వద్దుపొమ్మంటున్నారే

పవన్ కల్యాణ్ ది విచిత్రమైన పరిస్థితి. పవన్ కల్యాణ్ కు సినీ గ్లామర్ తో పెద్దయెత్తున అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సామాజికవర్గంతో పాటు [more]

Update: 2020-02-15 12:30 GMT

పవన్ కల్యాణ్ ది విచిత్రమైన పరిస్థితి. పవన్ కల్యాణ్ కు సినీ గ్లామర్ తో పెద్దయెత్తున అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సామాజికవర్గంతో పాటు అభిమానులు కలిస్తే ప్లస్ పాయింటే కాని మైనస్ కాదు. కానీ పవన్ కల్యాణ్ ను దయచేసి తమ వద్దకు మాత్రం తేవద్దంటున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. ఆయనను కేవలం సీఏఏ సభల వరకూ పరిమితం చేయాలని, తెలంగాణలో ఎలాంటి రాజకీయ సభలకు ఆయనను ఆహ్వానించవద్దని అధిష్టానానికి తెలియజేశారట.

ఏపీలో పొత్తు ఉన్నా…..

ఇటీవల పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ, బీజేపీ కలసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ కూడా ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ బీజేపీతో కలసి నడవడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు కలసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది.

ఇక్కడా ఉపయోగించుకోవాలని…

కానీ పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణలోనూ ఉపయోగించుకోవాలని అధిష్టానం ఆలోచిస్తోంది. తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ కు పెద్దయెత్తున అభిమానులు ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ ను తెలంగాణలో ఉపయోగించు కోవాలని బీజేపీ పెద్దల ఆలోచన. పవన్ కల్యాణ్ సభలకు పెద్దయెత్తున అభిమానులు, ప్రజలు వస్తుండటంతో తెలంగాణలోనూ పార్టీకి ఆయన సేవలందించేలా ప్లాన్ చేసిందట అధిష్టానం.

అభ్యంతరం తెలిపిన…..

కానీ ఇందుకు తెలంగాణ బీజేపీ నేతలు అంగీకరించలేదు. ఇప్పటికీ కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని వదలడం లేదని, ఆంధ్రపార్టీగా ముద్రవేసి తెలుగుదేశం పార్టీ ఇక్కడ భూస్థాపితం అయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆంధ్రకు చెందిన నేత పవన్ కల్యాణ్ ను ఇక్కడికి తెస్తే పార్టీ రాజకీయంగా నష్టపోతుందని కూడా వారు హైకమాండ్ ఎదుట కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పవన్ కల్యాణ్ అంశాన్ని రాజకీయం చేసే అవకాశం ఉందని కూడా వారు చెప్పడంతో హైకమాండ్ కూడా కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ‌్ ను తెలంగాణ నేతలు వద్దని చెప్పడం జనసేనలోనూ చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News