గాజువాక గాండ్రిస్తుందిగా

పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్టారిజం రాజకీయాల్లో ఏ రకంగానూ పనికిరాకుండా పోయింది. [more]

Update: 2020-01-11 06:30 GMT

పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్టారిజం రాజకీయాల్లో ఏ రకంగానూ పనికిరాకుండా పోయింది. ఓ సామాన్యమైన నాయకుడు, మాజీ కార్పోరేటర్ తిప్పల నాగిరెడ్డి పవన్ మీద గెలిచారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేతగా జగన్ ఒక మాట చెప్పారు. మనకు రీల్ హీరోలు వద్దు, రియల్ హీరోను ఎన్నుకోండి అని. జనం కూడా అలాగే డిసైడ్ అయ్యారు. దాంతో పవన్ కల్యాణ్ కు తొలి ఎన్నికల్లోనే పరాభవం తప్పింది కాదు.

అమరావతే ముద్దా..?

ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రాజధాని ఉండాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. తాను పోటీ చేసిన గాజువాక సమీపంలో రాజధాని పెడతాను అని వైసీపీ సర్కార్ అంటే వద్దు పొమ్మంటున్నారు. మరి పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక జనం మాత్రం విశాఖలో రాజధాని కావాలని కోరడమే చిత్రం. దీని మీద విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ మీద గుస్సా అయ్యారు. అమరావతి మీద అంత ప్రేమ ఉన్న వాడివి అక్కడే పోటీ చేయలేకపోయావ్. మా గాజువాక అంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావ్ అని కస్సుమంటున్నారు. చంద్రబాబు తానా అంటే తందానా అనడమే పవన్ కల్యాణ్ కి తెలుసని, ఆయనకు రాష్ట్రం మీద రాజకీయాల మీద కూడా అవగాహన లేదని మంత్రి అంటున్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అయితే పవన్ కల్యాణ్ కి కొత్త పేరు పెట్టేశారు. ఆయన్ని పీకే పాల్ అంటున్నారు. క్లారిటీ లేకుండా మాట్లాడడం పవన్ కే చెల్లిందని గుడివాడ సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడ జనం పవన్ని అభిమానించి 56 వేల వరకూ ఓట్లు వేశారు. మరి పవన్ కల్యాణ్ మాత్రం విశాఖ వద్దు, అమరావతి ముద్దు అనడాన్నే వారు తట్టుకోలేకపోతున్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృధ్ధికి రాజధాని ఇస్తామంటే పవన్ వద్దని అడ్డుపడడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ జనసైనికుడి మాట….

ఇదిలా ఉండగా అన్నయ్య ప్రజారాజ్యంలోనూ, తమ్ముడు జనసేనలోనూ పని చేసిన నేతగానూ, ఇక ప్రజారాజ్యం తరఫున 2009లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడుగా ఉన్న చింతలపూడి వెంకటరామయ్య సైతం జై జగన్ అనేస్తున్నారు. విశాఖ రాజధానికి పూర్తిగా అర్హమైనదని కూడా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. విశాఖను ఏనాడో రాజధానిగా పెట్టాల్సిందని, ఇన్నాళ్ళకు జగన్ కి ఆ ఆలోచన వస్తే అడ్డుకోవడం తగదని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ పోటీ చేసిన చోట గానీ, అక్కడ ఆయన పార్టీ తరఫున పనిచేసిన వారు గానీ విశాఖ అభివృధ్ధికి పవన్ కల్యాణ్ ను అడ్డుపడవద్దని గట్టిగానే కోరుతున్నారు

బాధ్యత లేదా…?

దీని మీదనే విశాఖ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కన్నబాబు కూడా పవన్ కల్యాణ్ మీద హాట్ కామెంట్స్ చేశారు. బాధ్యత లేకుండా పవన్ మాట్లాడుతూ అమరావతి రైతులను రెచ్చగోడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అంటున్న పవన్ గాజువాక వచ్చి అక్కడ జనాలకు విశాఖకు రాజధాని వద్దు అని చెప్పగలరా అంటూ సవాల్ చేశారు. మరి పవన్ కల్యాణ్ ఈ సవాల్ ని స్వీకరించి విశాఖ వచ్చి ఇక్కడ రాజధాని దండుగ అని మాట్లాడితే బాగుంటుందేమో, పనిలో పనిగా జై అమరావతి అని ఇక్కడ నుంచే అంటే ఇంకా బాగుంటుందేమో.

Tags:    

Similar News