గోక్కుంటున్నట్లేనా?

రాజకీయాలంటే సినిమాలు కాదు. మూడు గంటల్లో తేల్చేయడానికి. స్క్రీన్ మీద చూపించిన హీరోయిజం రాజకీయాల్లో ప్రదర్శించాలంటే సాధ్యం కాదు. ఇది నిజ జీవితం. ఐదు కోట్ల మందితో [more]

Update: 2020-01-21 13:30 GMT

రాజకీయాలంటే సినిమాలు కాదు. మూడు గంటల్లో తేల్చేయడానికి. స్క్రీన్ మీద చూపించిన హీరోయిజం రాజకీయాల్లో ప్రదర్శించాలంటే సాధ్యం కాదు. ఇది నిజ జీవితం. ఐదు కోట్ల మందితో డీల్ చేయాల్సిన అంశం. సీరియస్ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు అనేక మార్గాలున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం డైలాగ్ లతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ దుందుడుకు చర్యలతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందన్న సామెతను పవన్ కల్యాణ్ విషయంలో గుర్తు చేస్తున్నారు.

సర్కార్ ను కూల్చివేస్తానని…..

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసేంత వరకూ తాను నిద్రపోనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శపథం చేశారు. రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్లదని కూడా పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని శాశ్వతంగా అమరావతిలోనే ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ అధికార పార్టీకి చేస్తున్న హెచ్చరికలు మరీ ఎక్కువయ్యాయంటున్నారు. 151 మంది సభ్యులున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూల్చివేయగలరన్న ప్రశ్న తలెత్తుతోంది.

సినిమా లోకం నుంచి…..

నిజానికి సినిమాలోకం నుంచి పవన్ కల్యాణ్ ఇంకా బయటకు రాలేకపోతున్నారన్న వాదన వినపడుతోంది. సినిమా ప్రీ ఈవెంట్, సక్సెస్ మీట్ లో అభిమానులను చూసి ఉగిపోతున్న హీరోల్లా పవన్ కల్యాణ్ వ్యవహార శైలి రాజకీయాల్లో కన్పిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఆచితూచి మాట్లాడుతుంది. ఈరోజు ఉదయమే ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని మరొకసారి స్పష్టం చేశారు. అయినా పవన్ కల్యాణ్ మాత్రం తాను ప్రభుత్వాన్ని కూల్చి వేస్తానని చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

బీజేపీ అసహనం….

అనవసరంగా పవన్ కల్యాణ్ తో జతకట్టి కొరివితో తలగోక్కున్నామా? అన్న చర్చ వారిలో బయలుదేరింది. కేంద్ర ప్రభుత్వం అండ ఉందన్న కారణంగానే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పటికే కొందరు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రేపు జనసేన, బీజేపీ నేతల సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కూల్చివేత అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కామెంట్స్ చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, లేకుంటే ప్రజల్లో పలుచన అయిపోతామని బీజేపీ నేతలు పవన్ కు చెబుతారని తెలుస్తోంది.

Tags:    

Similar News