వారి చెప్పు చేతల్లోనేనా?

రాష్ట్రంలో న‌వ, యువ కెర‌టం మాదిరిగా ఎగిసి ప‌డి రాజ‌కీయాల్లో స‌రికొత్త పుంత‌లు తొక్కుతార‌ని అంద‌రూ ఆశించిన ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యవ‌హారం మూడు అడుగులు [more]

Update: 2020-02-14 03:30 GMT

రాష్ట్రంలో న‌వ, యువ కెర‌టం మాదిరిగా ఎగిసి ప‌డి రాజ‌కీయాల్లో స‌రికొత్త పుంత‌లు తొక్కుతార‌ని అంద‌రూ ఆశించిన ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యవ‌హారం మూడు అడుగులు ముందుకు ప‌ద‌హారు అడుగులు వెన‌క్కి అన్న చందంగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు ఒంట‌రిగానే రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌ కల్యాణ్ త‌ర్వాత మాత్రం ఆయ‌న బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. దీంతో రాజ‌కీయంగా ఊపు వ‌స్తుంద‌ని, ప‌వ‌న్‌ కల్యాణ‌్ కు ఇక‌, మంచి రోజులు వ‌చ్చాయని కొంద‌రు అభిమానులు అనుకున్నారు. ఇక‌, పార్టీలో రెండు వ‌ర్గాలు విడిపోయాయి.

బీజేపీ చెప్పినట్లుగానే….

బీజేపీని వ్యతిరేకించే వ‌ర్గం ఇప్పటికీ జ‌న‌సేన‌లోనే ఉన్నా.. కార్యక్రమాల‌కు దూరంగా ఉంటోంది. ఇక‌, ఇవన్నీ ఇలా ఉంటే ప‌వ‌న్ కల్యాణ్ వ్యూహానికి, బీజేపీ వ్యూహానికి మ‌ధ్య వైరుధ్యం అప్పుడే క‌నిపిస్తోంది. ప్రజ‌ల‌ల్లోకి వెళ్లాల‌నేది అటు జ‌న‌సేన‌, ఇటు బీజేపీల ఉమ్మడి వ్యూహ‌మే అయినా ఎప్పుడు ఎలా వెళ్లాల‌నే విషయంలో బీజేపీ పైచేయి సాధిస్తోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే, బీజేపీతో చేతులు క‌లిపిన జ‌న సేనాని ప‌వ‌న్‌ను బీజేపీ అన్ని విధాలా చెప్పుచేత‌ల్లో న‌డిపిస్తోంద‌నే ప్రచారం జ‌రుగుతోంది.

లాంగ్ మార్చ్ విషయంలోనూ…..

వాస్తవానికి రాజధాని ప్రాంతంలో ఈ నెల రెండోవారం అంటే.. ప‌దో తేదీ త‌ర్వాత రెండు రోజులు ప‌ర్యటించాల‌ని ప‌వ‌న్ కల్యాణ‌్ నిర్ణయించుకున్నారు. ఇక‌, విశాఖ‌లో లాంగ్ మార్చ్ చేయాల‌ని కూడా గ‌తంలోనే ప‌వ‌న్ నిర్ణయించుకున్నారు. ఇక‌, క‌ర్నూలులో నూ ఈ నెల‌లో ప‌ర్యటించాల‌ని అనుకున్నారు. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ నిర్ణయాలు ప‌వ‌న్ చేతుల్లో లేవ‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం.. ప‌వ‌న్ షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోవ‌డ‌మే. ఇప్పటికే లాంగ్ మార్చ్‌ను సుదీర్ఘంగా పోస్ట్ పోన్‌చేశారు.

రాజధాని విషయంలో…..

ఇక‌, రాజ‌ధాని విష‌యంపై గ‌తంలో రెండు మూడు రోజుల కు ఒక‌సారైనా స్పందించిన ప‌వ‌న్‌ కల్యాణ్ ఇప్పుడు దాదాపు 20 రోజులుగా ఇదిగో వ‌స్తా.. అదిగో వ‌స్తా.. అని ప్రక‌ట‌న‌లు గుప్పించ‌డ‌మే త‌ప్ప ఆయ‌న అడుగులు అమ‌రావ‌తి వైపు ప‌డింది లేదు. మ‌రి దీని వెనుక అసలు ఏంజ‌రిగింది అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే ఆయ‌న ఎవ‌రితో అయితే చెలిమి చేస్తున్నాడో ఆ పార్టీనే ఇప్పుడు ప‌వ‌న్‌ను అడ్డుకుంటోంద‌ని బీజేపీ సిద్ధాంతాల ప్రకారమే ప‌వ‌న్ అడుగులు వేయాల్సి వ‌స్తోంద‌ని స‌మాచారం. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న ప‌ర్యట‌న‌ల‌ను, కార్యక్రమాల‌ను కూడా వాయిదా వేసుకుంటున్నార‌ని అంటున్నారు. ఈనెల 15వ తేదీ పవన్ పర్యటన రాజధానిలో ఉండనుంది. మరి ఇది కూడా జరుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News