పవన్ కు షాకేగా?

కేంద్ర ప్రభుత్వం తన జేబులో ఉన్నట్లుగా పవన్ కల్యాణ్ నిన్నటిదాకా అనేక రకాలుగా భీకరమైన స్టేట్ మెంట్లు ఇచ్చారు. కేంద్రం చూస్తూ ఊరుకోదు జగన్ అంటూ హెచ్చరికలు [more]

Update: 2020-02-13 11:00 GMT

కేంద్ర ప్రభుత్వం తన జేబులో ఉన్నట్లుగా పవన్ కల్యాణ్ నిన్నటిదాకా అనేక రకాలుగా భీకరమైన స్టేట్ మెంట్లు ఇచ్చారు. కేంద్రం చూస్తూ ఊరుకోదు జగన్ అంటూ హెచ్చరికలు పంపారు. మోడీ, అమిత్ షా వంటి బలమైన నాయకుల ముందు జగన్ ఎంత అన్నట్లుగా కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇపుడు అవన్నీ పక్కన పెడితే కేంద్రం జగన్ పట్ల పూర్తిగా సాఫ్ట్ కార్నర్ తో ఉంటోంది. దానికి ఉదాహరణ జగన్ ని పిలిచి మరీ ప్రధాని మోడీ గంటన్నర పాటు భేటీ వేయడం. మరో వైపు కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరుతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ కల్యాణ్ తట్టుకోగలరా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఆయన గుర్తించారు….

నేను జగన్ ని సీఎంగా కనీసం గుర్తించను అంటూ పవన్ కల్యాణ్ చాలా సార్లు అన్నారు. అయితే ఆయన గుర్తించకపోయినా కూడా పవనే చెప్పినట్లుగా దేశంలో బలమైన నాయకుడు మోడీ జగన్ ని ముఖ్యమంత్రిగా బాగానే గుర్తిస్తున్నారు. మర్యాదలు కూడా చేస్తున్నారు. జగన్ ని ఆప్యాయంగా చేరదీస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్ కి మింగుడుపడని అంశమే. కేంద్రం అండతో జగన్ని ఇబ్బంది పెట్టాలని పవన్ కల్యాణ‌్ స్కెచ్ వేస్తే ఇపుడు కేంద్రమే జగన్ ని అక్కున చేర్చుకోవడం అంటే నిజంగా పవన్ కి షాకింగ్ పరిణామమేనని అంటున్నారు.

కేంద్రంలోకి…..

ఇక వైసీపీకి చెందిన వారికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖాయమని కూడా మరో వైపు హస్తినలో ప్రచారం ఓ రేంజిలో సాగుతోంది. అదే జరిగితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ తట్టుకోవడం కష్టమేనని అంటున్నారు. జగన్ కూడా పరోక్షంగా పవన్ కి మిత్రుడు అయిపోతారు. మరి కేంద్రంలో మోడీ, ఏపీలో జగన్ చెట్టాపట్టాలు వేసుకుంటే పవన్ కల్యాణ‌్ ఒక్కడే జగన్ మీద విరుచుకుపడితే ఉపయోగం ఉండదు, పొత్తు ధర్మం కూడా అది కాదంటున్నారు. ఓ విధంగా తాజా పరిణామాలు జనసేనకు ఆందోళన కలిగించేవేనని అంటున్నారు.

మ్యాజిక్ అదే?

రాజకీయాల్లో మనుషులు కాదు, ఎపుడూ నంబర్ గేమ్ మాత్రేమే మ్యాజిక్ చేస్తుంది. పవన్ కల్యాణ‌్ విషయం తీసుకుంటే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కారు. అదే సమయంలో జగన్ ఏపీలో బలమైన నాయకుడు, 22 మంది లోక్ సభ సభ్యులు, మరో నెలలో ఆరుగురు రాజ్యసభ సభ్యులతో జగన్ దేశంలో మూడవ అతి పెద్ద పార్టీగా కూడా ఉంటారు. దాంతో కేంద్రం చూపు తప్పనిసరిగా జగన్ మీద ఉంటుంది. అది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఏపీలో పవన్ కల్యాణ‌్ వల్ల బీజేపీకి ఓరిగిందేమీ లేదు. పవన్ కల్యాణ్ వచ్చి పొత్తు పేరిట కలిశారు అంటే అది ఆయన రాజకీయ అవసరంగానే బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుంది. ఏపీలో జనసేన పోకడలు, ఆయన పార్టీ బలాలు అన్నీ కూడా ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా కేంద్రానికి తెలియకుండా ఉండవు. అందుకే ఇపుడున్న జాతీయ రాజకీయాల్లో బలమైన జగన్ ని తమతో పాటుగా తీసుకెళ్ళేందుకు బీజేపీ రెడీ అవుతోందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో జనసేనకు రోజులు దగ్గర పడ్డట్టే మరి.

Tags:    

Similar News