రాజయోగమేనటగా

జనసేన పార్టీ పెట్టి కొన్నేళ్ళుగా పోరాడుతున్న పవన్ కల్యాణ్ కి ఇన్నాళ్ళకు రాజయోగం పట్టనుంది. ఆయన ఆరేళ్ళ క్రితం బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2020-02-01 06:30 GMT

జనసేన పార్టీ పెట్టి కొన్నేళ్ళుగా పోరాడుతున్న పవన్ కల్యాణ్ కి ఇన్నాళ్ళకు రాజయోగం పట్టనుంది. ఆయన ఆరేళ్ళ క్రితం బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసిపెట్టారు. నాడు తెర వెనక ఏమి జరిగిందో కానీ తెర ముందు మాత్రం పవన్ కల్యాణ్ వట్టి చేతులతోనే నిలబడ్డాడు. ఏమీ ఆశించలేదని, ఉదారంగానే మద్దతు ఇచ్చానని పవన్ పదే పదే చెప్పుకున్నారు కూడా . ఇక 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి చతికిలపడ్డారు. తాజాగా ఆయన బీజేపీతో చెలిమికి మళ్ళీ చేయి కలిపారు. ప్రస్తుతానికి ఇది పొత్తుగా ఉన్నా భవిష్యత్తులో విలీనం అవుతుందన్న మాట కూడా ఉంది. మరి ఇన్ని చేసిన పవన్ కి రాజకీయ లాభమేంటి అన్న ప్రశ్న జనసైనికులకే కాదు, అందరికీ వస్తుంది. దానికి తొందరలోనే సమాధానం లభిస్తుందని అంటున్నారు.

కేంద్రమంత్రిగా….

పవన్ కళ్యాణ్ ని ఈ ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి బలమున్న ఏదో రాష్ట్రం నుంచి నామినెట్ చేస్తారట. ఇది మొదటి అంకం. ఆ తరువాత పవన్ కల్యాణ్ కి బడ్జెట్ సమావేశాల తరువాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చి సమాదరిస్తారట. ఆ విధంగా పవన్ కల్యాణ్ కి రాజదండం ఇచ్చి మరీ తెలుగు రాష్ట్రాల జనంలో భారీ ఎత్తున ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. ఈ రకమైన ఒప్పందం ఉండడం వల్లనే పవన్ కల్యాణ్ కూడా తన పార్టీని బేఫికర్ చేస్తూ బీజేపీ చెప్పినట్లుగా చేస్తున్నాడని అంటున్నారు.

టార్గెట్ కేసీఆర్…..

మరో ప్రచారం కూడా ఇపుడు సంచలనంగా ఉంది. పవన్ కల్యాణ్ ను కేసీఆర్ మీదకు బీజేపీ బాణంలా వదలాలన్నది కమలనాధుల ఎత్తుగడగా కనిపిసోంది. తెలంగాణాలో బీజేపీకి కొంత బలం ఉంది. అలాగే అక్కడ పవన్ కల్యాణ్ సినీ చరిష్మా ఉంది. ఆయన సొంత సామాజికవర్గం బలం, భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ని కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాలో విస్త్రుతంగా వాడుకోవాలని బీజేపీ ప్రణాళికలను రచిస్తోందిట . 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలన్నది బలమైన సంకల్పంగా ఉందిట. బీజేపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న బలానికి పవన్ గ్లామర్ తోడు అయితే విజయం తధ్యమని భావిస్తున్నారు.

వాడేసుకుంటారుట…..

అదే విధంగా ఏపీలో కూడా పవన్ కల్యాణ్ ను కేంద్ర మంత్రిగా చూపించి వాడుకోవాలన్నది కమలనాధుల ఎత్తుగడగా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పదవి ఉంది. మరి పవన్ ని కేంద్ర మంత్రిగా చూపిస్తే పొలిటికల్ గా ఆయనకు గ్రాఫ్ పెరగడమే కాదు, బలంగా కూడా జనంలో కనిపిస్తారరని, ఫలితంగా రాజకీయ సమీకరణలు మారుతాయని అంచనా కడుతున్నారు. అలాగే, దక్షిణాదిన జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కల్యాణ్ ని వాడుకుంటారు. అలాగే దేశవ్యాప్తంగా పవన్ సేవలను బాగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

ఇక విలీనమే…

పవన్ కల్యాణ‌్ పార్టీ జనసేనను బీజేపీలో విలీనం చేయడం తధ్యమన్న మాట కూడ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. జనసేన ప్రతినిధిగా కేంద్ర మంత్రి హోదా కంటే బీజేపీ మనిషిగా పవన్ ని చేసుకుని అందలం ఎక్కించాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. మొత్తం మీద చూసుకుంటే పవన్ కల్యాణ‌్ కి అధికార యోగం తొందరలోనే పట్టబోతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News