమించినా ఫర్వాలేదు. నా అస్తిత్వాన్ని మాత్రం గుర్తించు.’ అంటుంది రాజకీయం. బీజేపీ ఓటు బ్యాంకు, సాధించిన సీట్లతో పోలిస్తే వామపక్షాలను అసలు పరిగణనలోకే తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సిద్ధాంత బలంతో దేశంలో తామున్నామని నిరూపించుకుంటూ ఉంటాయి. బీజేపీ భావజాలాన్ని ఖండిస్తుంటాయి. కమలం పార్టీ సైతం సైద్దాంతికంగా తమకు కమ్యూనిస్టులే ప్రత్యర్థులని గుర్తిస్తుంటుంది. ఫీల్ మై లవ్ అంటాడు ప్రేమికుడు. ఫీల్ మై ప్రెజెన్స్ అంటుంది పాలిటిక్స్. ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ సమరంలో ఇదే ప్రధానాంశంగా నిలుస్తోంది. ఓట్లు, సీట్ల పరంగా జనసేనకు, వైసీపీకి చాలా వ్యత్యాసం ఉంది. అయినా ముఖాముఖి తలపడుతున్న భావన కల్పించడంలో జనసేన సక్సెస్ అవుతోంది.

పునరేకీకరణ కేంద్రమా..?

పవన్ కల్యాణ్ ప్రస్థానమెటు? వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనకు అత్యధిక ప్రాధాన్యమివ్వడంలోని ఆంతర్యమేమిటి? అసలు ఒకే ఒక్క శాసనసభ్యునితో ఉన్న ఆ పార్టీకి అంత ప్రాముఖ్యం ఇవ్వాలా? 50 శాతం పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న అధికార పార్టీ ఆరుశాతం ఓట్లకే పరిమితమైన జనసేనాని విమర్శలపై అంతగా ప్రతిస్పందించాలా? దీనిద్వారా ప్రజలకు , వైసీపీ శ్రేణులకు ఏరకమైన సంకేతాలు పంపుతున్నట్లు? అన్నీ ప్రశ్నలే. అప్పుడప్పుడూ ప్రజల్లో తిరుగుతూ తరచూ ట్వీట్లు, రాష్ట్రప్రభుత్వంపై విమర్శలతో పవన్ కల్యాణ్ తన రాజకీయ అస్తిత్వాన్ని స్థిరపరచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపిన తెలుగుదేశం పార్టీపై విమర్శలను దాదాపు పక్కన పెట్టేశారు. భారతీయ జనతాపార్టీ విధానాల పట్ల సానుకూలతను ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కలగలిసి వైసీపీకి చికాకు కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకూ పవన్ పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు కేంద్రస్థానంగా పవన్ కల్యాణ్ నిలుస్తారేమోననే అనుమానమే ఈ ఆందోళనకు కారణంగా చెప్పాలి.

వ్యూహాత్మక తప్పిదం…

పవన్ కల్యాణ్ చేసే విమర్శల పట్ల తీవ్రస్థాయి స్పందనలు కనబరుస్తూ వైసీపీ నేతలు జనసేనను ఒక ప్రధాన ప్రత్యర్థిగా గుర్తిస్తున్నారు. ఇది పవన్ బలపడటానికి పరోక్షంగా దోహదం చేస్తోంది. నిజానికి టీడీపీ అధినేత చేసే విమర్శల కంటే పవన్ చేసే ఆరోపణలకు బదులిచ్చేందుకే వైసీపీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. దీనివల్ల తమ వైసీపీకి భవిష్యత్తులో జనసేన పొటెన్షియల్ ప్రత్యర్థి అని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లవుతోంది. తమకు సరిజోడు కాదని భావిస్తే ప్రత్యర్థిని పట్టించుకోకుండా ఉండటం రాజకీయాల్లో తెలివైన ఎత్తుగడ. దిగువస్థాయి నేతల చేతనే ప్రత్యారోపణలు చేయించాలి. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఆయా విమర్శలు, ఆరోపణల పట్ల ఉదాసీనంగా ఉండాలి. తాము కేర్ చేయడంలేదనే సంకేతాలను పంపించగలగాలి. తద్వారా ఆయా విమర్శలు, ఆరోపణల స్థాయిని తగ్గించినట్లవుతుంది. ఆ పార్టీని కూడా నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అదే అగ్రనేతలు బదులిస్తూ పోతే మరిన్ని కొత్త విమర్శలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

పవన్ ముందు మార్గాలు…

పవన్ కల్యాణ్ కు రాజకీయంగా స్పష్టత ఉందా? అనే విషయంలో ఆ పార్టీతో పాటు రాజకీయ శ్రేణుల్లోనూ సందేహాలున్నాయి. బీజేపీతో తాను కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే విభేదించానని తాజా ప్రకటనల్లో స్పష్టం చేస్తున్నారు. అమిత్ షా తో సత్సంబంధాలను పదే పదే ప్రస్తావిస్తూ చేయి కలిపే అవకాశాలున్నాయన్న సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయా పార్టీలతో పెద్దగా రాజకీయ విభేదాలు లేవనే విషయాన్ని అన్యాపదేశంగా వెల్లడిస్తున్నారు. ఇది రాజకీయ పునరేకీకరణకు ఒక ప్రయత్నంగా కూడా పరిశీలకులు పేర్కొంటున్నారు. బీజేపీ, జనసేన చేతులు కలపడానికి, లేదంటే 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి భవిష్యత్తులో రంగంలోకి దిగేందుకు ఛాన్సులు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెంటిలో ఏదైనా జనసేనకు లాభదాయకంగానే ఉంటుందనేది పవన్ మనోభావనగా విశ్లేషకుల అంచనా.

కేంద్రానికి చేరువైతే…

బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. గతంలోనే జనసేనను బీజేపీలో విలీనం చేసి పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించవలసిందిగా పవన్ కల్యాణ్ కు అగ్రనాయకత్వం ఆఫర్ ఇచ్చింది. ఈవిషయంలో అమిత్ షా స్వయంగా చొరవ చూపారు. అయితే అప్పట్లో వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపి 2019 ఎన్నికలలో సీపీఐ,సీపీఎం, బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది . వామపక్షాలు, బీఎస్పీ సహకారం పవన్ కు ఏమాత్రం కలిసిరాలేదు. అందువల్ల బీజేపీతో కలిసి వెళ్లడమే మార్గాంతరంగా పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారనేది ఒక వాదన. అయితే బీజేపీ ఇప్పటికీ తన పాత ప్రతిపాదనలకే కట్టుబడి ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. జనసేనను విలీనం చేసుకుని పవన్ వంటి గ్లామర్ స్టార్ ను తమ ప్రచారసారథిగా మలచుకోవచ్చనేది ఆపార్టీ అంతరంగం.

సేనలో భిన్నాభిప్రాయాలు….

దీనిపై జనసేనలో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. జనసేనను విలీనం చేస్తే పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆకర్షణ, బలాన్నే బీజేపీ వినియోగించుకుంటుంది. దానివల్ల ఆయనకు చేకూరే రాజకీయ ప్రయోజనం కంటే బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కానీ రాజకీయాల్లో బలాబలాలు శాశ్వతంగా ఉండవు. ఒన్ ప్లస్ ఒన్ రెండూ కావచ్చు. నాలుగు కావచ్చు. ఒక్కో సందర్భంలో సున్నకు కూడా పడిపోవచ్చు. రాజకీయ వాతావరణంలో మార్పు వస్తే కమలం గాలి బలంగా రాష్ట్రంలో వీయవచ్చు. అటువంటప్పుడు పవన్ కల్యాణ్ వంటి నేత పార్టీకి అండగా ఉంటే అధికారపీఠానికి చేరువ కావచ్చనేది బీజేపీ నేతల అంచనా. అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బాగా బలహీన పడితేనే ఈ సమీకరణ సాధ్యమవుతుంది. రాజకీయాల్లో కాలం చాలా మార్పులకు దారి తీస్తుంది. అవసరాలు, అవకాశాలు, అధికారం వంటి అంశాలే మిత్రులెవరో, శత్రువులెవరో తేలుస్తాయి. అంతవరకూ వేచి చూడాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News