మరో పరాభవం తప్పదా?

“మీ ఈల‌లు చ‌ప్పట్ల వ‌ల్ల నాకు కానీ, మ‌న పార్టీకి కానీ ఒరిగేది ఏమీ ఉండ‌దు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఊపు, ఉత్సాహం.. ఎన్నిక‌ల్లో చూపించి ఉంటే [more]

Update: 2020-01-12 09:30 GMT

“మీ ఈల‌లు చ‌ప్పట్ల వ‌ల్ల నాకు కానీ, మ‌న పార్టీకి కానీ ఒరిగేది ఏమీ ఉండ‌దు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఊపు, ఉత్సాహం.. ఎన్నిక‌ల్లో చూపించి ఉంటే మ‌నం గెలిచేవాళ్లం” నెల రోజుల కింద‌ట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న పార్టీ కార్యక‌ర్తలు, అభిమానులను ఉద్దేశించి ఓ స‌మావేశంలో చేసిన వ్యాఖ్య ఇది. నిజ‌మే. ప‌వ‌న్ కల్యాణ్ ఆవేద‌న‌లో చాలా అర్ధం ఉంది. ఆయ‌న‌ను రాజ‌కీయ నేత‌గా కంటే ఓ పార్టీ అధినేత‌గా కంటే కూడా ఇంకా ఓ సినీ హీరోగానే ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్యక‌ర్తలు భావిస్తున్నారు. ఇప్పటికీ.. ప‌వ‌న్ కల్యాణ్ ఎక్కడ స‌భ పెట్టినా.. ఏం మాట్లాడినా.. ఆయ‌న చెబుతున్న విష‌యం కంటే కూడా ఆయ‌న హావ‌భావాల‌కే అభిమానుల నుంచి ఈల‌లు చ‌ప్పట్లు పడుతున్నాయి.

క్షేత్రస్థాయిలో బలం లేక….

ఇలాంటి ప‌రిస్థితి అప్పటిక‌ప్పుడు అభిమానుల‌కు, యువ‌త‌కు, పార్టీ కార్యక‌ర్తకు బాగుందేమో కానీ, స్థూలంగా చూస్తే.. జ‌న‌సేనానికి మాత్రం ఇబ్బందిగానే ఉంది. ప్రశ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ ప‌వ‌న్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత కూడా ఇంకా నిల‌బ‌డి ఉద్యమాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తున్న ప‌రిస్థితి ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం బ‌లం పుంజుకోవడం లేదు. దీనిపై ఏ వేదిక ఎక్కినా.. ప‌వ‌న్ కల్యాణ్ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న జిల్లాల్లోనూ మండ‌ల స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

“వీర మ‌హిళ” పేరుతో ఆయ‌న మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం పెంచారు. అయినా కూడా పార్టీలో కీల‌కంగా వ్యవ‌హ‌రించాల్సిన యువ‌త ఇప్పటికీ పార్టీకి అటాచ్ కాలేక పోతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ నెల 17న నోటిఫికేష‌న్ కూడా వెలువ‌డ‌నుంది. ఈ ఎన్నికలపై మూడు మాసాల‌కు ముందుగానే ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని ప‌వ‌న్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో మ‌న స‌త్తా చాటుదాం. సార్వత్రిక ఎన్నిక‌ల్లో పోయిన ప్రాభ‌వాన్ని ఇప్పుడు తెచ్చుకుందాం! అంటూ ఆయ‌న నేత‌ల‌కు, కార్యక‌ర్తల కు హితబోధ చేశారు.

అక్కడ ముందే…..

అయితే, ఇప్పటి వ‌ర‌కు ఆదిశ‌గా పార్టీ నుంచి ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకపోవ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ పార్టీ ఒక స్టాండ్ తీసుకోని ఫ‌లితంగా ఎక్కడిక‌క్కడ దీనిపై స్పందించే నాయ‌కులు కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ కల్యాణ్ క‌ల‌లు సాకారం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తెలంగాణ‌లో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప‌రిస్థితి లేదు. అక్కడ ముందే జ‌న‌సేన చేతులు ఎత్తేసింది.

ఇప్పటికైనా మేల్కొనకుంటే….

ఇక ప‌వ‌న్ కల్యాణ్ సొంత రాష్ట్రమైన ఏపీలో ఇప్పటి వ‌ర‌కు జిల్లా క‌మిటీలే లేవు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిని మ‌ళ్లీ ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లుగా నియ‌మిస్తూ ప్రక‌ట‌న‌లు చేస్తుండ‌డ‌మే త‌ప్ప జ‌న‌సేనాని జిల్లా, మండ‌ల క‌మిటీల‌పై దృష్టి పెట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అస‌లు ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు అభ్యర్థులు కాదు… బీ ఫాంలు ఇచ్చే నాయ‌కులు అయినా ఉంటారా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అయినా ప్రభావం చూపితేనే జ‌న‌సేన‌కు కొంత వ‌ర‌కు జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయి. మ‌రి ప‌వ‌న్ కల్యాణ్ స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News