గోదారిలో ఈదడమే బెటరట

విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని జనసేనాని పవన్ కల్యాణ్ రెండేళ్ళ క్రితం వరకూ చాలా కబుర్లు చెప్పారు. ఇక్కడ నుంచే తాను నటనలో ఓనమాలు నేర్చుకున్నాన‌ని [more]

Update: 2020-02-20 11:00 GMT

విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని జనసేనాని పవన్ కల్యాణ్ రెండేళ్ళ క్రితం వరకూ చాలా కబుర్లు చెప్పారు. ఇక్కడ నుంచే తాను నటనలో ఓనమాలు నేర్చుకున్నాన‌ని కూడా ఆయన గట్టిగా ఒత్తి పలికారు. విశాఖలో నట శిక్షణను నేర్చుకుంటే తన అభిమానులు ఇక్కడ తన సినిమాలను పెద్ద హిట్ చేసి ఈ స్థాయిని తీసుకువచ్చారని కూడా పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. విశాఖ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఇక్కడ ప్రజలు మంచివారని అచ్చం చంద్రబాబు తరహాలో ఎన్నో కధలూ చెప్పారు. అందుకే గాజువాక నుంచి పోటీ చేస్తున్నానని పవన్ చెప్పారు. సరే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అది సాధారణ విషయమే కానీ ఇక్కడ నుంచి పవన్ కల్యాణ‌్ జెండా ఎత్తేయడమే ఇపుడు అసలైన ట్విస్ట్.

గూడెం వైపు చూపు….

పవన్ కల్యాణ‌్ 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే సన్నాహలు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న దానిపైనా క్లారిటీకి వచ్చారని సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ తాను రెండు సీట్లకు పోటీ చేసి తప్పుచేశానని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దానితో పాటు గత ఎన్నికల్లోనే తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తే బాగుండేది అన్న మాట కూడా అన్నారట. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే పవన్ ఓడిపోగానే విశాఖకు రాం రాం అనేశారన్న మాట.

అందుకేనా?

పవన్ కళ్యాణ్ విశాఖను వదిలేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో అతి ముఖ్యమైనది విశాఖ రాజధాని. ఇక్కడ నుంచే జగన్ ముఖ్యమంత్రిగా పాలన చేస్తారు. అంటే 2024 నాటికి వైసీపీ ఇక్కడ బలంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జగన్ ఫోకస్ మొత్తం ఇక్కడే ఉండడం వల్ల పోటీకి కష్టమన్న భావనతో ముందు జాగ్రత్తగా వేరే చోట సీటు పవన్ కల్యాణ్ వెతుక్కుంటున్నారని అంటున్నారు. అదే విధంగా తనను ఓడించిన గాజువాకలో మళ్ళీ పోటీ చేయడం మంచిది కాదని కూడా జనసేనాని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అలా వ్యతిరేకత….

మరో వైపు పవన్ కల్యాణ్ మూడు రాజధానుల ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అమరావతినే రాజధానిగా చేయమని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ రాజధాని అంటే మండిపడుతున్నారు. అటువంటపుడు పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి గెలవాలనుకోవడం అతి పెద్ద సాహసమే అవుతుంది. ఈ మధ్యనే మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ కల్యాణ్ కి ఒక సవాల్ చేశారు. విశాఖ రాజధాని వద్దు అంటున్న పవన్ ఇక్కడ పోటీ చేసి గెలవాలని, లేకపోతే ఈ ప్రాంతం నుంచి పోటీకే దిగవద్దని కూడా అనడం విశేషం. విశాఖ పోటీకి పనికివచ్చింది కానీ రాజధానిగా ఉండే అర్హత లేదా పవన్ కల్యాణ్ అంటూ మంత్రి గట్టిగానే నిలదీశారు. దాంతో కూడా పవన్ కల్యాణ‌్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు రెండేళ్ళ ముందు నుంచి ఈ ప్రాంతంలో పర్యటించి హడావుడి చేసి పోటీకి కూడా దిగిన పవన్ కల్యాణ్ గత ఏడాది కాలంగా ఈ వైపు చూడకపోవడంతో పాటు ఇపుడు గోదావరే బెటర్ అనుకోవడం ఆయన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశగా ఉందిట.

Tags:    

Similar News